తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి మొన్నటికి మొన్న ఘాటు విమర్శలు చేసాడు వల్లభనేని వంశీ. దాని మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. స్వామి మాల వేసుకుని ఇలా మాట్లాడడం ఏమిటి? అంటూ. పైగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ప్రతి విమర్శలు భయంకరంగా వచ్చాయి.
ఇలాంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి చాలా స్మూత్ గా మాట్లాడారు. కానీ మాటలు ఈటెల్లా విసిరారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ, తెలుగుదేశం నాయకులు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ తలెత్తి సమాధానం చెప్పడానికి వీలు లేకుండా మాట్లాడారు వంశీ.
ప్రతి పాయింట్ బలంగా వినిపించారు. తనను రాజీనామా చేయమని అడిగే ముందు ఓడిన లోకేష్ ఎందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు అని ప్రశ్నించారు. ప్రజల్లో గెలిచిన తనను రాజీనామా చేయమంటున్నారు. ప్రజల్లో ఓడిన లోకేష్ ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకుంటారు? అంటూ నిలదీసారు. నీతులు తనకు చెప్పడానికి మాత్రమే వున్నాయా? అన్నారు.
ఖమ్మంలో వున్న ఆంధ్రజ్యోతి విలేకరి నెట్ లో తనమీద దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిటన్నారు. వాళ్ల పెళ్లాలు, తల్లులే..పెళ్లాలు..తల్లులేనా? తన పెళ్లం, తల్లి మనుషులు కాదా? అని ప్రశ్నించారు.
టీటీడీ పదవులు అమ్ముకున్నది, అక్కడ శర్మిష్ట లాంటి వాళ్లను పెట్టినది ఎవరు అన్నారు?
విశాఖలో స్వామీజీ ని ఎవరు కలుస్తున్నారో సిసి కెమేరాలు పెట్టినది ఎవరు అన్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే అని, మరి ఆయనకు రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్ పార్టీ సంగతేమిటి? ఎన్టీఆర్ సంగతేమిటి? అని ఆయన ప్రశ్నించారు.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక విషయాలను వంశీ సవివరంగా ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను కడిగి పారేసారు.