ఎమ్బీయస్‌: ఇంగ్లీషు మీడియం అనర్థదాయకమా?

హఠాత్తుగా అందరూ తెలుగు భాష గురించి తెగ చింతించేస్తున్నారు. ఆంధ్రలో ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టడం వలన తెలుగు భాష మృతభాష అయిపోతున్నట్లు గోల పెట్టేస్తున్నారు. జనని, జన్మభూమి, మాతృభాష అంటూ కవిత్వాలు వినిపిస్తున్నారు.…

హఠాత్తుగా అందరూ తెలుగు భాష గురించి తెగ చింతించేస్తున్నారు. ఆంధ్రలో ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టడం వలన తెలుగు భాష మృతభాష అయిపోతున్నట్లు గోల పెట్టేస్తున్నారు. జనని, జన్మభూమి, మాతృభాష అంటూ కవిత్వాలు వినిపిస్తున్నారు. తెలుగు భాష ఔన్నత్యం గురించి ఉగ్గడిస్తున్నారు. ఇదంతా విని నేను గందరగోళ పడ్డాను. ప్రభుత్వపాఠశాలల్లో తెలుగు సబ్జక్ట్‌గా కూడా తీసేస్తున్నారా అని. తీసేస్తున్నట్లు ఎక్కడా చదవలేదు. నవంబరు 14 నాటి ప్రభుత్వ యాడ్‌లో కూడా యిచ్చారు, తెలుగులో నిర్బంధంగా నేర్పుతామని! మరింకేమిటి బాధ? బోధనామాధ్యమం మారుతుంది, అంతేగా? తెలుగు నేర్పేవాళ్లు, చదివేవాళ్లు అందరూ ఉంటారు. ఇక తెలుగు మృతభాష ఎలా అవుతుంది?

మీడియం మారినంత మాత్రాన భాష నేర్పడం మానరు కదా! నేను 12 వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను, హైస్కూల్లో లాంగ్వేజెస్‌గా ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం (స్పెషల్‌ తెలుగు బదులు దాన్ని తీసుకున్నాను) ఉండేవి. కాలేజీలో బియస్సీ ఇంగ్లీషు మీడియంలో చదివాను. ఇంగ్లీషు, హిందీ (కావాలంటే దాని బదులు తెలుగు/సంస్కృతం/ఉర్దూ తీసుకోవచ్చు) లాంగ్వేజెస్‌గా ఉండేవి. అందువలన నాకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం వచ్చు. మధ్యలో మాధ్యమం మారిందంతే. భాషాజ్ఞానం ఎక్కడికి పోయింది? ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు కూడా స్కూల్లో నేర్పే ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఎలాగూ వస్తాయి. ఇతర సబ్జక్టులు తెలుగులో బదులు ఇంగ్లీషులో నేర్చుకుంటారు. అంతేగా? తెలుగుని ఇంగ్లీషులో చెప్పరుగా!

ప్రభుత్వస్కూళ్లలో తెలుగు మీడియంకు బదులు ఇంగ్లీషు మీడియం పెట్టగానే తెలుగుకి ద్రోహం చేసినంత బిల్డప్‌ యిస్తున్నారు. అలా కాకుండా, ఒకవేళ ప్రయివేటు స్కూళ్లల్లో ఇంగ్లీషుకి బదులు తెలుగు మీడియం పెట్టారనుకోండి. అప్పుడు తెలుగుకి మహర్దశ పట్టిందని ఆనందాతిరేకంతో గంతులు వేసేవారా? అబ్బే, తెలుగు పిల్లలకు విదేశాలకు, పరరాష్ట్రాలకు వెళ్లి నాలుగు రాళ్లు తెచ్చుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు అని రంకెలు వేసేవారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఎటూ లేవు, బయటకు వెళ్లాలంటే యిది అవరోధం అవుతోంది అని ఫిర్యాదు చేసేవారు. అంటే ప్రయివేటు స్కూళ్లల్లో చదివేవారికి మాత్రమే ఆ అవకాశాలు ఉండాలి, తక్కినవారికి అక్కరలేదు అని భావమా?

