కోర్టుల్లో అనుకూలంగా తీర్పులు వస్తున్నాయనే భ్రమలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాంగ్ రూట్లో వెళ్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు. మూడు రాజధానుల అంశంలో కావొచ్చు, అమరావతిలో పేదలకు భూములు, ఇతర ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాల పథకానికి తెలుగుదేశం పార్టీ కోర్టు ద్వారా సృష్టిస్తున్న అవాంతరాలు.. ఇవన్నీ తన విజయాలుగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ, ప్రతి అంశం గురించి కూడా కోర్టుకు ఎక్కుతోంది! ఒకటని కాదు..ప్రతి అంశంలోనూ అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గత ప్రభుత్వం స్వేచ్ఛగా తన నిర్ణయాలను తీసుకుంది. రాజధానిని అమరావతి గా నిర్ణయించడంలో కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడా అఖిలపక్ష భేటీలు నిర్వహించిన దాఖలాలు లేవు. శివరామకృష్ణన్ కమిటీని తుంగలో తొక్కి, పెద్దమనుషుల ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. చంద్రబాబుకు మాత్రం అప్పుడు కోర్టుల్లో కూడా ఎలాంటి ఆటంకాలూ ఏర్పడలేదు. ఆయన ఇష్టానుసారం పాలించారు. అందుకు ప్రతిఫలాన్ని కూడా ఆయనే అనుభవించారు.
అయితే అధికారం చేజారినా చంద్రబాబు నాయుడి తీరు మారలేదు.. అనే అభిప్రాయం ఇప్పుడు జనాల్లోకి చొచ్చుకుపోతోంది. కోర్టు తీర్పులు తెలుగుదేశం పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తున్నాయో క్షేత్ర స్థాయికి వెళితే తెలుస్తోంది. చంద్రబాబుకు కుటిల రాజకీయ నేతగా పేరు లేకపోలేదు. ఆ కుటిల రాజకీయాన్ని ఇప్పుడు ఆయన ప్రయోగిస్తున్నారనే అభిప్రాయాలు బలంగా చొచ్చుకుపోతున్నాయి.
ఇక తాజాగా కోర్టుల్లో తమకు అనుకూల తీర్పులు వస్తున్నాయనే ఉత్సాహంలో తెలుగుదేశం పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో మీద కూడా కోర్టుకు ఎక్కింది. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో ఉండకూడదంటూ ఆక్షేపిస్తోంది టీడీపీ. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకపోయినా.. సుప్రీంకు వెళ్లమని సూచించినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే దీనిపై తెలుగుదేశం వదలదని స్పష్టం అవుతోంది.
ఇంతకీ ఈ పిటిషన్ ద్వారా టీడీపీ సాధించేది ఏమిటి? తన అక్కసు ఏ స్థాయిలో ఉందో తెలియజేయడం తప్ప! వీటన్నింటినీ ప్రజలు పట్టించుకుంటారా? ప‌్రభుత్వ ప్రకటనల్లో వైఎస్ ఫొటో ఉండటం, ఉండకపోవడం అనేది ప్రజలు సీరియస్ గా తీసుకునే అంశమా? ఇంతకీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏమిటి?
వైఎస్ తెచ్చిన ఆరోగ్య శ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టలేదా? పత్రికలకు పచ్చ రంగుల్లో యాడ్స్ ఇవ్వలేదా? ప‌్రజల నుంచి ఏనాడూ ఎన్నికైన చరిత్ర లేని వ్యాపార వేత్త నారాయణ ఫొటోను ప్రభుత్వ యాడ్స్ లో వాడటం, చంద్రబాబు తనయుడు అనే అర్హత తప్ప.. మరే అర్హతా లేని లోకేష్ ఫొటోను మంత్రి అంటూ యాడ్స్ లో వాడలేదా? ఎన్టీఆర్ ఫొటోలను తమ అవసరమైన సమాయాల్లో ప్రభుత్వ డబ్బుతో ప్రచురించలేదా? పుష్కర ఘాట్స్ లో కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చుతో ప్రతిష్టాపించిన పనికిమాలిన చరిత్ర ఎవరిది?
ఇంత చేసీ.. కేవలం వైఎస్ ఫొటో విషయంలో ఆక్షేపిస్తూ తెలుగుదేశం పార్టీ కోర్టుకు ఎక్కింది. ఈ పిటిషన్ ద్వారా తన చరిత్రనంతా చర్చలోకి వచ్చేలా తెలుగుదేశమే చేసుకుంటోందని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ పిటిషన్ల అన్నింటి ఫలితంగా తెలుగుదేశం పార్టీ తన ద్వంద్వ వైఖరిని, అక్కసు తనాన్ని మాత్రం చాటుకుంటోంది. పాలనలో చేసిన పనికిమాలిన పనులకు ధీటుగా.. ప్రతిపక్షంలోనూ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. దీనికీ ప్రతిఫలం ఉండకపోదు సుమా!