అధికార పార్టీ అనవసరంగా బోనులో నిలవాల్సి వస్తోంది. ఇందుకు ప్రజాప్రతినిధుల అత్యుత్సాహం కారణమవుతోంది. జగన్ ప్రభుత్వంపై బాణాలు సంధించేందుకు ప్రతిపక్షాలు ఎప్పుడెప్పుడా అని పొంచుకుని ఉన్నాయి.
ఏ మాత్రం సంబంధం లేనివి కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి ప్రజావ్యతిరేకత క్రియేట్ చేయడానికి ప్రతిపక్షాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. తాజాగా జగన్‌పై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి అభిమానం… చివరికి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో పాటు ఏపీ సీఎం జగన్, ఇతర రాష్ట్రాల పాలకులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై అభిమానం చాటుకునేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇందులో అమిత్‌షా, జగన్ ఇద్దరూ ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమల్లో ఉంది. దీంతో జిల్లాలో ఎలాంటి ఫ్లెక్సీలు, ఇతరత్రా ప్రచార అంశాలు కోడ్ ఉల్లంఘన కింద వస్తాయని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ హరినారాయణ హెచ్చరించారు.
మరి ఈ విషయాలు తెలిసో, తెలియకో …శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఎప్పట్లాగే జగన్‌పై తన ప్రేమాభిమానాల్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. మరోవైపు బియ్యపు మధుసూదన్‌రెడ్డితో పాటు అధికార పార్టీని పలుచన చేసేందుకు ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు భావించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘించినా కలెక్టర్ స్పందించలేదంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ఇంత బహిరంగంగా కోడ్ ఉల్లంఘిస్తున్నా కలెక్టర్, ఇతర ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఏంటని విమర్శిస్తున్నారు. జగన్‌పై బియ్యపు మధు అభిమానాన్ని ఎవరూ కాదనలేంది. అయితే అభిమానాన్ని ప్రదర్శించేందుకు కూడా ఒక సమయం, సందర్భం ఉంటుందని గ్రహించాలి. లేకపోతే ఇదో ఇలా తమ అభిమాన నాయకుడి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడంలో మనమే కారణమవుతామని బియ్యపు మధు గుర్తిస్తే మంచిది.