ఇంగ్లీషు మీడియమైనా, తెలుగు మీడియమైనా ఇంగ్లీషు ఎలాగూ నేర్పుతారు కాబట్టి, సబ్జక్టంటూ అర్థమైతే ఇంగ్లీషులో మాట్లాడి ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు కదా అని వాదించవచ్చు. వెంకయ్యనాయుడు గారు అదే అన్నారు – నేనూ, మోదీ, కోవిందూ అందరం మాతృభాషలో చదివే యింతటివారమయ్యాం అని. ఆయన మర్చిపోతున్నదేమిటంటే – ఆయన పోటీ పడినది సాటి తెలుగు మీడియం వాడితోనే! ఇంగ్లీషు మీడియంలో చదివినవాడితో కాదు. అప్పట్లో అన్నీ ప్రభుత్వస్కూళ్లే. ఇప్పుడు సమాజంలో ప్రభుత్వ స్టూడెంట్స్‌, ప్రయివేటు స్టూడెంట్స్‌ అనే వర్గీకరణ వచ్చేసింది. తెలుగు మీడియంలో చదివినవాడు సమానమైన తెలివితేటలున్న ఇంగ్లీషు మీడియం వాడితో పోటీ పడగలడా అనేది ప్రశ్న. 

పరీక్ష తెలుగులో ఉంటే తెలుగు మీడియం వాడికి, ఇంగ్లీషులో ఉంటే ఇంగ్లీషు మీడియం వాడికి ఎక్కువ ఛాన్సుంది. జాతీయ, అంతర్జాతీయ పరీక్షలు తెలుగులో ఉన్నాయా, ఇంగ్లీషులో ఉన్నాయా? ఇంగ్లీషేగా! అందుకే వెంకయ్యగారి పిల్లలైనా, బాబుగారి పిల్లవాడైనా, పవన్‌గారి పిల్లలైనా, తెలుగులో ఆర్టికల్స్‌ రాసి ప్రస్తుతం పొట్ట పోసుకుంటున్న నా పిల్లలైనా ఇంగ్లీషు మీడియంలోనే చదివారు. నా పాఠకులలో కనీసం 75% మంది పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతూంటారని నా అంచనా. మరి మనకు తెలుగు మీడియం ఘనత గురించి ఉగ్గడించే అర్హత ఉందా? మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలి, చైనాలో, జపాన్‌లో, కొరియాలో.. అంటూ ఉదాహరణలు యిచ్చేవారిని పట్టుకుని చెడామడా కడిగేయ బుద్ధేస్తుంది నాకు. ఆ యా దేశాల వాళ్లు వాళ్ల భాషలను ఎంత సుసంపన్నం చేసుకున్నారో తెలుసా మీకు అని వీళ్లని అడగాలి. 

ఇంగ్లీషులోనే కాదు, ఏ యితర భాషలో విజ్ఞానసర్వస్వం వచ్చినా, జ్ఞానానికి సంబంధించిన ఏ పుస్తకం వచ్చినా 15 రోజుల్లో చైనా, జపాన్‌ యిత్యాది దేశాల్లో దాని అనువాదం దొరుకుతుందట. ప్రపంచ భాషల్లో దొరికే ఉపయుక్తమైన ప్రతీ విషయాన్ని వాళ్ల భాషలోకి మార్చుకుని, వాళ్ల ప్రజల జ్ఞానాన్ని వృద్ధి చేస్తారు. మరి మనం? అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మామిడిపూడి వెంకటరంగయ్య గారి అధ్యక్షతన విజ్ఞానసర్వస్వాలు అచ్చేసి అమ్మారు. ఆ తర్వాత వాటి పునర్ముద్రణ లేదు. ఇప్పటికీ విజ్ఞానం పెరగడానికి ప్రభుత్వం తరఫు నుండి కృషి అతి తక్కువగా ఉంటుంది. మన పాలకులు రూపాయికి కిలో బియ్యం యిస్తాం, బతకమ్మకు ఉచితంగా చీరలిస్తాం అంటారు తప్ప చౌకగా పుస్తకాలిచ్చి జ్ఞానాన్ని పెంచుతాం అనరు. ఈ పెద్దమనుషులు కానీ, సాధారణ ప్రజలు కానీ వాటి గురించి అడగరు, ఉద్యమాలు చేయరు.

