మూడు రాజధానుల వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిల తొలగింపుపై ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి నిదర్శనం హైకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలే.
మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టిన మొదటి రోజే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ధర్మాసనాన్ని అభ్యర్థించింది.
రాజధాని పరిధిలో న్యాయమూర్తులకు అప్పటి ప్రభుత్వం (చంద్రబాబు) చదరపు గజం రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి 600 గజాల స్థలం కేటాయించిందని ఆ పిటిషన్‌లో తెలిపారు. ప్రస్తుతం ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు కూడా లబ్ధిదారులని, కావున విచారణ ధర్మాసనంలో వాళ్లిద్దరు ఉండడం సబబుకాదని సీనియర్ న్యాయవాది ధుష్యంత్ దవే గట్టిగా వాదించారు.
ఇందుకు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ నుంచి తప్పుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తాను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ఆయన ఎదురు ప్రశ్నించడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. ఈ కేసులో తమ ధర్మాసనమే వాదనలు వింటుందని తేల్చి చెప్పారు.
ఇదే సందర్భంలో ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా తన డిమాండ్ విషయంలో పట్టువీడలేదు. విచారణ నుంచి తప్పుకోవాలన్న తమ పిటిషన్‌పై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని దుష్యంత్ దవే సీజేను కోరారు.
తమ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఆయన వాదించడం గమనార్హం. దానిపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఆ ఇద్దరు జడ్జిల విషయంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి త్రిసభ్య ధర్మాసనం నుంచి వాళ్లిద్దరిని తప్పించేందుకు పోరాటం చేస్తుందని దుష్యంత్ దవే వాదనలను బట్టి అర్థమవుతోంది.