పులివెందుల తర్వాత వైఎస్సార్ జిల్లాలో వైసీపీకి బలమైన నియోజకవర్గం ఏదంటే బద్వేలే. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు అధికార పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి బద్వేలు వైసీపీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి సొంత వాళ్లతోనే పేచీ వచ్చింది.
తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని వైసీపీ నాయకులు నల్లేరు విశ్వనాథరెడ్డి , కాశినాయన జెడ్పీసీటీ సభ్యుడు సత్యనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాశినాయన జెడ్పీటీసీ సభ్యుడు ఎమ్మెల్సీకి డీసీ గోవిందరెడ్డికి స్వయాన తమ్ముడు. తమ్ముడి బామ్మర్ది విశ్వనాథరెడ్డి. బద్వేలు వైసీపీ డీసీ గోవిందరెడ్డి, విశ్వనాథరెడ్డి వర్గాలుగా చీలిపోయింది. కరవమంటే కప్పకు , విడవమంటే పాముకు కోపం అనే రీతిలో బావాబామ్మర్దుల మధ్య అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు సతమతం అవుతున్నారు. విశ్వనాథరెడ్డి దగ్గరికి వెళ్లిన వాళ్లను డీసీ గోవిందరెడ్డి శత్రువులుగా చూస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.
ముఖ్యంగా బద్వేలు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి కారణంగా గోవిందరెడ్డి, విశ్వనాథరెడ్డి మధ్య గొడవలు మొదలయ్యాయని అక్కడి ప్రజలు చెబుతున్న మాట. 2004లో విశ్వనాథరెడ్డి అనుచరుడిగా రమణారెడ్డి ఉండేవారు. 2004లో డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రమణారెడ్డి ఆయన వెంట నడిచారు. అలా దగ్గరై.. 2009 నాటికి అత్యంత సన్నిహితుడయ్యాడని సమాచారం.
దీంతో బద్వేలు నియోజకవర్గంలో ఎవరికి ఏ పని చేయాలన్నా రమణారెడ్డే కీలకమనే స్థాయికి ఎదిగారు. ఇదే ఇప్పుడు గోవిందరెడ్డిపై సొంత పార్టీలో వ్యతిరేకతకు దారి తీసింది. బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా రమణారెడ్డి భార్య, వైస్ చైర్మన్‌గా ఆయనకే పదవి కట్టబెట్టారంటే… ఆ నియోజకవర్గంలో హవా ఎవరిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా వుండగా విశ్వనాథరెడ్డి, గోవిందరెడ్డి మధ్య విభేదాలు పూడ్చలేని పరిస్థితికి చేరినట్టు తెలిసింది. వైఎస్సార్‌కు కూడా విశ్వనాథరెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. బద్వేలు నియోజకవర్గంలో తనకంటూ సొంత వర్గాన్ని కలిగి ఉన్నారు. కనీసం అంటే 15 వేల ఓట్లను ప్రభావితం చేయగల సమర్థత ఉన్న నాయకుడిగా పేరు పొందారు.
అప్పు అయినా చేసి సొంత పార్టీ నాయకులని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుల మాదిరిగా కష్టాలు పడాల్సి వస్తోందని విశ్వనాథరెడ్డి, ఆయన బావ సత్యనారాయణరెడ్డి అంటున్నారు. వీళ్ల మధ్య సయోధ్య కుదర్చకపోతే భవిష్యత్‌లో వైసీపీ నష్టపోవాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో పులివెందుల తర్వాత బద్వేలు నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చింది. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది.
ఇటీవల విశ్వనాథరెడ్డి, ఆయన వర్గం నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి భేటీ కావాలని నిర్ణయించారు. అయితే వారిని ఆదరిస్తే తాను పార్టీలో ఉండనని, వాళ్లతోనే బద్వేలులో రాజకీయం చేసుకోవాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి బెదిరించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో విశ్వనాథరెడ్డి వర్గంతో భేటీని రద్దు చేసుకోవాల్సిన దయనీయ స్థితి. వైసీపీ కంచుకోటలో ప్రస్తుత దుస్థితి ఇది. విభేదాలు సమసిపోకపోతే మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లబ్ధి పొందడం ఖాయం. వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే నాయకులకు సర్ది చెప్పుకోలేని పరిస్థితి వుంటే, ఇక ఇతర ప్రాంతాల్లో ఏం చేయగలరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.