విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ లాడ్జ్ లో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఓ జంట చిక్కుకుంది. స్థానికులు వెంటనే ఇద్దర్నీ కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం. గాయపడిన ఇద్దరిలో అమ్మాయిది విశాఖపట్నం కాగా, అబ్బాయిది వరంగల్.
ఇంతకీ ఏం జరిగింది?
విశాఖకు చెందిన ప్రత్యూషకు, వరంగల్ కు చెందిన హర్షవర్థన్ కు చాన్నాళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ పంజాబ్ లోని జలంధర్ లో బీటెక్ చదివారు. ఆ టైమ్ లోనే ప్రత్యూషకు తన ప్రేమ విషయం చెప్పాడు హర్షవర్థన్. కానీ ఆమె నిరాకరించింది.
ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించింది ప్రత్యూష. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. ఆమెను కలిసేందుకు వరంగల్ నుంచి విశాఖ వచ్చాడు హర్షవర్థన్.
ఓ లాడ్జ్ లో రూమ్ తీసుకొని ఆమెకు ఫోన్ చేశాడు. హర్షవర్థన్ ను కలిసేందుకు హోటల్ రూమ్ కు వచ్చింది ప్రత్యూష. ఆమె దగ్గర మరోసారి ప్రేమ ప్రస్థావన తీసుకొచ్చాడు హర్షవర్థన్. మరోసారి ప్రత్యూష నిరాకరించడంతో, అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పంచించాడు. ఆ తర్వాత తను కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
స్థానికులు వచ్చి మంటలు ఆర్పి, ఇద్దర్నీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అమ్మాయికి 60శాతం గాయలు, అబ్బాయికి 40శాతం గాయలైనట్టు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికుడి ఫోన్ నుంచి అమ్మాయి తన తండ్రికి ఫోన్ చేసింది, జరిగిన విషయం మొత్తం వివరించింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.