పోనీ ప్రయివేటు వ్యక్తులెవరైనా పూనుకుని, విజ్ఞానసర్వస్వాలను ముద్రిద్దామంటే అవి అమ్ముడుపోవు. తొలి రోజు సినిమా చూడడానికి 300 రూ.లు ఖర్చు పెట్టే తెలుగు ప్రజలకు 200 రూ.లు పెట్టి శాశ్వతంగా ఉండే పుస్తకం కొనడానికి చేతులు రావు. నిఘంటువు ఉన్న తెలుగిళ్లు 10 శాతం కూడా ఉండవని నా అంచనా. అందుకే తెలుగులో ప్రచురణా రంగం కుదేలైంది. ఇలాటి పరిస్థితుల్లో తెలుగు మాత్రమే తెలిసి వుంటే మన జ్ఞానపు పరిధి చాలా కుంచించుకుపోతుంది. జ్ఞానం పెరగాలంటే ఇంగ్లీషు తెలిసి వుండాలి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంగ్లీషు లేదు తెలుసా అనకండి. ఇంగ్లీషు కాకపోతే మరో అంతర్జాతీయ భాష నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుంది తప్ప భారతీయ భాషలనే అంటిపెట్టుకుంటే చాలా విషయాలు తెలియకుండా పోతాయి. ఇక్కడ ఇంగ్లీషు నేర్చుకోవాలి అంటున్నాను తప్ప ఇంగ్లీషు మీడియంలో చదివి తీరాలి అని అనటం లేదు. తెలుగు మీడియంలో చదివి, ఇంగ్లీషు ద్వారా జ్ఞానాన్ని నిక్షేపంలా పెంచుకోవచ్చు.

అయితే ఇంగ్లీషు మీడియం మాట ఎందుకు వస్తోంది? మన చదువులో ఎక్కడో ఒక దశలో ఇంగ్లీషు మీడియంలోకి మారాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి! జర్మనీవాడు జర్మన్‌ భాషలోనే ఇంజనియరింగు చేయగలడు. మనకా సౌకర్యం లేదే! ఇంటర్‌ దాకా తెలుగు మీడియంలో చదివి, ఇంజనియరింగు లేదా మెడిసిన్‌ వచ్చేసరికి ఇంగ్లీషు మీడియంలోకి మారాల్సి వస్తోంది. డిగ్రీ తెలుగు మీడియంలో ఉన్నా, పోస్ట్‌ గ్రాజువేషన్‌ వచ్చేసరికి ఇంగ్లీషు మీడియంలోకి మారాల్సి వస్తోంది. ఇది పట్టణాలు, పల్లెల నుంచి వచ్చిన పిల్లలకు యిబ్బందికరంగా మారుతోంది. తెలుగు మీడియం ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుని ఎంసెట్‌ ర్యాంకు తెచ్చుకున్నా బిటెక్‌, ఐఐటీ ఇంగ్లీషు మీడియానికి అలవాటు పడక, చదువులో వెనకబడినవారు, చదువు మానేసేవారు, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు కనబడుతున్నారు. 

అందువలన యీ మారడం ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అని స్వానుభవంతో ఏర్పరచుకున్న అభిప్రాయం. నేను చదివే రోజుల్లో రెండు రకాల కోర్సులు ఉండేవి. 11 వ తరగతి వరకు ఉండే ఎస్సెల్సీ తెలుగులో చదివి, 12 వ తరగతి ఐన పియుసి ఇంగ్లీషులో చదివి అక్కణ్నుంచి బిఏ, బియస్సీ, బిఇ, ఎంబిబిఎస్‌.. ఇంగ్లీషులో చదివే పద్ధతి ఉండేది. దీనిలో పియుసిలోనే ఎంపిసి లేదా బైపిసి ఎంచుకోవాలి. దీనికి భిన్నంగా మల్టీపర్పస్‌ కోర్సు అనే 12 తరగతుల కోర్సు ఉండేది. దీనిలో మాథ్స్‌తో బాటు బయాలజీ, జువాలజీ కూడా నేర్పుతారు. బిఇ, ఎంబిబియస్‌లలో దేనికైనా వెళ్లే వెసులుబాటుంది. ఇది తెలుగు మీడియం. నేను ఆ కోర్సు చేశాను. 12 వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివి బియస్సీకి వచ్చేసరికి ఇంగ్లీషు మీడియంకు మారాను. పియుసి మార్గం ద్వారా వచ్చినవారికి అప్పటికే ఇంగ్లీషు మీడియంలో ఒక ఏడాది చదివిన అనుభవం ఉంది. 

