వికటిస్తున్న డాలర్ డ్రీమ్స్!

పశ్చిమ దిక్కులో సూర్యుడు అస్తమిస్తాడే గానీ.. ఉదయించడం అనేది అసాధ్యం! వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ దేశాలు, వెస్టర్న్ చదువులు.. తాహతు చూసుకోకుండా, కనీసం అక్కడి చదువుల నాణ్యతపై అవగాహన కూడా లేకుండా మధ్యతరగతి భారతం…

పశ్చిమ దిక్కులో సూర్యుడు అస్తమిస్తాడే గానీ.. ఉదయించడం అనేది అసాధ్యం! వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ దేశాలు, వెస్టర్న్ చదువులు.. తాహతు చూసుకోకుండా, కనీసం అక్కడి చదువుల నాణ్యతపై అవగాహన కూడా లేకుండా మధ్యతరగతి భారతం ఎగబడుతోంది. ‘అక్కడ’ దినకూలీ పని దొరికినా, ‘ఇక్కడ’ సీఈవో కంటె దండిగా సంపాదించగలమనే ఆశ.. వెంపర్లాడేలా చేస్తోంది. పశ్చిమాన సూర్యులు ఉదయించిన పుణ్యకాలం గతించిపోయింది. ఇప్పుడన్నీ అస్తమయాలే! పశ్చిమదీపాల వెలుగులకు భ్రమసి.. ఎగబడి రెక్కలు రాల్చుకుని మాడిపోతున్న తెలుగు శలభాల దయనీయ కథనాల గురించే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘పశ్చిమాన సూర్యుడు పొడవడు’!

సుమారు రెండు దశాబ్దాల కిందట అమెరికాలో ఒక నేరం జరిగింది. ఒక పదివేల డాలర్ల నకిలీ నోటును అక్కడి పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అంటే నకిలీ నోట్ల చెలామణీ అన్నమాట. అసలే డాలరు ధర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బోలెడంత ఎక్కువగా ఉంటుంది. అమెరికా వారి డాలరు ప్రపంచాన్ని శాసిస్తుంటుంది. అలాంటిది- పదివేల డాలర్ల నకిలీ నోటు అంటే.. తమాషా కాదు కదా! అంచేత వారు దాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారు. 

ఇంతకూ ఆ నోటు నకిలీది అని ఎలా గుర్తు పట్టారు? అది సైజు, కాగితం, ముద్రణ, రహస్య మార్కులు తదితర అన్ని రూపాలలోనూ అచ్చంగా నిజమైన నోటులాగానే ఉన్నదిట. నరమానవుడెవ్వడూ దాన్ని ఎన్ని రకాలుగా పరీక్షించినా నకిలీదని చెప్పడం కష్టం! కానీ అమెరికా పోలీసులు ఎలా పట్టుకున్నారంటే.. పదివేల డాలర్ల విలువైన నోటు అనేది అసలు అమెరికా పౌర వినియోగంలో ఉండదుట. 

కేవలం బ్యాంకుల మధ్య నగదు లావాదేవీలు జరగడానికి మాత్రమే అంత ఎక్కువ విలువైన నోటును వాడుతుంటారు. అలాంటిది ఒక మామూలు వ్యక్తి పౌర వినియోగంలో ఆ నోటు తీసుకొచ్చేసరికి వారికి అనుమానం వచ్చింది తప్ప.. దాని తయారీలో నాణ్యతలోపం వల్ల మాత్రం కాదు. మొత్తానికి ఆ నకిలీనోటు విషయంలో పరిశోధన కొనసాగిస్తూ చివరకు వెళ్లేసరికి.. నిర్ఘాంతపోవడం పోలీసుల వంతైంది. ఎందుకంటే.. ఆ పదివేల డాలర్ల నకిలీనోటు మన కోల్‌కతలోనే అచ్చయింది. నకిలీల తయారీలో మనవారి నాణ్యత ప్రమాణాలను చూసి అమెరికా దిగ్భ్రమకు గురైంది.

రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి గానీ.. మనవాళ్లు నకిలీల తయారీలో ఇప్పటికీ అవే నాణ్యత ప్రమాణాలను అమెరికాకు రుచిచూపిస్తున్నారు. ఇప్పుడు డాలర్లు కాదు.. ఏకంగా నకిలీ గ్రీన్ కార్డులు, నకిలీ హెచ్ 1 బీ వీసాలు తయారుచేసేస్తున్నారు. దొరికే దాకా దొరగానే చెలామణీ అయిపోగలమనే నమ్మకం వారితో ఇలాంటి పనిచేయిస్తోంది. అధికారికంగా కాకపోయినా.. ఏదో ఒక ఉపాధి మార్గం వెతుక్కోగల అవకాశం అమెరికా అందిస్తుండడం కూడా వారు తప్పుడు మార్గాలు తొక్కడానికి ప్రేరేపిస్తోంది.

