బాబు జాడ కూడదు కేసీఆర్

సరైన రూట్లో వెళ్లేవారిని ఎవరైనా అనుసరించవచ్చు. రాంగ్ రూట్లో వెళ్లిన వాళ్లని అనుసరించకూడదు. తెలివైన రాజకీయ వేత్త అనిపించుకుని, సరైన టైమ్ లో సరైన ఎత్తుగడలు వేయగలరు అనే పేరు తెచ్చుకున్న కేసీఆర్ కూడా…

సరైన రూట్లో వెళ్లేవారిని ఎవరైనా అనుసరించవచ్చు. రాంగ్ రూట్లో వెళ్లిన వాళ్లని అనుసరించకూడదు. తెలివైన రాజకీయ వేత్త అనిపించుకుని, సరైన టైమ్ లో సరైన ఎత్తుగడలు వేయగలరు అనే పేరు తెచ్చుకున్న కేసీఆర్ కూడా ఇప్పుడు రాంగ్ డైరక్షన్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో చిరకాలంగా తెరాసకు సరైన రాజకీయ ప్రత్యర్థి భాజపానే. కాంగ్రెస్ కు నాయకులు వున్నారు కానీ కేడర్ మిగిలి లేదు. రేవంత్ రెడ్డి ఎంత హంగామా చేసినా కాంగ్రెస్ వయసు అయిపోయింది. కేడర్ లేకుండా పోయింది. 

అయితే భాజపా విషయంలో కేసీఆర్ ఒక సరైన ఫిక్స్ డ్ వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపించడం లేదు. కోపం వస్తే ఓ విధంగా, కోపం రాకుంటే మరో విధంగా అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. లోకల్ భాజపాతో ఎలా వున్నా, కేంద్రంతో మాత్రం కాస్త సఖ్యతతోనే వెళ్తూ వచ్చారు ఇన్నాళ్లూ. లోకల్ లీడర్ల మీద కారాలు, మిరియాలు నూరడం, కేంద్రం దగ్గర పెద్దగా మాట్లాడకపోవడం అనే స్కీమునే అమలు చేస్తూ వచ్చారు.

కానీ ఇప్పుడు వ్యవహారం శృతి మించుతోంది అన్న సంకేతాలు అందుతుంటే, మరోసారి సార్వత్రిక ఎన్నికలు సుదూరంలో కనిపిస్తుంటే కేసీఆర్ కొత్త వ్యూహాలకు పదునుపెడతారు అనుకుంటే, చంద్రబాబు వాడేసి, ఫెయిల్యూర్ అనిపించుకున్న అస్త్రాన్ని బయటకు తీసారు.

2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు భాజపాతో అంటకాగినంత కాలం అంటకాగారు. కానీ భాజపా ఎప్పుడయితే రాష్ట్రానికి మేలు చేయడం లేదో, ఆ పాపం తన ఖాతాకు కొంతయినా ఎక్కడ అంటుకుంటుందో అని దూరం జరిగారు. దూరం జరిగితే ఫరవాలేదు. తను అధికారంలో వుండి కూడా కేంధ్రంలో అధికారంలో వున్న భాజపా మీద పోరు ప్రకటించారు. 

నిజానికి కేంద్రం మీద ఓ రాష్ట్రం పోరు ప్రకటించడం కొత్త కాదు. గతంలో ఎన్టీఆర్ ఈ పని ఆయన బతికి వున్నంతకాలం చేసారు. ఆయన ఎప్పుడూ అటు ఇటు చేయలేదు. కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకిగానే సాగారు. ఒక్కోసారి ఒక్కో స్టాండ్ తీసుకోలేదు.

కానీ చంద్రబాబు అలా కాదు. అటు వామపక్ష పార్టీలు, ఇటు భాజపా, ఒకసారి కాంగ్రెస్ ఇలా రకరకాలుగా పిల్లి మొగ్గలు వేసారు. ఇదే తెరాసతో కలిసారు, వదిలారు. ఇలా ఒక్కోసారి ఒక్కో స్టాండ్ తీసుకుంటే క్రెడిబులిటీ అనేది దూరం అవుతూ వస్తుంది.

