ప‌వ‌న్ మౌనం – జ‌న‌సేన‌కు న‌ష్టం!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మౌనం ఆయ‌న సొంత పార్టీ జ‌న‌సేన‌కు న‌ష్టం తెస్తోంది. మూడో ప్ర‌త్యామ్నాయం అంటూ కోట‌లు దాటేలా మాట్లాడిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చే స‌రికి ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ, వైసీపీల‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్…

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మౌనం ఆయ‌న సొంత పార్టీ జ‌న‌సేన‌కు న‌ష్టం తెస్తోంది. మూడో ప్ర‌త్యామ్నాయం అంటూ కోట‌లు దాటేలా మాట్లాడిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చే స‌రికి ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ, వైసీపీల‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోరాటం సాగించి వుంటే…. ఈ పాటికి జ‌న‌సేన బ‌ల‌ప‌డేది. కానీ ఆయ‌న అలా చేయ‌లేదు. క్షేత్ర‌స్థాయిలో తాను బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించ‌కుండా, కేవ‌లం వైసీపీని తిట్ట‌డానికి స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారు.

టీడీపీ బ‌లంగా వుంటే జ‌న‌సేన కూడా ఉన్న‌ట్టే అని ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్టున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీతో జ‌న‌సేన లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంద‌న్నప్ర‌చారమే చివ‌రికి ప‌వ‌న్‌ను కూడా రెండు చోట్ల జ‌నం ఓడించేందుకు కార‌ణ‌మైంది. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి పున‌రావృతం అవుతోంది. చంద్ర‌బాబునాయుడిపై రూ.118 కోట్ల ముడుపుల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

చంద్ర‌బాబుకు ఐటీశాఖ నోటీసులు ఇవ్వ‌డంతో ఇంత కాలం ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగింది. ఈ నేప‌థ్యంలో బాబుకు ఐటీ నోటీసుల‌పై ఎందుకు మాట్లాడ్డం లేద‌ని ప‌వ‌న్‌ను వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. చంద్ర‌బాబుకు ద‌త్త పుత్రుడు కావ‌డం వ‌ల్లే నోరు తెర‌వ‌డం లేద‌ని ప‌వ‌న్ ధోర‌ణిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబుతో అధికారికంగా ప‌వ‌న్‌కు ఎలాంటి రాజ‌కీయ అవ‌గాహ‌న లేదు. మ‌రోవైపు చంద్ర‌బాబు త‌న పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టిస్తూ పోతున్నారు.

జ‌న‌సేన‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా టీడీపీ నేత‌లు త‌మ ప‌ని చేసుకుపోతున్నారు. టీడీపీ త‌మ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా రాజ‌కీయ కార్య‌క‌లాపాలు సాగిస్తూ, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌, క‌స‌ర‌త్తు చేస్తుండ‌డంతో జ‌న‌సేన ప్రేక్ష‌క‌పాత్ర‌లో నిమ‌గ్న‌మైంది. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ‌కు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో తెలియ‌ద‌ని, కానీ చంద్ర‌బాబు కోసం ప‌వ‌న్ మౌనాన్ని ఆశ్ర‌యించ‌డం ద్వారా జ‌న‌సేన‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు వాపోతున్నారు.

రాజ‌కీయాల్లో ఒక అవ‌గాహ‌న లేకుండా త‌న‌కు తానుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీకి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌డం విచిత్ర‌మైన ప‌రిస్థితి అని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల జ‌న‌సేన న‌ష్ట‌పోవాల్సి వ‌స్తోంద‌ని ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. బాబుకు ఐటీ నోటీసులు వ‌స్తే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉలిక్కి ప‌డే ప‌రిస్థితి రావ‌డం ఏంటో అంతు చిక్క‌డం లేద‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. ఏది ఏమైనా ప‌వ‌న్ మౌనం రాజ‌కీయంగా త‌మ‌కు త‌ప్ప‌క న‌ష్టం తెస్తుంద‌నే అభిప్రాయానికి జ‌న‌సేన నేత‌లు వ‌చ్చారు.