పవన్‌కల్యాణ్ మాటల్లో తిక్క, జగన్ చేతల్లో లెక్క వుంటుందని రాజకీయ వర్గాల అభిప్రాయం. నారా లోకేశ్ ఒకే ఒక్క మాటతో వైసీపీ తరపున టీడీపీ మాజీ నేత మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ యోగం దక్కింది. వైసీపీకి సుదీర్ఘ కాలంగా ఆర్థికంగా, హార్థికంగా సేవలందిస్తున్న ఎంతో మంది అధికారం వచ్చిన తర్వాత కూడా అధినేత జగన్ పిలుపునకు నోచుకోలేదు. అలాంటిది పార్టీకి ఏనాడూ సేవలందించని, కనీసం ఓటు కూడా వేయని నాయకుడిని ఏకంగా ఎమ్మెల్సీ పదవి వరించడం అధికార పార్టీ శ్రేణుల్నే ఆశ్యర్యపరుస్తోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి గుంటూరు జిల్లాలో రెండు సీట్లు ఉన్నాయి. వీటిలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు రెండో దఫా రెన్యువల్ చేశారు. ఇక రెండో సీటు విషయానికి వస్తే… మర్రి రాజశేఖర్‌కు మరోసారి మొండిచెయ్యి చూపారు. అనూహ్యంగా మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు పేరు తెరపైకి వచ్చింది. ఈయన చేనేత నాయకుడు కావడంతో పాటు ప్రత్యేకంగా మంగళగిరిలో తన సామాజిక వర్గంలో పలుకుబడి కలిగి వుండడం కూడా కారణంగా చెబుతున్నారు.
ఇటీవల తన తండ్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షలో నారా లోకేశ్ ఆవేశంగా మాట్లాడుతూ నోరు జారారు. మంగళగిరి నుంచే మరోసారి పోటీ చేసి, గెలుపును గిప్ట్‌గా ఇస్తానని ప్రకటించారు. దీంతో లోకేశ్ పోటీ చేసే స్థానంపై స్పష్టత వచ్చింది. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్‌ను వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024లో కూడా లోకేశ్‌ను ఓడించాలని ఇప్పటి నుంచే వైసీపీ వ్యూహం రచిస్తోంది.
ఈ క్రమంలో మంగళగిరిలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన చేనేతలను ఆకట్టుకునేందుకు వైసీపీ వెయిట్ చేస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం అధికార పార్టీకి కలిసొచ్చింది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన చేనేత నాయకుడిపై వైసీపీ కన్ను పడింది. ఎమ్మెల్సీ పదవితో చేనేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఇదే సరైన సమయమని వైసీపీ భావించింది. అదే పని చేసింది.
కనీసం పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే చర్చ జరుగుతున్నప్పటికీ, అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేయాలనే సూత్రాన్ని వైసీపీ ఆచరిస్తోంది. హనుమంతరావుకు ఎమ్మెల్సీ కేటాయించడంపై సహజంగానే చేనేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మంగళగిరిలో మరోసారి లోకేశ్‌ను కట్టడి చేసేందుకు అన్ని వైపులా ద్వారాలను మూసివేసే క్రమంలో వైసీపీ కొంత మేరకు విజయం సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.