గంజాయి అక్రమ రవాణాపై తెలుగు రాష్ట్రాల్లో గట్టి నిఘా కొనసాగుతున్న వేళ.. ఊహించని కోణం ఒకటి బయటపడింది. గంజాయిని ఏకంగా ఈ-కామర్స్ సైట్ అమెజాన్ వేదికగా సప్లయ్ చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ పోలీసులు ఈ స్మగ్లింగ్ ను అరికట్టారు.
అమెజాన్ ద్వారా గంజాయి పార్శిల్స్
మధ్యప్రదేశ్ కు చెందిన సూరజ్ అలియాస్ కల్లూ పావనియా అమెజాన్ లో సెల్లర్ గా తన పేరు నమోదు చేసుకున్నాడు. ఆయుర్వేద ఉత్పత్తులు, కరివేపాకు సరఫరా చేస్తానంటూ రిజిస్టర్ అయ్యాడు. పైకి కరివేపాకు పేరు చెప్పి, పార్శిల్స్ లో గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు.
ఇతడు సరఫరా చేసే గంజాయి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. అలా గడిచిన 4 నెలల్లో కోటి 10 లక్షల రూపాయల గంజాయిని అమెజాన్ ద్వారా ఇతడు సరఫరా చేశాడు.
తీగ ఎలా దొరికింది.. డొంక ఎలా కదిలింది
మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఉన్న పింటూ అలియాస్ బిజేంద్ర సింగ్ తోమర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు సూరజ్. ఇతడికి భింద్ లో రోడ్డు పక్కన చిన్న ధాబా ఉంది. ఆ దాబా అడ్రస్ కు మినిమం గ్యాప్స్ లో సూరజ్ నుంచి అమెజాన్ ద్వారా పార్శిల్స్ వస్తున్నాయి. దాబా నుంచి మధ్యప్రదేశ్ అంతటా ఈ గంజాయి సరఫరా అయిపోతోంది.
గంజాయి స్మగ్లింగ్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు, దాబా కేంద్రమనే విషయాన్ని గుర్తించారు. మెరుపు దాడులు చేశారు. 20 కిలోల గంజాయిని స్పాట్ లో పట్టుకున్నారు. తమదైన స్టయిల్ లో ప్రశ్నిస్తే పింటూ మొత్తం చెప్పేశాడు. విశాఖ నుంచి ఈ గంజాయి అమెజాన్ ద్వారా సరఫరా అవుతున్నట్టు గమనించారు పోలీసులు.
అమెజాన్ వెర్షన్ ఏంటి..?
ఈ మొత్తం వ్యవహారంపై అమెజాన్ కూడా స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. అమెజాన్ తనిఖీ ప్రక్రియపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ఐఫోన్ అడిగితే ఇటుకలు పంపించే అమెజాన్, ఇప్పుడు కరివేపాకు అడిగితే గంజాయి పంపిస్తోందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పోలీసులు మాత్రం అమెజాన్ పై సీరియస్ గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమౌతున్నారు.