బిగ్‌బాస్‌లో ఇక గ‌రుడ పురాణం!

బిగ్‌బాస్ సీజ‌న్‌-7 రియాల్టీ షో ప్రారంభ‌మైంది. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపారు. ఈ సీజ‌న్‌కు కూడా హోస్ట్‌గా హీరో నాగార్జున వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా వుండ‌గా ఈ ద‌ఫా సినీ న‌టుడు…

బిగ్‌బాస్ సీజ‌న్‌-7 రియాల్టీ షో ప్రారంభ‌మైంది. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపారు. ఈ సీజ‌న్‌కు కూడా హోస్ట్‌గా హీరో నాగార్జున వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా వుండ‌గా ఈ ద‌ఫా సినీ న‌టుడు శివాజీ ఎంట్రీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. శివాజీకి న‌టుడిగా కంటే రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తింపు వుంది. ముఖ్యంగా గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఎల్లో బ్యాచ్‌కు అనుకూలంగా రాజ‌కీయ తెర‌పై ఆయ‌న ఫ‌ర్మామెన్స్ అదుర్స్ అనిపించార‌నే సెటైర్స్ వెల్లువెత్తాయి.

అప్ప‌ట్లో టీడీపీకి అనుకూలంగా రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని సృష్టించేందుకు శివాజీ త‌న వంతు పాత్ర‌ను దిగ్విజ‌యంగా పోషించారు. ఏపీలో జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ను కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఎలా ఆడిస్తుందో అంద‌మైన క‌ట్టు క‌థ‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా శివాజీ వివ‌రించారు. అప్ప‌టి నుంచి ఆయన్ను అంద‌రూ గ‌రుడ పురాణం శివాజీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

పోల‌వ‌రంలో చంద్ర‌బాబునాయుడు అద్భుతాలు సృష్టించార‌ని, రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆకాశ హార్మ్యాల‌ను తాకేలా భ‌వ‌నాలు నిర్మించార‌ని చెప్ప‌డంలో శివాజీ న‌ట‌న వారెవ్వా అనిపించింది. వెండితెర‌పై న‌టన‌కు తీసుకున్న ప్యాకేజీ కంటే, రాజ‌కీయ తెర‌పై న‌ట‌న‌కే ఎక్కువ గిట్టుబాటు అయ్యింద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వెల్లువెత్తాయి. 

ఎన్నిక‌ల్లో శివాజీ బ‌ల‌ప‌రిచిన టీడీపీ మ‌ట్టి కొట్టుకుపోయింది. అనంత‌ర కాలంలో శివాజీ బీజేపీ పంచ‌న చేరి, టీడీపీ అనుకూల రాజ‌కీయం చేసేందుకు ప్ర‌య‌త్నించినా, స‌క్సెస్ కాలేక‌పోయారు. ఆ త‌ర్వాత బీజేపీ నుంచి కూడా బ‌య‌టికొచ్చారు. అడ‌పాద‌డ‌పా ఎల్లో మీడియా డిబేట్ల‌లో పాల్గొంటున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. 

కావాల్సినంత నెగెటివిటీని సంపాదించుకున్న శివాజీ బిగ్‌బాస్ హౌస్‌లో ఏం చేస్తార‌నేది ఆసక్తి క‌లిగిస్తోంది. అక్క‌డ కూడా గ‌రుడ పురాణం అంటూ క‌థ‌లు చెప్పి బుల్లితెర ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటారా?  లేక వ్య‌తిరేక‌త‌ను సంపాదించ‌కుని త్వ‌ర‌గా బ‌య‌టికొస్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.