న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. తమను డిమాండ్ చేసేలా వ్యవహరిస్తే పిటిషన్ కొట్టేస్తాం జాగ్రత్త అని హెచ్చరించింది. ఇంత కాలం ఏం చేస్తున్నావని నిలదీసింది. టీటీడీ లీగల్ ఆఫీసర్‌గా రిటైర్డ్ న్యాయాధికారి రెడ్డెప్పరెడ్డిని కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై మొదటి సారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయమివ్వాలని టీటీడీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ…2020 జనవరి 22న ప్రభుత్వం ఇచ్చిన జీవో 16 ప్రకారం సర్వీసులో ఉన్న న్యాయాధికారినే లీగల్ ఆఫీసర్‌గా నియమించాలని.. అందుకు విరుద్ధంగా రెడ్డెప్ప రెడ్డికి పొడిగింపు ఇచ్చారన్నారు. ఆయన పదవీకాలం వచ్చే నెల 6తో ముగుస్తుందని, వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఆలస్యమైతే పిటిషన్ విచారణార్హత కోల్పోతుందన్నారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎప్పుడో లీగల్ ఆఫీసర్ నియామకం జరిగితే పిటిషనర్ ఇప్పటి వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించింది. అత్యవసర విచారణ కోరితే పిటిషన్‌ను కొట్టేస్తాం జాగ్రత్త అని ధర్మాసనం హెచ్చరించింది. 2019 డిసెంబర్లో రెడ్డెప్ప రెడ్డి నియామకం జరిగింది.
ఏడాది పదవీ కాలంతో అప్పట్లో నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు పొడిగిస్తూ… అంటే ఆయన పదవీ కాలం 2022, డిసెంబర్ వరకూ ఉంటుంది. ఈ విషయాల్ని ప్రస్తావించడంలో జడ శ్రవణ్‌కుమార్ విఫలమై అనవసరంగా ధర్మాసనం చేతిలో మొట్టికాయలు తినాల్సి వచ్చింది.