రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైంది. హీరోయిన్ శృతిహాసన్ కూడా ఓపెనింగ్ కు రావడం కొసమెరుపు.
అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, ఫస్ట్ షాట్ ను రాఘవేంద్రరావు డైరక్ట్ చేశారు. అంతా ఊహించినట్టుగానే ఈ సినిమాకు క్రాక్ (Krack) అనే టైటిల్ పెట్టారు.
అయితే ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే, ఇవాళ జరిగిన ఓపెనింగ్ లో కొత్త విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట.
అవును.. గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాడట దర్శకుడు గోపీచంద్ మలినేని.
మరీ ముఖ్యంగా గత ఎన్నికల టైమ్ లో తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీ తరఫున గెలిచిన గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. దీనికే కాస్త ఫిక్షన్, రవితేజ మేనరిజమ్స్ జోడించి క్రాక్ సినిమా తీయబోతున్నాడు.
రవితేజ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించడం కూడా ఈ రూమర్ కు మరింత ఊతమిస్తోంది. దర్శకుడు మాత్రం ప్రస్తుతానికి ఈ మేటర్ సస్పెన్స్ అంటున్నాడు.
ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా సినిమాను రెడీ చేయబోతున్నారు.
గతంలో రవితేజ, మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో క్రాక్ పై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి.
అటు చాన్నాళ్ల తర్వాత శృతిహాసన్ కూడా ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం సినిమాకు కాస్త హైప్ తీసుకొచ్చే అంశం.