నేను చిన్నప్పటినుంచి మంచి స్టూడెంటును. ఇంగ్లీషులో మంచి మార్కులు వచ్చేవి. ఇంగ్లీషులో మంచి ఒకాబిలరీ ఉంది. అయితే అప్పట్లో లక్షన్నర జనాభా ఉండే పట్టణంలో పుట్టిపెరగడం చేత ఇంగ్లీషు మాట్లాడే అవసరం కానీ, అవకాశం కానీ లేదు. అందువలన బియస్సీలో లెక్చరర్లు ఇంగ్లీషులో పాఠాలు చెప్పినప్పుడు అర్థమయ్యేది కానీ లేచి నుంచొని సందేహం అడగాలంటే బెరుకు. ఇంగ్లీషులో తప్పులు మాట్లాడితే నవ్వుతారని భయం. అందువలన క్లాసు అయ్యాక కామన్‌రూమ్‌కి వెళ్లి సందేహాలు తీర్చుకునేవాణ్ని. చదువయ్యాక ఉద్యోగాల కోసం వెతికేటప్పుడు రాతపరీక్షల్లో మంచి మార్కులు వచ్చేవి కానీ ఇంటర్వ్యూల్లో ఆత్మవిశ్వాసం కొరవడి తడబడేవాణ్ని. చాలా విఫలయత్నాల తర్వాత ఉద్యోగం వచ్చింది.

తర్వాత అనేక సందర్భాల్లో చూశాను – తెలివితేటలున్న అనేకమంది తెలుగు వాళ్లు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సరిగ్గా లేక ఎంతో నష్టపోతున్నారని! నిజానికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మాత్రమే ఉంటే సరిపోదు – తెలివితేటలుండాలి, విషయపరిజ్ఞానం ఉండాలి, కష్టించే స్వభావం ఉండాలి, నిజాయితీ ఉండాలి. తక్కినవన్నీ ఉండి, తనను తాను సరిగ్గా ప్రెజెంట్‌ చేసుకోలేక ఎంట్రీ పాయింటులో అవకాశాలు పోగొట్టుకుంటున్న తెలుగువాళ్లను చూస్తే నేను చాలా బాధపడతాను. ఆ స్కిల్స్‌ లేకపోయినా కొందరు ఏదో విధంగా సంస్థలోకి ప్రవేశించి తక్కిన గుణాల వలన రాణిస్తారు, కానీ ప్రమోషన్‌ల దగ్గర దెబ్బ తింటూ ఉంటారు. బ్యాక్‌రూమ్‌ బాయ్స్‌గా మిగిలిపోతారు. ఈ రోజుల్లో బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ ఆఫీసులు తగ్గిపోయి కాల్‌ సెంటర్ల వినియోగం బాగా పెరిగిపోయింది. కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలకు సెలక్టు చేసినపుడు ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉందా లేదా, యాసపై మాతృభాష ప్రభావం ఉందా? అనే విషయాన్ని ప్రధానంగా పరిగణిస్తారు. 

 వైట్‌ కాలర్‌ ఉద్యోగాలలో మాత్రమే ఇంగ్లీషు ఉపయోగం అనుకోవద్దు. ఈనాడు అనేక ఉద్యోగాలు మార్కెటింగ్‌ రంగంలోనే ఉన్నాయి. వాటిలో ఇంగ్లీషు ప్రయోజనం చాలా ఎక్కువ. ఈ మెయిళ్లు సరిగ్గా చదవడం, తగినట్లు జవాబివ్వడం రావాలన్నా ఇంగ్లీషు తప్పనిసరి. ఈ ఉద్యోగాలే కాదు, హోటల్లో సర్వరుగా పని చేసినా అవసరం పడుతోంది. వాచీ రిపేరు షాపు పెట్టుకున్నా పని బడుతోంది. ఎందుకంటే దేశంలో రాకపోకలు ఎక్కువై చిన్న పట్టణాల్లో కూడా తెలుగేతరులు ఎదురవుతున్నారు. నా బోటి తెలుగు రచయితకు కూడా ఇంగ్లీషు అవసరమౌతోంది. 'మీ నవలను సీరియల్‌గా తీద్దామనుకుంటున్నాం, నిర్ణయం తీసుకునేవాళ్లు బొంబాయిలో ఉంటారు. సినాప్సిస్‌ ఇంగ్లీషులో పంపండి' అంటున్నారు. తెలుగు సినిమాకు కథ రాస్తాను అంటే 'పాత్రల రూపురేఖలు నిర్ణయించే సాంకేతిక నిపుణుడికి తెలుగు రాదు, పాత్రల స్వరూపస్వభావాల గురించి ఇంగ్లీషులో రాసి యివ్వండి' అంటున్నారు. తెలుగు సినిమా దర్శకుడికి తెలుగు మాత్రమే వస్తే చాలదు, ఎందుకంటే ఆర్టిస్టులందరికీ తెలుగు రాకపోవచ్చు. మధ్యలో దుబాసీనో, అనువాదకుడినో పెట్టుకుని అవస్థ పడవచ్చు. కానీ అతడు మనంత బాగా చెపుతాడన్న గ్యారంటీ ఏదీ? 

