పొరుగిల్లు అలికే ప్రయత్నం వారికెందుకు?

మన ఇల్లు మనం అలికి శుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది. అడక్కపోయినా సరే, పొరుగిల్లు అలికి శుభ్రం చేయాలనుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా మన ఇంటి సంగతి చూసుకోకుండా ఆ పనిచేస్తే ఎలా ఉంటుంది?…

మన ఇల్లు మనం అలికి శుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది. అడక్కపోయినా సరే, పొరుగిల్లు అలికి శుభ్రం చేయాలనుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా మన ఇంటి సంగతి చూసుకోకుండా ఆ పనిచేస్తే ఎలా ఉంటుంది? సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు వ్యవహారం కూడా అలాగే ఉంది. 

ఆయన తమ పార్టీ వ్యవహారం చూసుకోకుండా, ఇతర పార్టీలకు సలహాలు ఇస్తున్నారు. ఎవరి పార్టీ బాగోగులు వారు ప్లాన్ చేసుకోగలరు గానీ, ఆయన మాత్రం.. అన్ని పార్టీలను దారిలోపెట్టడం, సంస్కరించడం తన బాధ్యత అని అనుకుంటున్నట్టుగా ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ కి అనుకూలంగా వ్యవహరించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీలు పునరాలోచించుకోవాలని బీవీ రాఘవులు సూచిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడం గురించి ఈ పార్టీలను ఆయన హెచ్చరిస్తున్నారు. టెక్నికల్ గా చూసినప్పుడు.. ఆయన చెప్పిన పార్టీలు పరస్పర వైరభావంతో ఉన్న కూటములు. అందరినీ ఆయన ఒకేరకంగా.. ఒకే గాటన కట్టేస్తున్నారు. ఆయా పార్టీల్లో ఆయనకు భాజపాతో అనుకూలంగా ఉండడం అనే కోణం తప్ప మరేం కనిపిస్తున్నట్టుగా లేదు.

రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన రాఘవులు ఒక లాజిక్ మిస్సవుతున్నారు. జనసేన అనేది భాజపా చంకలో కూర్చుని రాజకీయం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అనేది, భాజపా-జనసేనలను ఉమ్మడిగా తన పల్లకీ బోయీలుగా వాడుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. భాజపాతో కూడా చంద్రబాబు పల్లకీ మోయించాలని, అలాంటి సంకల్పానికి… ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకపోవడం’ అనే ముసుగు తొడుక్కోవాలని పవన్ కల్యాణ్ ఉబలాటపడుతున్నారు. 

ఆ రకంగా తెలుగుదేశం, జనసేన భాజపాతో ఊరేగడానికి ఎగబడుతున్నాయని అంటే అర్థముంది. వైసీపీ మీద రాఘవులు అలాంటి నింద ఎలా వేయగలరు? ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒంటరిగా మాత్రమే బరిలో ఉంటామని దమ్ముగా చెప్పుకునే పార్టీ వైసీపీ. పార్లమెంటులో బిల్లుల విషయంలో కేంద్రానికి మద్దతు ఇవ్వడం అనేది అంశాల వారీగా ఉంటుంది. అందుచేత వైసీపీకి కాషాయరంగు పులమాలంటే కుదరదు కదా! అనేది ప్రజల సందేహం.

వామపక్షాలు పార్టీలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తమ అస్తిత్వం కోల్పోతున్నాయి. ఇండియా కూటమిలో ఉంటూ కాంగ్రెసుతో అంటకాగుతూనే.. తెలంగాణలో కేసీఆర్ తో జట్టుకట్టాలని చూశాయి. ఏపీలో చంద్రబాబు భజన చేయడానికి తెగబడుతుంటాయి. ఒక స్థిరత్వంలేని రాజకీయంతో ఎప్పటికప్పుడు తమ ప్రయోజనాల కోసం ఉవ్విళ్లూరుతుంటాయి. వీరు కూడా ఇతరుల మీద నిందలు వేయడం, ఇతరులు పాటించాల్సిన నియమాలను నిర్దేశించడం కామెడీగా ఉంటోంది.