హీరో బాలకృష్ణ నటించిన అఖండ మీద వున్నన్ని అంచనాలు ఇన్నీ అన్నీ కావు. ఈ సినిమా విడుదల డేట్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. డిసెంబర్ 2న విడుదల అని వార్తలు మాత్రం వున్నాయి. ఆంధ్రలో టికెట్ రేట్ల సమస్య కారణంగా విడుదల కు ముందు వెనుక ఆడుతున్నారు. ఇక్కడ కీలక సమస్య ఏమిటంటే కేవలం సేల్స్ ఫిగర్ మాత్రమే కాదు. మేకింగ్ ఖర్చు కూడా.
జయ జానకీ నాయక సినిమాతో కాస్త నష్టమే చవి చూసారు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి. ఆయనకు ఆ నష్టం పూడ్చుకునే అవకాశం బాలయ్య అఖండ సినిమాతో వచ్చింది. కానీ ఆ ఆనందం ఆయనకు మిగలడం లేదు అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. దీనికి కారణం దర్శకుడు బోయపాటి పెట్టించిన ఖర్చు.
అఖండ సినిమాకు 80 నుంచి 90 కోట్ల వరకు ఖర్చు అయిందని టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో రూఢిగా వినిపిస్తోంది. దర్శకుడు బోయపాటి సినిమాలు ఎప్పుడూ కాస్ట్ ఫెయిల్యూర్ నే. లెజెండ్ లాంటి సినిమా కూడా ఆ రోజుల్లో నిర్మాతలను అలా అలా గట్టెక్కించింది తప్ప లాభాలు ఇవ్వలేదు. బాలకృష్ణ మార్కెట్ ప్రకారం చూసుకుంటే యాభై కోట్లే ఎక్కువ. బోయపాటి పేరు యాడ్ అయింది కాబట్టి, డిజిటల్, హిందీ రైట్ల ఆదాయం పెరిగింది కాబట్టి 70 కోట్ల వరకు తట్టుకోవచ్చు.
కానీ మరీ 80 నుంచి 90 కోట్ల ఖర్చు అంటే నిర్మాత పరిస్థితి ఏమిటి? అయితే ఆంధ్రలో రేట్ల సమస్య లేకుండా వుండి వుంటే కాస్త గట్టెక్కే పరిస్థితి వుండేది. కానీ టికెట్ రేట్ల వల్ల ఆంధ్ర, సీడెడ్ ల్లో తొమ్మిది కోట్ల వరకు డెఫిసిట్ వస్తోంది. ఇలా అయితే నిర్మాతకు టేబుల్ లాస్ నే. మామూలుగానే ఈ డెఫిసిట్ లేకుండా విడుదల అయినా కూడా పది కోట్ల వరకు చేతి డబ్బులు పెట్టుకుని విడుదల చేయాల్సి వుందని బోగట్టా. ఆరు నెలల తరువాత వచ్చే నాన్ థియేటర్ డబ్బులతో సరిపెట్టుకోవచ్చు.
కానీ ఇఫ్పుడు ఈ డెఫిసిట్ యాడ్ అయితే ఇరవై కోట్ల రూపాయల చేతి మదుపు వుంటే తప్ప సినిమా విడుదల చేయడం కష్టం అని తెలుస్తోంది. దర్శకులు తమ స్టామినా చూపించడానికి సినిమాలు చేస్తే సరిపోదు. హీరో మార్కెట్ కూడా చూడాలి. నిర్మాతకు ఓ రూపాయి అయినా మిగిలేలా చూడాలి. అలా చూడకుండా ఇలా కోట్లకు కోట్లు ఖర్చు చేయిస్తే ఎలా?
ఇదే బోయపాటి గీతా లాంటి సంస్థలో అయితే బుద్దిగా బడ్జెట్ లో సినిమా చేస్తారని, మిరియాల రవీందర్ రెడ్డి లాంటి నిర్మాత దొరికితే ఇలాగే అదుపు లేకుండా ఖర్చు చేయిస్తారని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి