పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదని అనుకుంటుందట. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యవహార శైలి కూడా అట్లే ఉంది. ఎంతసేపూ ప్రతి దాన్ని రాజకీయం చేయడం, దానిపై లాభాల్ని ఆశించడం తప్ప…మరే ఇతర పని ఆయన చేయడం లేదు. యధారాజా…తథా ప్రజ అన్నట్టు…నాయకుడు చంద్రబాబే అట్లా ఉంటే, ఇక తృతీయ శ్రేణి నాయకుల తీరుతెన్నులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పేదేముంది.
ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో నిదర్శనంగా చెప్పుకునే ఘటన ఇది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయన నియోజకవర్గంలో ఓ దుర్ఘటన జరిగింది. మెగాస్టార్ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన 25 అడుగుల నిలువెత్తు కటౌట్‌ను కట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందగా, మరి కొందరు గాయాలపాలయ్యారు.
మృతుల్లో సొంత సోదరులు రాజేంద్ర (32), సోమశేఖర్ (30)తో పాటు అరుణాచలం (20) అనే యువకుడు ఉన్నారు. మృతుల్లో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణమనాయుడి కుమారులిద్దరు ఉన్నారని స్వయంగా చంద్రబాబే ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీకి చెందిన నాయకుడి కుమారులు చనిపోయినప్పుడు…వారి కుటుంబానికి ఆన్ని రకాల సాయం అందించడం అధినేత బాధ్యత. కానీ చంద్రబాబు సాయం మాట మాత్రం ప్రస్తావించలేదు.
పైగా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. కనీసం తన వంతు బాధ్యతగా తన పార్టీ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించో, అందించో…ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా మరో పార్టీ నాయకుడి ఫ్లెక్సీ కడుతూ ప్రమాదానికి గురైన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేయడానికి చంద్రబాబుకున్న నైతిక హక్కు ఏంటి? తన వాళ్ల కోసం ఆ మాత్రం సాయం చేయడానికి కూడా బాబుకు మనసు రాలేదా?
సాయం అందించడంలో జగన్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తోందనే మెసేజ్ ఇప్పటికే జనంలోకి వెళ్లింది. ఇటీవల పవన్‌కల్యాణ్ అభిమాని ఆపరేషన్ కోసం భారీ మొత్తం జగన్ సర్కార్ సాయం చేసిన విషయం తెలిసిందే. కుప్పం మృతులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అది వేరే విషయం. కానీ టీడీపీ నాయకుడి ఇద్దరు కుమారులు దుర్మరణం పాలయ్యారని కేవలం సంతాప ప్రకటనకే పరిమితం కావడంపైన్నే అభ్యంతరం.