కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రనాథరెడ్డి ఎమ్మెల్యేగా రెండో దఫా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమలాపురం నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఇక్కడ ఏకగ్రీవం అనే మాటకు తావు లేకుండా అభ్యర్థులను నిలబెట్టడంలో టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి సక్సెస్ అయ్యారు.
అయితే వైసీపీని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా పార్టీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవని టీడీపీ అభ్యర్థులు వాపోతున్నారు. మరోవైపు పుత్తా నరసింహారెడ్డికి ప్రత్యామ్నాయంగా అదే పార్టీలో సాయినాథశర్మ ఎదుగుతుండడం కూడా ఆయన జీర్ణించుకోలేదనే ప్రచారం జరుగుతోంది.
జగన్ మేనమామ ప్రాతినిథ్యం వహిస్తున్న నగర పంచాయతీలో ఎలాగైనా సత్తా చాటాలని టీడీపీ అధిష్టానం పట్టుదలతో ఉన్నప్పటికీ, నియోజకవర్గ ఇన్‌చార్జి నుంచి ఆశించిన రీతిలో సహకారం లభించడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. టికెట్ ఇవ్వడమే ఎక్కువని, ఇక తాను డబ్బు పెట్టే ప్రసక్తే లేదని నరసింహారెడ్డి చెబుతున్నట్టు టీడీపీ అభ్యర్థులు వాపోతున్నారు. సాయినాథ్‌శర్మ తన శక్తి మేరకు అభ్యర్థులను గెలించాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కమలాపురం ఎన్నికల్లో స్థానిక నాయకులకు సహాయకులుగా పులివెందుల, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్‌లు బీటెక్ రవి, ప్రవీణ్‌కుమార్‌లను నియమించారు. స్థానిక నాయకుల నుంచి అభ్యర్థులకు ఆర్థిక సహాయ నిరాకరణ విషయమై వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
అధికార పార్టీ అభ్యర్థులంత కాకపోయినా… కొద్దోగొప్పో ఖర్చు పెట్టగలిగితే మంచి ఫైట్ ఇవ్వొచ్చనేది టీడీపీ అభ్యర్థుల భావన. ఇక ఎన్నికలకు మూడు రోజుల గడువే ఉన్న పరిస్థితుల్లో అధిష్టానం నుంచి ఎలాంటి సాయం అందుతుందో చూడాలి.