కేసీఆర్ కూడా ఇదే పద్దతితో వున్నారు. ఒక్కోసారి కాంగ్రెస్ ను గట్టిగా టార్గెట్ చేస్తారు. ఒక్కోసారి భాజపాను ఢీ కొనే ప్రయత్నం చేసారు. ఇలా ఢీకొనేటప్పడు కూడా లోకల్ కేడర్ ను గట్టిగా టార్గెట్ చేయడం తప్ప నేషనల్ లీడర్ షిప్ ను టార్గెట్ చేయలేదు.

తీరా ఇప్పుడు పరిస్థితులు చేజారుతున్నాయి అని తెలిసాక, కేంద్రంపై ఏకంగా ధర్నాకు దిగారు. ఇది సామాన్య ఓటరును కాస్త అయోమయానికి గురి చేస్తుంది. ఎందుకంటే అధికారంలో వున్న కేసీఆర్, ఒక ప్రతిపక్ష నాయకుని మాదిరిగా ధర్నా చేయించడం ఏమిటి? ఆయన చేతిలో పవర్ వుంది కదా? ఆయన చేయాల్సింది చేయాలి కదా? అలా చేయకుండా కేంద్రం మీద నెట్టేయడం ఏమిటి? 

ఇలాగే వుంటుంది కామన్ ఓటర్ ఆలోచన. కేంద్రం, రాష్ట్రం అనే తేడాలు కామన్ ఓటర్ కు పెద్దగా పట్టవు. పైగా అధికార పార్టీ ఇలా చేస్తే, ఏదో నెపం వేస్తున్నట్లు, తప్పు ఎవరిమీదకో నెట్టి వేస్తున్నట్లు ఫీలవుతారు. అందుకే సాధారణంగా ఇలాంటివి వర్కవుట్ అయిన దాఖలాలు తక్కువ. 

అలా వర్కవుట్ కావాలి అంటే బెంగాల్ మమత బెనర్జీ మాదిరిగా వుండాలి. ఆమె ఆది నుంచి ఇప్పటి వరకు హార్డ్ కోర్ భాజపా వ్యతిరేకంగా ఫైట్ చేస్తూనే వస్తున్నారు. ఈ ఫైట్ లో ఎక్కడా మార్పులు లేవు. హెచ్చు తగ్గులు లేవు. అలాగే ఈ ఫైట్ అంతా కూడా టి ఎమ్ సి వెర్సస్ భాజపా గానే సాగింది తప్ప సమస్యలు, పరిష్కారం, నెపం, నెట్టి వేత తరహాగా సాగిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు ఫైట్ ఇలా సాగలేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చాక నెపం భాజపా మీదకు వేసే ప్రయత్నమే కనిపించింది. 

దేశం అంతా తిరిగి భాజపాను ఎండగట్టే ప్రయత్నం చేసారు. తీరా ఫలించకపోయేసరికి ఇప్పుడు మళ్లీ అదే భాజపా అండ కోసం తహతహలాడుతున్నారు. ఇదే కీలక తప్పిదం. కేసీఆర్ ఇంత తప్పిదం చేయడం లేదు కానీ, ఇన్నేళ్లలో ఒకటే తరహా పోరాట స్పూర్తిని ప్రదర్శించడం లేదు. అందులో హెచ్చు తగ్గులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు కూడా హుజూరాబాద్ ఓటమి నేపథ్యంలో భాజపా మీద ఫోరు బాటకు మళ్లారు. ఇది జనంలో నెగిటివ్ పాయింట్లకు దారి తీస్తుంది. 

కాకలు తీరిన రాజకీయవేత్త కేసీఆర్ ఇది గమనించుకోవాలి. బెంగాల్ టైగర్ మమత మాదిరిగా వెళ్లడమా? తడవకో రూటు మార్చే బాబు మాదిరిగా వెళ్లడమా అన్నది నిర్ణయించుకోవాలి.