రజనీకాంత్ అన్నాత్తే సినిమా ఊరించి ఉసూరుమనిపించింది. ఇటు బాలకృష్ణ అఖండ మూవీ కూడా అలానే ఊరిస్తోంది. అన్నాత్తేకి ఎలాంటి ఎలివేషన్ ఇచ్చారో.. అఖండని కూడా అలానే లేపుతున్నారు. అక్కడ అన్నాత్తే తేడా కొట్టింది, మరి ఇక్కడ అఖండ పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు ప్రశ్న. బోయపాటిపై గుడ్డిగా నమ్మకం పెట్టుకున్నా కూడా ఈసారి వీర విధేయ దర్శకుడు బాలయ్యని ముంచుతాడో తేలుస్తాడో అనే అనుమానం అందరిలో ఉంది.
అన్నాత్తే దర్శకుడు శివ.. పక్కా మాస్ మసాలా డైరెక్టర్. అజిత్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లిచ్చాడు. అదే నమ్మకంతో రజినీకాంత్ ని కూడా ఓ రేంజ్ లో చూపిస్తారని అభిమానులు అనుకున్నారు. పైగా రజనీకాంత్ వీరాభిమాని శివ. తన అభిమాన హీరోను శివ బాగానే ప్రజెంట్ చేశాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ లుక్, టీజర్ అలా ఉన్నాయి మరి. కట్ చేస్తే.. సినిమాతో అందరికీ ఫుల్ లెంగ్త్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించి పంపించేశాడు శివ.
ఇక్కడ బోయపాటిది కూడా అదే పరిస్థితి. ఈయన కూడా బాలయ్య వీరాభిమాని. ఎన్టీఆర్, రామ్ చరణ్ విషయంలో లెక్క తప్పాడు కానీ.. బాలయ్యకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్లిచ్చాడు. కానీ ఇప్పుడు మరీ అంత మాస్ ని జనాలు తట్టుకోగలరా అనే అనుమానం కూడా ఉంది. ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తూ.. బోయపాటి కూడా బాలయ్య అఘోరా గెటప్ నే ఎక్కువగా హైలెట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటున్నారు.
రజినీకాంత్, బాలకృష్ణ.. ఈ ఇద్దరు వెటరన్ హీరోలు.. ఇప్పటి వరకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో తమ ఏజ్ కవర్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడలాంటి రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలకు కాలం చెల్లింది. ఫ్యాన్స్ చూస్తున్నారు కదా అని, డబ్బులు పెట్టే నిర్మాతలు ఉన్నారు కదా అని అదే టైప్ సినిమాలు తీస్తూ వచ్చారు. వీరికి దొరికే దర్శకులు కూడా అలాంటివారే.
కానీ ఒక దశ వరకు అది కుదిరింది. ఇప్పుడిక కుదరదంతే.. అన్నాత్తే తర్వాత కనీసం రజినీకాంత్ ఆ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి. అఖండ తర్వాత బాలకృష్ణకు కూడా అలా ఆలోచించే పరిస్థితి వస్తుందేమో.