అటు రీటైల్.. అటు హోల్ సేల్… కొనుగోళ్లు!

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది. ఒకవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ లను బతిమాలి.. వారి మద్దతు పుచ్చుకుని.. తాము అయిదేళ్లూ కొనసాగేలా అధికారంలోకి రావాలని శివసేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తమకు ఇప్పటికే 119 మంది సభ్యుల మద్దతు…

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది. ఒకవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ లను బతిమాలి.. వారి మద్దతు పుచ్చుకుని.. తాము అయిదేళ్లూ కొనసాగేలా అధికారంలోకి రావాలని శివసేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తమకు ఇప్పటికే 119 మంది సభ్యుల మద్దతు ఉన్నదని.. అధికారం ఏర్పాటు చేయడానికి మరో పాతికసీట్ల దూరంలో మాత్రమే ఉన్నాం అని.. భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటోంది.

దీంతో కంగారెత్తిన శివసేన.. నిన్న లేని బలం ఇవాళ ఎలా వచ్చింది.. మీరు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రలోభాలు పెడుతున్నారు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఈ పార్టీల వాదనలను పక్కన పెట్టి.. మహా రాజకీయాలను స్థూలంగా గమనించినప్పుడు.. ఒకరు హోల్ సేల్‌గా బేరమాడుతోంటే.. మరొకరు రీటైల్‌గా బేరమాడుతున్నారని మనకు అనిపిస్తుంది.

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకునే వారికి 145 సీట్లు కావాలి. భాజపాకు 40 సీట్ల బలం అవసరం. తమతో కలిసి పోటీచేసిన పార్టీ శివసేన తెగతెంపులు చేసుకుంది. మిగిలిన రెండూ కాంగ్రెస్, ఎన్సీపీ ప్రత్యర్థి పార్టీలు. వారికి వేరే గత్యంతరం లేదు.

చిన్నాచితకా పార్టీలను, గెలిచిన ఇండిపెండెంట్లను వారు పోగేయడం ప్రారంభించినట్లుగా ఉంది. మొన్నటికి తమకు 119 మంది మద్దతు ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. కర్నాటకలో 17మందిని ఫిరాయించేలా చేసి.. గద్దెమీద కూర్చున్నట్లే.. మూడు పార్టీల్లోని 25 మందిని చీల్చి.. తమకు అనుకూలంగా వాడుకోవడం పెద్ద కష్టం కాదనే సంకేతాలు ఇచ్చారు. అంటే.. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను రీటైల్ గా కొనడానికి ప్రయత్నిస్తున్నదన్నమాట.

కానీ శివసేన పరిస్థితి అలా కాదు. ఆ పార్టీ కాంగ్రెసు, ఎన్సీపీలతో హోల్‌సేల్‌గానే బేరం మాట్లాడుకున్నట్లు కనిపిస్తోంది. అయిదేళ్లూ పూర్తిగా తమ పార్టీనే అధికారంలో ఉండనిస్తే ఒక బేరం, సీఎం పీఠాన్ని పంచుకునే ఉద్దేశం ఉంటే మరొక బేరం .. ఇలా విడివిడిగా మాట్లాడుకున్నట్లుగా కనిపిస్తోంది. కాకపోతే.. వారికి ఎమ్మెల్యేలను విడివిడిగా సంప్రదించి రేటు మాట్లాడాల్సిన అవసరం లేదు.

ఏకంగా పార్టీ నాయకత్వాలతో హోల్‌సేల్ బేరం కుదుర్చుకుంటే చాలు. ఆ పోకడలో వారు వెళుతున్నారు. భాజపా సాగిస్తున్న రీటైల్ బేరసారాలు, తమ హోల్‌సేల్ బేరాలను ఎక్కడ దెబ్బ తీస్తాయోనని శివసేన వారు కంగారు పడిపోతున్నారు కూడా.