జ‌గ‌న్ కోసం ఎందుకు ప‌ని చేయాలి?

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ ద‌ఫా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా వుంటాయ‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ ఎన్నిక‌లు వైసీపీ, టీడీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఓడిపోయిన పార్టీకి ఇక భ‌విష్య‌త్ వుండ‌ద‌నేది అంద‌రి…

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ ద‌ఫా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా వుంటాయ‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ ఎన్నిక‌లు వైసీపీ, టీడీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఓడిపోయిన పార్టీకి ఇక భ‌విష్య‌త్ వుండ‌ద‌నేది అంద‌రి అభిప్రాయం. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల పుట్టుక‌కు దారి తీసిన నేప‌థ్యాల‌ను గ‌మ‌నంలో పెట్టుకోవాల్సి వుంటుంది. తెలుగువారి ఆత్మ గౌర‌వం నినాదంతో తెలుగుదేశం పార్టీ అవ‌త‌రించింది.

ఇదే వైసీపీ విష‌యానికి వ‌స్తే … వైఎస్సార్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఒక ఎమోష‌న‌ల్ ప‌రిస్థితిలో అవ‌త‌రించిన పార్టీ. రాజ‌కీయ పార్టీగా టీడీపీకి ఒక ప‌ద్ధ‌తి, విధానం వున్నాయి. నంద‌మూరి, నారా వారి కుటుంబ స‌భ్యుల పెత్త‌నం వున్న‌ప్ప‌టికీ, చాలా విష‌యాల్లో పార్టీని ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో న‌డుపుతున్న‌ట్టు క‌నీసం క‌నిపించేలా ముఖ్య‌మైన నాయ‌కులు న‌డుచుకుంటుంటారు. వైసీపీ విష‌యంలో అలాంటి సంప్రదాయం క‌నిపించ‌దు.

ప్లీన‌రీ స‌మావేశాల్లో వైఎస్ జ‌గ‌న్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోడానికి కూడా భారంగా భావించి, ఆ మ‌ధ్య శాశ్వ‌త అధ్య‌క్షుడంటూ తీర్మానించ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ఎవ‌రో న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డంతో వైసీపీ పెద్ద‌లు నాలుక్క‌రుచుకుని, అబ్బే తాము అలా తీర్మానించ‌లేద‌ని చెప్పుకోవాల్సి వ‌చ్చింది. అట్లుంట‌ది మ‌రి వీళ్ల వ్య‌వ‌హారం.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌, జ‌గ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర వ‌ల్ల వైసీపీకి అధికారం ద‌క్కింది. వైసీపీ అధికారంలోకి రాక‌మునుపు కూడా పార్టీకి పెద్ద‌గా ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు క‌నిపించ‌లేదు. టీడీపీకి పొలిట్‌బ్యూరో అన్న‌ది అత్యంత కీల‌క‌మైన క‌మిటీ. ఒక విష‌యంపై చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకోవాలంటే పొలిట్‌బ్యూరో స‌భ్యుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తుంటారు. వైసీపీకి కూడా ఒక కీల‌క క‌మిటీ వుంది. టీడీపీకి పొలిట్‌బ్యూరో ఎలాగో, వైసీపీకి కేంద్ర క‌మిటీ కూడా అంతే ముఖ్య‌మైన క‌మిటీ. కానీ వైసీపీ కేంద్ర క‌మిటీ స‌మావేశం అయిన‌ట్టు మ‌న‌మెప్పుడూ విని వుండం.

అస‌లు వైసీపీ కేంద్ర క‌మిటీ స‌భ్యులెవ‌రూ కూడా ఎవ‌రికీ తెలియ‌దు. క‌నీసం స‌భ్య‌త్వం ఉన్న వాళ్లు మ‌రిచిపోయేంత‌గా అది నిర్ల‌క్ష్యానికి గురైంది. వైసీపీ అధికారంలో వుండ‌డంతో పార్టీకి సంబంధించి మైన‌స్‌లు క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీని యాక్టీవ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. అయితే మ‌రోసారి జ‌గ‌న్‌ను సీఎం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏంటి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

ముఖ్యంగా ఇంత కాలం జ‌గ‌న్ అధికారంలో వుంటే ప్ర‌ధానంగా ల‌బ్ధి పొందిన నేత‌లెవ‌రు? అనే ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. వైసీపీ అధికారంలోకి రావ‌డానికి మాత్రం అంద‌రూ త‌మ‌కు తోచిన, చేతనైన వ‌ర‌కూ క‌నీసం ఉడ‌త సాయమైనా చేశారు.  అయితే వైసీపీకి అధికారం ద‌క్కిన త‌ర్వాత ఆ ఫ‌లాల‌ను అనుభ‌విస్తున్న వారెవ‌రంటే… రాష్ట్ర‌స్థాయిలో తొమ్మిది నుంచి ప‌ది మంది రెడ్ల నాయ‌కుల పేర్లే ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. వీళ్లంతా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చివ‌రికి సొంత వాళ్ల‌ను కూడా అణ‌చివేసిన‌, వేస్తున్న దుస్థితి ఈ ప్ర‌భుత్వంలోనే చూస్తున్నాం. త‌మ ఆగ‌డాల‌కు పోలీసుల‌ను య‌థేచ్ఛ‌గా వాడుకుంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల్లో త‌మ మ‌నుషుల్ని నియ‌మించుకుని ప్ర‌జ‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

సంపాద‌న విష‌యానికి వ‌స్తే, ఆకాశ‌మే హ‌ద్దుగా ప్ర‌తిదీ దోచుకున్నారు. త‌మ వార‌సుల‌కు రాజ‌కీయ ప‌ద‌వులు, ఇత‌ర‌త్రా అధికార అధికారాలు, అలాగే ఆర్థికంగా భారీ మొత్తంలో సంపాదించుకోడానికి అన్ని వ‌న‌రుల‌ను య‌థేచ్ఛ‌గా వాడుకుంటున్నారు. ఇలాంటి నాయ‌కులే ఇప్పుడు త‌ర‌, త‌మ బేధం లేకుండా అధికార అండ చూసుకుని బెదిరిస్తున్నారు. త‌మకు అన్యాయం చేశార‌ని, చేస్తున్నార‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే తీవ్ర‌స్థాయిలో అణచివేత చ‌ర్య‌ల‌కు వెనుకాడ‌డం లేదు.

