విశాఖ చరిత్రలో అతి పెద్ద విలయంగా చెప్పుకోవాలి హుదూద్ తుఫాన్. 2014 అక్టోబర్ లో వచ్చిన హుదూద్ తుఫాన్ ఉక్కు నగరాన్ని గడగడా వణికించింది. విశాఖ ఏమైపోతుందో అని ఒక దశలో అంతా అనుకున్నారు. కానీ లక్కీగా పెద్ద ముప్పు తప్పింది.
హుదూద్ తుఫాన్ వెళ్ళిపోయాక వచ్చిన నాటి సీఎం చంద్రబాబు తానే హుదూద్ తుఫాన్ని ఆపేశాను అని చెప్పుకున్న సందర్భం ఉంది. హుదూద్ ని ఎదిరించిన విశాఖ అని ఆయన మరో డైలాగు పేల్చారు. హుదూద్ తరువాత విశాఖను మళ్లీ తానే పూర్వ వైభవం వచ్చేలా చూశాను అని ఆయన క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే పచ్చదనం అంతా కోల్పోయిన విశాఖ తిరిగి ప్రకృతి కరుణతోనే చిగురించి తన సహజసిద్ధమైన తీరులో పూర్వపు సొగసుని సంతరించుకుంది. ఇది అసలు విషయం. ఇక హుదూద్ తుఫాన్ టైం లో ప్రధాని మోడీ విశాఖకు వచ్చారు. తక్షణ సాయంగా వేయి కోట్లు ప్రకటించారు. కానీ అందులో ఎంత దక్కింది దాని మీద అనేక కధనాలు ఉన్నాయి.
ఇదంతా ఎందుకంటే హుదూద్ వేళ విశాఖను ఆదుకున్నది ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు. విశాఖను మళ్ళీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధానిదే అని ఆయన ఎనిమిదేళ్ల నాటి హుదూద్ సహాయక క్రెడిట్ ని బీజేపీ ఖాతాలో వేశారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలలో బీజేపీ విజయం కోసం కాలికి బలపం కట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతున్న సోము వీర్రాజు విశాఖవాసులకు వారికి తెలిసిన హుదూద్ కధను కేంద్ర సాయాన్ని కొత్తగా చెబుతున్నారు అని అంటున్నారు. విశాఖ అభివృద్ధి అంతా కేంద్ర చలవే అని ఆయన మరో మాట కూడా చెప్పారు. బీజేపీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలి అని ఆయన కోరుతున్నారు. హుదూద్ ని అర చేత అడ్డుపెట్టామని చెప్పుకుంటున్న తెలుగుదేశం వారు బీజేపీ మాటలను వింటే ఎలా రియాక్ట్ అవుతారో కదా.