ఇంగ్లీషు ప్రయోజనం అందరికీ తెలుసు, అయినా సగటు తెలుగువాడు ఇంగ్లీషులో వెనకబడే ఉన్నాడని చెప్పాలి. ఇలా ఎందుకు జరుగుతోంది? వీళ్లల్లో చాలామంది – అంటే 60-70 శాతం మంది ప్రయివేటు స్కూళ్లల్లో ఇంటర్‌ వరకు ఇంగ్లీషు మీడియంలో చదివినవారే కదా, ఇంజనియరింగు వంటి కోర్సుల్లో నూటికి నూరు శాతం ఇంగ్లీషు మీడియంలో చదివినవారే కదా! నాకు తెలిసి తెలుగు పట్టణాల్లో కాన్వెంటులు వెలసి 50 ఏళ్లవుతోంది, పల్లెలకు పాకి ఏ 30 ఏళ్లో అయి వుంటుంది. అన్నేళ్లగా ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నా, ఓవరాల్‌గా చూస్తే మన తెలుగువారి ఇంగ్లీషు ఏ మాత్రం ఘనంగా లేదని ఎందుకు అనాల్సి వస్తోంది? 60 ఏళ్ల లోపు తెలుగు రాజకీయ నాయకుల్లో కూడా మంచి ఇంగ్లీషు వక్తలు అరుదుగా వుండడమేమిటి? ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించి, విదేశాల్లో చాలా ఏళ్లగా ఉద్యోగాలు చేస్తున్నవారి మెయిళ్లలో సైతం ఇంగ్లీషు తప్పులు రావడమేమిటి? వేదికల మీద మాటల కోసం తడుముకోవడ మేమిటి? ఇంగ్లీషులో ఫిక్షన్‌ రాయగలిగిన తెలుగువారు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో ఉండడమేమిటి? 

దీని అర్థం ఇంగ్లీషు మీడియంలో చదివినంత మాత్రాన, ప్రయివేటు స్కూళ్లలో వేలాది రూ.ల ఫీజులు కట్టినంత మాత్రాన తెలివితేటలు కాదు కదా, సరిగ్గా ఇంగ్లీషు వస్తుందన్న నమ్మకం కూడా లేదని! విద్యాప్రమాణాలు, బోధనాపద్ధతులు, బోధకుల స్థాయి పెంచవలసి ఉందని కచ్చితంగా తెలుస్తోంది. ఇది తెలుగుకు కూడా వర్తిస్తుంది. తెలుగు బోధనా స్థాయి కూడా దిగజారిందని, ఐదో తరగతి కుర్రాడు కూడా అక్షరమాల పూర్తిగా రాయలేకపోయాడనీ వార్తలు వస్తున్నాయి. అందువలన గ్రహించవలసినది – ఏ మీడియం ఐనా బోధనా స్థాయి పెరగవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో పాఠశాలల మౌలిక వసతులు పెంచడంతో బాటు విద్యాప్రమాణాలు పెంచడంపై కూడా దృష్టి సారిస్తారని ఆశిద్దాం. 

తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం రెండూ ఆశించిన స్థాయిలో లేనప్పుడు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియం వైపు మారడం దేనికి? ఇంగ్లీషు మీడియం వారు అద్భుతంగా వెలిగినా వెలగకపోయినా తెలుగు మీడియం వారికి న్యూనతాభావం పెరిగిపోవడం వలన యిది చర్చకు వస్తోంది. పేదల పిల్లలు మాత్రమే తెలుగు మీడియంకు వెళతారని, ఏ కాస్త డబ్బున్నా ఇంగ్లీషు మీడియంకు వెళతారనే అభిప్రాయం బలంగా నాటుకుంది. తెలుగు మీడియం అంటే ప్రభుత్వ స్కూళ్లు, ఇంగ్లీషు మీడియం అంటే ప్రయివేటు స్కూళ్లు గుర్తుకు వచ్చే విధంగా సమాజం చీలిపోయింది. అందువలన పేదలు, దిగువ మధ్యతరగతి వాళ్లు 'మా బతుకు ఎలాగూ తెల్లారిపోయింది. మరింత కష్టపడైనా సరే, మా పిల్లల్ని ప్రయివేటు స్కూళ్లల్లో, ఇంగ్లీషు మీడియం స్కూళ్లల్లో చేర్పించకపోతే వాళ్ల భవిష్యత్తును నాశనం చేసినవాళ్లమవుతాం' అనుకుంటున్నారు. దాన్ని ప్రయివేటు స్కూలు వాళ్లు తమ కనుగుణంగా వాడుకుంటున్నారు.

