రాజధాని వ్యాజ్యాలపై ఈ నెల 15 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం కూడా ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యాజ్యాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అయితే ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల బదిలీల వల్ల విచారణ వ్యవహారం మళ్లీ మళ్లీ మొదటికొస్తోంది. తాజాగా మరోసారి రాజధానుల బిల్లులపై విచారణకు త్రిసభ్య ధర్మాసనం కూడా సిద్ధంగా ఉంది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి , జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య కీలకమైన రాజధాని బిల్లులపై విచారణ జరపనుంది.
ఇదిలా వుండగా త్రిసభ్య ధర్మాసనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణాలేంటో అందరికీ తెలిసినవే. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు నలుగురు జడ్జిలు, నాటి సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణలపై అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ ఫిర్యాదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం తర్వాత హైకోర్టులో పరిణామాలు మారిపోయాయనేది జగన్ ఆరోపణ. చంద్రబాబు కోరుకున్నట్టుగా కొన్ని ముఖ్యమైన కేసులన్నీ జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రమేష్ బెంచ్‌కు మారిపోయాయని తన ఫిర్యాదులో జగన్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సమర్పిం చారు. అంతేకాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు జగన్ అఫిడవిట్‌ను కూడా సమర్పించడం తీవ్ర సంచలనం సృష్టించింది.
నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు జగన్ ఫిర్యాదు చేసిన జడ్జిలలో జస్టిస్ సత్యనారాయణ, జస్టిస్ సోమయాజులు ఉన్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ త్రిసభ్య ధర్మాసనంలో ఉండడం గమనార్హం. గతంలో వీళ్లు ఇచ్చిన కొన్ని తీర్పులు చర్చనీయాంశం కూడా అయ్యాయి. రాజధాని వ్యవహారంపై విచారణ నిర్వహించే త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ సత్యనారాయణ, జస్టిస్ సోమయాజులు ఉండడంతో సహజంగానే జగన్ ఫిర్యాదు చేసిన అంశం తెరపైకి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.