తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సొంత ప్రభుత్వం కోరలు పీకేసింది. దీంతో ఆయన పరిస్థితి దయనీయంగా తయారైంది. తనను వైసీపీ గెంటేస్తుందని ఆనం అసలు ఊహించలేదు. అయితే తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరి నేతల్లా కాదనే తత్వం ఆనంకు బోధపడింది. ప్రస్తుతం వెంకటగిరిలో ఆయనకు ఎలాంటి పవర్స్ లేకుండా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో నీళ్ల ఒడ్డున పడ్డ చేపలా ఆయన పరిస్థితి తయారైంది. రస్తుతం సాంకేతికంగా మాత్రమే ఆయన వైసీపీలో ఉన్నట్టు లెక్క. తనను వైసీపీ తీవ్రంగా అవమానిస్తోందని, ఇక ఈ పార్టీలో కొనసాగడం వృథా అని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఆనం వర్గీయులుగా ముద్రపడిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై ఆనం తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
ఆత్మీయులతో చర్చిస్తున్నారు. నెల్లూరు సిటీ, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఆనం కుటుంబానికి చెప్పుకోతగిన బలం వుంది. ఈ రెండు చోట్ల రానున్న ఎన్నికల్లో కుటుంబ సభ్యుల్ని బరిలో దించేందుకు ఆనం రామనారాయణరెడ్డి ఆలోచిస్తున్నారని తెలిసింది. రెండు నియోజకవర్గాల్లో తన కుటుంబానికి సీట్లు ఇస్తే… టీడీపీలో చేరడానికి ఆయన సిద్ధపడుతున్నారని సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి అధ్వానంగా వుంది. దీంతో ఆనం రాక పార్టీకి బలమే అని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
వైసీపీ అధిష్టానం కాదన్న తర్వాత ఇక ఆ పార్టీలో కొనసాగడం మంచిది కాదనే ఆలోచనలో ఆనం ఉన్నట్టు తెలిసింది. మార్చి తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఈ మేరకు టీడీపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆనం వ్యక్తిగత బలం తోడైతే ఒకట్రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి తిరుగు వుండదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి తర్వాత …ఆనం మరొక కండువాతో కనిపించనున్నారు.