నేను 1960లో ప్రభుత్వ స్కూలులో చేరినప్పుడు నాకు ఒక పక్కన కూర్చున్నతను బండివాడి కొడుకు, మరొకపక్కన కూర్చున్నతను ఐస్‌ఫ్యాక్టరీ యజమాని కొడుకు. నేను మధ్యతరగతి వాణ్ని. ఇలాటి వైవిధ్యం యిప్పటి ప్రభుత్వ స్కూళ్లల్లో కనబడుతోందా? నిమ్నవర్గాల వాళ్లు మాత్రమే అక్కడకి వెళుతున్నారు. ఇక్కడ కులాల మాట ఎత్తటం లేదు నేను. ఎస్సీ, ఎస్టీ, బిసిలలో కూడా డబ్బున్నవాళ్లు ఆ స్కూళ్లకు వెళటం లేదు. దానివలన బాధ్యత మరచిన టీచర్లను నిలదీసేవారు లేకుండా పోయారు. టీచర్ల జీతాలు బాగా పెరిగాయి అయినా అడిగేవాడు లేక వాళ్లు వెళ్లకుండా వేరేవాళ్లని పంపుతున్నారు. అందుకే బయోమెట్రిక్‌ చెకింగ్‌ పద్ధతి వచ్చింది. ప్రభుత్వ టీచర్లను నిందిస్తూ చాలామంది 'ఆ టీచర్లు కూడా తమ పిల్లల్ని ప్రయివేటు స్కూళ్లకు పంపుతున్నారు.' అంటారు. దానికి సమాధానమిస్తూ ఒక ప్రభుత్వ టీచరు ఆ మధ్య మంచి వ్యాసం రాశారు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం ఎలాటి శీతకన్ను వేసిందో, ప్రజలు ఎలా నిర్లక్ష్యం చేశారో వివరిస్తూ 'ఏం మీ పిల్లలు మాత్రం చదువుకుని బాగుపడాలా? మా పిల్లలు పడొద్దా?' అని అడిగారు.

ఈనాటి గొప్ప గొప్ప వైద్యులందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తర్ఫీదు అయి కార్పోరేట్‌ ఆసుపత్రులకు వెళ్లినవారే. కానీ యీ రోజు ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేశారు. మధ్యతరగతి వాళ్లు వెళ్లడం మానేశాక, అక్కడ బాధ్యతారహితంగా పనిచేసే వారిని నిలదీసేవారు లేకపోయారు. అందరూ అప్పోసొప్పో చేసి కార్పోరేట్‌ ఆసుపత్రులకు వెళుతున్నారు. అక్కడ ఆదాయం పెరగడం చూసి, మల్టీ నేషనల్‌ కంపెనీలు వాటిని టేకోవర్‌ చేసేసుకుని ఫీజులు విపరీతంగా పెంచేశాయి. ఆరోగ్యం అందరాని ఫలమైంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే ప్రయత్నాలు యిటీవలి కాలంలో పుంజుకున్నాయి. బాబు హయాంలో ఆంధ్రలో అవి మెరుగుపడ్డాయని విన్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లాగే ప్రభుత్వ స్కూళ్ల లెవెల్‌ పెంచాలి, పెంచాలంటే మధ్యతరగతి జనం కూడా వెళ్లాలి, పాఠాలు చెప్పని టీచర్లను దబాయించాలి. ఆ స్కూళ్లను  ఘెట్టోలుగా వదిలేస్తే ఎప్పటికీ బాగుపడవు. చీప్‌ లేబరు ఫోర్సును, అసాంఘిక శక్తులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారతాయి. ప్రస్తుతానికి మధ్యతరగతిని కాకపోయినా, దిగువ మధ్యతరగతిని ఆకర్షించేలా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేయాలంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు మార్చడం మంచి యోచన.

