లోకేశ్ పాద‌యాత్ర‌కు ప్ర‌చారం ఎలా?

టీడీపీ యువ‌కిశోరం, ఆ పార్టీ ఆశా కిర‌ణం నారా లోకేశ్ పాద‌యాత్ర‌కు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేశ్ పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు. అయితే లోకేశ్ పాద‌యాత్ర‌కు హైప్ తీసుకురావ‌డం ఎలా?…

టీడీపీ యువ‌కిశోరం, ఆ పార్టీ ఆశా కిర‌ణం నారా లోకేశ్ పాద‌యాత్ర‌కు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేశ్ పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు. అయితే లోకేశ్ పాద‌యాత్ర‌కు హైప్ తీసుకురావ‌డం ఎలా? అనేది ఎల్లో బ్యాచ్‌కు అర్థం కాని ప్ర‌శ్న‌గా మారింది. లోకేశ్ పాద‌యాత్ర విజ‌య‌వంతం కావ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వ చేత‌ల్లో వుంద‌ని టీడీపీ బ‌లంగా న‌మ్ముతోంది. పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డం ద్వారా లోకేశ్‌కు విశేష ప్రాధాన్యం ల‌భిస్తుంద‌ని టీడీపీ వ‌ర్గాలు ఆశిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అప్పుడే లోకేశ్ పాద‌యాత్ర‌కు సంబంధించి ఎల్లో మీడియా ర‌చ్చ మొద‌లు పెట్టింది. ఈ నెల రెండో వారంలో లోకేశ్ పాద‌యాత్ర‌కు డీజీపీ మొద‌లుకుని చిత్తూరు ఎస్పీ, అలాగే డివిజ‌న్‌, మండ‌ల స్థాయిల్లో పోలీస్ అధికారుల‌కు అనుమ‌తి కోరుతూ లేఖ‌లు అందించామ‌ని, ఇంత వ‌ర‌కూ అటు వైపు నుంచి ఎలాంటి స‌మాచారం లేద‌ని గ‌గ్గోలు మొద‌లు పెట్టారు. లోకేశ్ పాద యాత్ర‌ను అడ్డుకోడానికే వైసీపీ ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంద‌నే వాద‌న‌ను తెర‌పైకి తీసుకొస్తున్నారు. త‌ద్వారా లోకేశ్‌ను నాయ‌కుడిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  

ఇప్ప‌టికే జీవో నంబ‌ర్‌-1 అంశం ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ జీవోపై ప్ర‌స్తుతం న్యాయ‌పోరాటం సాగుతోంది. కందుకూరు, గుంటూరుల‌లో విషాద ఘ‌ట‌న‌ల త‌ర్వాత ప్ర‌జల ప్రాణాల‌ను కాపాడేందుకంటూ వైసీపీ ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధన‌ల‌ను తీసుకొచ్చింది. రోడ్లు, ఇరుకు వీధుల్లో స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని పోలీసులు తేల్చి చెప్పారు. ఏదైనా త‌మ అనుమ‌తి లేనిదే చేయ‌కూడ‌ద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

లోకేశ్ పాద‌యాత్ర‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని చూస్తే… ప్ర‌భుత్వం అడ్డుకునేందుకు ఆస‌క్తి చూపుతోంద‌ని అర్థ‌మ‌వుతోందంటూ టీడీపీ, దాని అనుబంధ మీడియా ప్ర‌చారానికి తెర‌లేపాయి. ఇలాగైనా లోకేశ్ గురించి ప‌ది మందికి తెలిసే అవ‌కాశం వుంటుంద‌నే వారి తాప‌త్రాయాన్ని అర్థం చేసుకోవచ్చు. లోకేశ్ పాద‌యాత్ర సాఫీగా సాగితే ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నే భ‌యం టీడీపీని వెంటాడుతోంది. 

వైసీపీ ప్ర‌భుత్వం తెలివిగా లోకేశ్ పాద‌యాత్ర‌కు ఎలాంటి అడ్డంకులు సృష్టించ‌కుంటే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు లోలోప‌ల మ‌ధ‌న‌ప‌డుతున్నారు. అయితే వైసీపీ స‌ర్కార్ తెలివితేట‌ల‌పై టీడీపీకి ఎంతో విశ్వాసం, న‌మ్మ‌కం ఉండ‌డంతో త‌ప్ప‌క లోకేశ్ పాద‌యాత్ర విజ‌య‌వంతంగా మొద‌ల‌వుతుంద‌ని భావిస్తోంది. మ‌రి ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.