భారతీయ జనతా పార్టీ నేత, తెలంగాణ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ పై ఫేస్ బుక్ నిషేధాన్ని ప్రకటించింది. తమ ఫ్లాట్ ఫామ్ లో రాజాసింగ్ ను నిషేధిస్తున్నట్టుగా పేర్కొంది. విపరీత స్థాయి ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారనే కారణాలను చూపి ఫేస్ బుక్ రాజా సింగ్ మీద నిషేధాన్ని ప్రకటించింది.
హింసను ప్రేరేపిస్తూ రాజాసింగ్ ఫేస్ బుక్ లో తన విద్వేష ప్రసంగాలను ప్రమోట్ చేస్తున్నారనే అభియోగాలున్నాయి. ఫేస్ బుక్ పెట్టుకున్న నియామావళికి అవి విరుద్ధం. అయినా రాజా సింగ్ పై ఇన్నాళ్లూ చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇండియాలో అధికారంలో ఉన్న కొంతమంది నేతలను ఫేస్ బుక్ కావాలనే విస్మరిస్తోందనే అభియోగాలు అంతర్జాతీయ స్థాయిలో రేగాయి. దీంతో ఫేస్ బుక్ డిఫెన్స్ లో పడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత పోస్టులు పెడుతున్నా, వాటిని డిలీట్ చేస్తున్నాయి సోషల్ నెట్ వర్కింగ్ సంస్థలు. ఇలాంటి నేపథ్యంలో రాజాసింగ్ పై నిషేధాన్ని ప్రకటించింది ఫేస్ బుక్. తన భాగస్వామ్య సంస్థ ఇన్ స్టాగ్రమ్ లో కూడా రాజాసింగ్ ను నిషేధిస్తూ ఆ సంస్థ ప్రకటన చేసింది.