గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జీవో నంబర్-1 రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ జీవో ప్రస్తుతం న్యాయ పరిధిలో వుంది. ఈ జీవోను అడ్డు పెట్టుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అదే పని చేస్తుంది. ఇందులో వైసీపీ, టీడీపీలను తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే రాజకీయ కౌంటర్, ఎన్కౌంటర్లలో లాజిక్ అనేది ముఖ్యం. అది ఎవరి వైపు నుంచి బలంగా వుంటుందో, దాని వైపు ప్రజల మొగ్గు వుంటుంది.
జీవో నంబర్-1తో ప్రతిపక్ష పార్టీల భావ ప్రకటనా స్వేచ్ఛను, అలాగే ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణచివేస్తోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ జీవోను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేయడంపై వైసీపీ సోషల్ మీడియా దీటుగా అటాక్ చేస్తోంది.
చంద్రబాబు డిమాండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం సదరు జీవోను వెనక్కి తీసుకుంటుందని, మరి 11 మంది ప్రాణాలను వెనక్కి తీసుకొ స్తారా? అని వైసీపీ సోషల్ మీడియా తూటా పేల్చింది. ఇదే ఏపీ గుండె చప్పుడుగా వైసీపీ అభివర్ణిస్తోంది. అసలు ఈ జీవో రావడా నికి ప్రధాన కారణం… చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడమే. కందుకూరు, గుంటూరులలో తన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారనే కనీస స్పృహ కూడా చంద్రబాబు, ఆయన పార్టీ నేతల్లో కొరవడం గమనార్హం.
బాధిత కుటుంబాలకు సాయం అందించడానికి వెళ్లిన చంద్రబాబును, ఓ బాలుడు తమకు డబ్బు వద్దని, నాన్న కావాలని కోరిన సంగతి తెలిసిందే. ఇలాంటివైనా చంద్రబాబు మనసును మార్చకపోవడం ఆయన అవకాశవాద రాజకీయానికి నిదర్శనమని వైసీపీ ఎదురుదాడికి దిగింది. జీవో నంబర్-1 కేంద్రంగా ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.