ఆర్టీసీ కార్మికులు కీలకమైన ఒక మెట్టు దిగారు. ఏ డిమాండ్ వద్ద ప్రభుత్వం మొండిగా పట్టుపట్టి కూర్చున్నదో.. ప్రభుత్వంతో చర్చించి.. సమస్యలను ఉభయతారకంగా పరిష్కరించుకోవడానికి ఏ ప్రధాన డిమాండు అడ్డు పడుతున్నదో.. దానిని పక్కన పెట్టేశారు.
ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం అనే డిమాండ్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మెట్టు దిగడం జరిగింది గానీ, కార్మికులు ఇంకా బెట్టు చేస్తున్నారు. తక్షణం చర్చలకు పిలవాలనే సంకేతాలు ఇవ్వకుండా మరికొన్ని రోజులపాటూ పోరాట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం చిత్రంగా కనిపిస్తోంది.
నిజానికి విలీన డిమాండ్‌ను పక్కన వెంటనే ఆర్టీసీ సమ్మె ముగింపునకు వచ్చేస్తుందని అనిపిస్తుంది. కానీ.. కార్మికులు తాము రాజీపడలేదు అనే సంకేతాలు ఇవ్వదలచుకున్నట్లుగా ఉంది. 19వ తేదీవరకు రోజుకొక తీరు లెక్కన వరుస కార్యచరణ ప్రణాళికను వారు ప్రకటించారు. ఆ తర్వాత అయినా ప్రభుత్వంతో చర్చలకు రావాల్సిందే. అదేదో ముందే చర్చలకు సిద్ధపడితే ఉభయులకు కాలహరణం తప్పేది.
హైకోర్టు సూచనలను ప్రభుత్వం కార్యరూపంలో పెట్టకపోగా, అసలు సమ్మె గురించి విచారణపై హైకోర్టు పరిధినే ప్రశ్నించడంతో సమస్య మరింత జటిలమైంది. ఆర్థిక భారంతో నిమిత్తం లేని 21 డిమాండ్ల పరిష్కారానికి హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం సిద్ధపడినా.. కార్మికులు భీష్మించుకున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుగా ఉండిపోయింది.
విలీన డిమాండ్ పక్కన పెట్టినంత మాత్రాన.. ఇక్కడితో ముగిసిపోలేదు. ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి.. కొన్ని డిమాండ్లనైనా సానుకూలంగా పరిశీలిస్తే తప్ప.. ఏమీ సాధ్యం కాదు. కార్మికులు కూడా ఈ పట్టువిడుపులను మరికొంత కొనసాగించాల్సి ఉంటుంది.