నామినేటెడ్ ప‌ద‌వుల పంపిణీలో క‌నీస అర్హ‌త లేని వాళ్ల‌ను కూడా అంద‌లం ఎక్కించారు. ఇలాంటి వాళ్ల‌ను చూస్తే, మ‌రోసారి జ‌గ‌న్‌ను సీఎం చేసుకోడానికి వైసీపీ కోసం ఎందుకు ప‌ని చేయాల‌నే ప్ర‌శ్న అంతరాత్మ వేస్తోంద‌ని కొంద‌రు ఆవేద‌న‌తో చెబుతున్నారు. త‌మ అధికారాన్ని, సంప‌ద‌ను కాపాడుకునేందుకే జ‌గ‌న్‌ను సీఎం చేసుకోవాల‌ని అలాంటి వాళ్లంతా ఎన్నిక‌లు ముంచుకొస్తున్న స‌మ‌యంలో భారీ డైలాగ్‌లు కొడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. అంతే త‌ప్ప‌, జ‌గ‌న్ అధికారం కోసం వాళ్లు చిత్త‌శుద్ధితో ప‌ని చేయ‌డం లేద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

వైసీపీలో నైరాశ్యం ఏర్ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… వైసీపీ అధికారం వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది నాయ‌కుల కోసం మాత్ర‌మే ఉంద‌నే బ‌ల‌మైన అభిప్రాయం క‌ల‌గ‌డ‌మే. ఈ అభిప్రాయం కార్య‌క‌ర్త‌ల్లో మాత్ర‌మే ఉంద‌ని అనుకుంటే త‌ప్పు. ప్ర‌తి నియోజ‌క వ‌ర్గంలో ద్వితీయ శ్రేణి నాయ‌కుల్లో కూడా అసంతృప్తి, అస‌హ‌నం ఉంది. క‌నీసం త‌మ బ‌తుకు తాము బ‌త‌కడానికి కూడా వీల్లేని పాల‌న‌లో ఉన్నామ‌నే అస‌హ‌నం చోటు చేసుకుంది. అందుకే గ‌తంలో మాదిరిగా జ‌గ‌న్ కోసం ప‌ని చేయాల‌ని తాప‌త్ర‌య ప‌డేవాళ్లు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నారు. జ‌గ‌న్ అధికారంలో వ‌చ్చాక ఆయ‌న చుట్టూ కొంత మంది నాయ‌కులు, ఎక్కువగా ఉన్న‌తాధికారులే క‌నిపిస్తున్నారు.

జ‌గ‌న్‌ను ఇప్ప‌టికీ జ‌నంలోకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న చేయ‌డం లేదు. సీఎం క్యాంప్ కార్యాల‌యంలో ఇల్లు, కార్యాల‌యం…ఇంత‌కు మించి జ‌గ‌న్‌కు మ‌రో ప్ర‌పంచాన్ని చూపాల‌నే ధ్యాసే లేక‌పోవ‌డం వైసీపీ శ్రేణుల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఒక బొమ్మ‌ను తీసుకెళ్లిన‌ట్టు జ‌గ‌న్‌ను ఇంట్లో నుంచి సీఎం కార్యాల‌యానికి లేదా బ‌ట‌న్ నొక్కేందుకు జిల్లాల‌కు అప్పుడ‌ప్పుడు తీసుకెళ్తున్నారు. త‌న బ‌ల‌మే జ‌నం అనే వాస్త‌వాన్ని జ‌గ‌న్ విస్మ‌రించిన‌ట్టున్నారు. మ‌ళ్లీ సీఎం కావాలంటే జ‌నంతో క‌నెక్ట్ కావాల‌నే కీల‌క అంశాన్ని ఆయ‌నకు ఎందుకు గుర్తు రాలేదో అంతుప‌ట్ట‌డం లేదు.

త‌న పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని పోగొట్టాల‌ని, అలాగే తాను న‌మ్ముకున్న నేత‌ల‌పై ప్ర‌జాభిప్రాయం తెలుసుకుని దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాలని జ‌గ‌న్ ఆలోచిస్తున్న దాఖ‌లాలు లేవు. ల‌క్ష‌ల కోట్ల సొమ్మును న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధి చేకూర్చా న‌ని, అదే త‌న‌కు మ‌రోసారి అధికారం తెచ్చి పెడుతుంద‌నే విశ్వాసంతో జ‌గ‌న్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ప్ర‌జ‌లు ఏమంత అమాయ‌కులు కాద‌ని గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును మ‌ట్టి క‌రిపించిన వైనం నుంచి తెలుసుకోవాలి. జ‌గ‌న్ అధికారం కొంద‌రి కోస‌మ‌నే ఆగ్ర‌హ‌మే వైసీపీపై సొంత వాళ్ల వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతోంద‌ని ఇప్ప‌టికైనా గ్ర‌హించి, దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డితే మంచిది.

పీ.ఝాన్సీ