మీడియం మార్చడం వలన తెలుగు భ్రష్టు పట్టిపోతుందంటూ టీవీల్లో శివాలు తొక్కడం అర్థరహితం. మొదట టీవీ యాంకర్లను తెలుగు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోమనండి. చాలామందికి 'చ' పలకడంలో ఉన్న తేడాయే తెలియదు. పదాలను ఎలా విడగొట్టాలో తెలియదు. ఏం చెప్పినా ఆచరణయోగ్యంగా ఉండాలి. తమిళులు ఏం చేశారు, కన్నడిగులు ఏం చేశారు అన్నది అనవసరం. తమిళుల్లో, బెంగాలీల్లో ఎంతటి విద్యాధికులైనా సరే ఇంటర్వ్యూ యిచ్చినపుడు ఇంగ్లీషు పదం దొర్లకుండా పావుగంటైనా మాట్లాడగలరు. మన తెలుగువాళ్లు ఐదు నిమిషాలు మాట్లాడలేరు. మూడు పదాలకు ఓ సారి 'సో' అంటారు. పోనీ ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడతారా అంటే అదీ లేదు. చివర్లో అండీ చేరుస్తారు. 'గోయింగా?' 'కమింగా?' అంటారు. నిజానికి నా వ్యాసాల్లో కూడా ఇంగ్లీషు పదాలు తెగ వాడతాను, ఎందుకంటే రీడబిలిటీ కోసం. మొత్తమంతా చక్కటి తెలుగు పదాలతో నింపితే చదవరు, తిప్పేస్తారు. ఇదీ మన తెలుగు లక్షణం. మనకు మమ్మీ, డాడీ, అంకుల్‌లే ముద్దు. అమ్మానాన్న అంటే మోటు. పెళ్లి భోజనాల్లో అన్నం వడ్డించండి అంటే వంటవాడు ఎగాదిగా చూస్తాడు. వైట్‌ రైస్‌ మాత్రమే ఉందండి అంటాడు. మనకు ఇంగ్లీషుపై మోజు పోనంత కాలం తెలుగు మీడియంపై చిన్నచూపు ఉంటుంది.

'అమ్మ ఒడి' పథకం ప్రకటించినప్పుడు ప్రభుత్వ స్కూళ్లకై పరిమితం చేస్తామంటేనే న్యాయం అనిపించింది. కానీ ప్రభుత్వ స్కూళ్ల స్థాయి బాగా లేనపుడు అలా పరిమితం చేస్తే డబ్బు గురించి చూడకుండా ప్రయివేటు స్కూళ్లకే వెళతారని వైసిపి వాదించింది. అదీ నిజమే అనిపించింది. ఆచరణకు వచ్చేసరికి కొందరు ప్రభుత్వ స్కూళ్లకు మొగ్గు చూపారుట. ఎందుకంటే దేనిలో చేర్చినా రూ.15 వేలు యిస్తారు. ప్రభుత్వ స్కూలైతే డబ్బు మిగిలి పుస్తకాలకు వాటికీ ఖర్చు పెట్టవచ్చు. ప్రయివేటు స్కూళ్లయితే 15 వేలు చాలక జేబులోంచి యింకా పెట్టుకోవలసి వస్తుంది. కృష్ణాజిల్లాలో యీ ఏడాది ప్రభుత్వ స్కూళ్లల్లో ఎడ్మిషన్లు పెరిగాయని ఆ జిల్లా పేరంట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంటు యిచ్చిన స్టేటుమెంటు చూశాను. తక్కిన జిల్లాలలో కూడా అదే జరిగి వుండవచ్చు. ప్రభుత్వ స్కూళ్లలో హాజరీ పెరుగుతోందంటే సంతోషం వేసింది. విద్యార్థులు ఎక్కువైన కొద్దీ టీచర్ల జవాబుదారీ తనం పెరుగుతుంది. 

