ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కాస్ట్లీ ఎన్నిక ఏదైనా ఉంది అంటే… అది కుప్పం మున్సిపల్ ఎన్నికే. ఈ నెల 15న కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 25 వార్డులున్నాయి. ఒక వార్డు ఏకగ్రీవమైంది. దీనిపై టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇది వేరే సంగతి.
ఇక ఎన్నికలకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ, టీడీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఆ పార్టీకి కుప్పం విజయం చావుబతుకుల సమస్యగా మారింది. మరోవైపు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని మట్టి కరిపించడం ద్వారా …ఏపీలో టీడీపీ మరణశయ్యపై ఉందనే సంకేతాల్ని పంపడానికి వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఓటర్ల కొనుగోలులో కూడా పోటీ పడుతున్నాయి. ఇందులో ఎవరికీ ఎవరూ తగ్గడం లేదు. ఒక్కో ఓటుకు రూ.5 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. మరికొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి కాస్త ఎక్కువ ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదని తెలిసింది.
ఇదిలా వుండగా డబ్బు పంపిణీతో పాటు తమకే ఓటు వేస్తామని ఓటర్లతో రాజకీయ పార్టీల నేతలు ప్రమాణాలు చేయించుకుంటున్నారు. ఓటర్లు కూడా తెలివిగా ఎవరి దగ్గర వారి మాట మాట్లాడుతున్నారు. మొత్తానికి కుప్పం మున్సిపాలిటీ విజేత ఎవరనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.