ఇంగ్లీషు మీడియం పెట్టగానే సరా? చెప్పే టీచర్లు లేరు అని ఒక విమర్శ. ఆ సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది. 2020-21 నుండి మండల్‌ స్కూళ్లలో, జిల్లా పరిషత్‌ స్కూళ్లలో 1వ క్లాసు నుంచి 8 వ క్లాసు వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని, 2021-22 నుంచి 9, 10 క్లాసులకు పెడతామని అంటోంది. టైముంది కాబట్టి యీలోగా నేర్చుకోండి, లేకపోతే ఇంటికి వెళ్లండి అంటుంది టీచర్లను. బ్యాంకులను కంప్యూటరైజ్‌ చేసినప్పుడు అలాగే చేశారు. చచ్చినట్లు నేర్చుకున్నారు. భయపడినవాళ్లు విఆర్‌ఎస్‌ తీసుకుని యింటి కెళ్లారు. సిలబస్‌ రివైజ్‌ అయినప్పుడల్లా టీచర్లు అప్‌టుడేట్‌ కావటం లేదా? అయినా టీచర్లు బొత్తిగా ఇంగ్లీషు రానివాళ్లు కాదు కదా. హైస్కూలు స్థాయిలో కూడా చెప్పలేరా? పైగా చెప్పేది అమెరికన్‌ పిల్లలకు కాదు, మన వాళ్లకే. మన యాసలోనే! ఇంగ్లీషు నేర్చుకోను అని మొరాయిస్తే వాళ్ల స్థానంలో ఇంగ్లీషు వచ్చినవాళ్లను రిక్రూట్‌ చేసుకుంటే సరి, కొందరు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.

ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియం పెడతానంటున్న జగన్‌ భాషగా తెలుగును నిర్బంధంగా నేర్పిస్తాను అని కూడా అంటున్నాడు. అది వినకుండా విమర్శించేవాళ్లను 'ఏం మీరే చదువుకోవాలా? పేదవాళ్లు చదువుకోనక్కరలేదా , ఏం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు పైకి రానక్కరలేదా?' అని వర్గపోరాటంగా, వర్ణపోరాటంగా చిత్రీకరిస్తున్నాడు. 'వైయస్‌ కార్పోరేట్‌ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ముంగిటకు తెచ్చాడు, జగన్‌ కార్పోరేట్‌ విద్య (ఇంగ్లీషు మీడియం)ను యీ పథకం ద్వారా పేదల ముంగిటకు తెస్తున్నాడు' అనే భావం పేదల్లో, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల్లో బలపడిందంటే అతని ఓటు బ్యాంకు మరింత బలపడుతుంది, ప్రతిపక్షాల ఓటు బ్యాంకు ఆ మేరకు సన్నగిల్లుతుంది. ఇది గ్రహించకుండా మూర్ఖంగా ప్రతిఘటిస్తే అప్పోజిషన్‌కే దెబ్బ. వాళ్ల పిల్లలు, మనుమలు అందరూ ఇంగ్లీషు మీడియమే కావడం వలన జవాబివ్వడానికి వారికి గుక్క తిరగడం లేదు.

ఇంగ్లీషు మీడియంను జగన్‌ గతంలో వ్యతిరేకించాడని కొందరు, కాదు సాక్షి మీడియా వ్యతిరేకించిందని కొందరూ అంటున్నారు. సాక్షిలో వ్యాసకర్తల అభిప్రాయం సంపాదకుడి అభిప్రాయం కానక్కరలేదు, సంపాదకుడి అభిప్రాయం పబ్లిషరు అభిప్రాయం కానక్కరలేదు. దీనిపై అనేక ఉదాహరణలు యివ్వగలను. జగన్‌ స్వయంగా స్టేటుమెంటు యిస్తేనే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ యిచ్చి, ఇప్పుడు అభిప్రాయం మార్చుకుని ఉంటే సంతోషించాలి. ఎందుకంటే మనకు ఇంగ్లీషు, తెలుగు రెండూ కావాలి. నన్నడిగితే ప్రయివేటు పాఠశాలలో కూడా భాషగా తెలుగు కంపల్సరీ చేయాలి. ఒక భాష ఎక్కువ చదివినంత మాత్రాన అలసిపోరు. మార్కుల గురించి ఫ్రెంచ్‌, పర్షియన్‌, సంస్కృతం చదివేవాళ్లు మాతృభాష చదవలేరా? ఇక ఇంగ్లీషంటారా? ఎప్పుడో తర్వాత ఇంగ్లీషు మీడియంలో మారేబదులు సాధ్యమైనంత త్వరగా ముందే మారిస్తే ప్రయోజనకరం. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ల మధ్య విభజన రేఖ చిక్కిపోయి, ప్రయివేటు స్కూళ్ల ఫీజులు తగ్గితే అంతకంటె కావలసినది ఏముంది? విద్య, వైద్యం రెండింటిని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన పాలకుడిని సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. ఇది గ్రహించకుండా దీనికీ మతం రంగు పులిమేవారికి శతకోటి నమస్కారాలు. వాళ్లను బాగు చేయడం దేవుడి తరం కూడా కాదు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2019)
[email protected]