రకరకాల ఆశలు ఇలాంటి తప్పుడు పనులకు మనవాళ్లను ప్రేరేపిస్తున్నాయి. ఆశతో అక్కడకు వెళుతున్న వారి నేరాలు కొన్ని అయితే.. అడ్డగోలుగా వారిని వాడుకుని వారిని ఉచ్చులోకి నెట్టేసి తాము విచ్చలవిడిగా దండుకోవాలనే అత్యాశ అక్కడ స్థిరపడిన తెలుగు వారిది. ఈ రెండు రకాల మాయలు కలిసి అమెరికా వ్యాప్తంగా భారతీయులంటే, ప్రత్యేకించి తెలుగు వారంటే ఒక చులకన అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. మన పరువు తీస్తున్నాయి. కేవలం విద్యార్థులు, ఉద్యోగాలు, నకిలీ గుర్తింపుల దుర్మార్గాలు మాత్రమే కాదు.. అంతకు మించిన ఇతరత్రా పచ్చి మోసాలను కూడా అక్కడి తెలుగువారు అమెరికన్లకు రుచిచూపిస్తున్నారు.

డాలర్ డ్రీమ్స్

ఎవ్వరైనా అమెరికాకు ఎందుకు వెళుతున్నారు? ప్రత్యేకించి విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం పేరుతో గుంపులు గుంపులుగా తరలి వెళుతున్నారు ఎందుకు? అనే సందేహాలు ఈ అమెరికా అనుబంధ ప్రపంచంతో సంబంధంలేని వ్యక్తులకు కలగడం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. కరవు ప్రాంతంనుంచి కూటికి గతిలేక కడుపు చేత పట్టుకుని ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి నగరాలకు వలసవెళ్లిపోయే కూలీల్లాగా.. ఉన్నత విద్య పేరుతో వేలకు వేల మంది విద్యార్థులు అమెరికాకు తరలి వెళ్లిపోతున్నారు. హైదరాబాదులోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరీ రైల్వే స్టేషన్ ల కంటె దారుణంగా విద్యార్థులు, వారి కుటుంబాలతో కిటకిటలాడిపోవడం అనేది చాలా తరచుగా జరుగుతోంది. నిజంగానే వీరంతా పై చదువుల కోసమే అమెరికా వెళుతున్నారా? వీరిలో నూటికి నూరుశాతం అందరూ అంతగా చదువు మీద శ్రద్ధ ఉన్నవారేనా? వీరికి చదువు మీద ప్రేమ ఉన్నదని అనుకున్నప్పటికీ, అమెరికాలోని పై చదువులు అంతగా అత్యుత్తమమైనవా? అనే సందేహాలు అనేకం మన మదిలో మెదలుతాయి.

కానీ వాస్తవాలు కొంచెం చేదుగా ధ్వనించినా అవి వేరు. వీరి పశ్చిమ ప్రయాణాలకు ముసుగు చదువు, కానీ అసలు లక్ష్యం సంపాదన. సమస్తం డాలర్ డ్రీమ్స్! అమెరికాలో చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు వారానికి కొన్ని గంటల వంతున పనిచేసుకోవడానికి పర్మిట్లు ఇస్తారు. ఆ కొన్ని గంటలకు మించి, అనధికారికంగా మరికొన్ని గంటల పనిని వారు దొరకబుచ్చుకోగలరు. అలా గంటల వారీగా పనిచేసి సంపాదించే సొమ్ము మీదనే వారి అసలు ధ్యాస మొత్తం ఉంటుంది. ఎందుకంటే… ఇలా అమెరికాలో గంటల వంతున వారు కళ్ల జూస్తున్న డబ్బు ఇక్కడ భారత్ లోని సంస్థల్లో పెద్దపెద్ద హైలెవెల్ ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలకు సమానంగా ఉంటోంది. అందుకే అందరిలోనూ డాలర్ డ్రీమ్స్ ఉరకలేస్తుంటాయి. వారితో పరుగులు తీయిస్తుంటాయి.

ఇక్కడ మరో సంగతి గమనించాల్సిన అవసరం ఉంది. మన వాళ్లు చేస్తున్నవేవీ మరీ అంతగా గౌరవప్రదమైన పనులు కావు. పెట్రోలు బంకులు, సూపర్ మార్కెట్లు, హోటళ్లలో పనికి కుదురుతూ ఉంటారు. వీటికి తోడు ఇళ్లలో పనికి కూడా కుదురుతూ ఉంటారు. మనకు ఇక్కడ సర్వెంట్ మెయిడ్ లాంటి పనులే అక్కడ చేస్తుంటారు. మన ఇళ్లలో తాము తిన్న కంచం తాము తీయడం గానీ, కడగడం గానీ అలవాటు లేని యువకులు కూడా అక్కడ అంట్లు తోమడానికి, ఇల్లు ఊడవడానికి పనికి కుదురుకుంటారు. 

ఇక్కడ తల్లికి కనీసం కూరగాయలు తరిగి ఇవ్వడం అలవాటు లేని అమ్మాయిలు కూడా.. అక్కడ ఇంటి పనుల్లో ఇమిడిపోతారు. డాలర్లలో వచ్చే కూలీ వారిని లొంగదీసుకుంటుంది. చదువు పూర్తయ్యేలోగా.. ఈ డాలర్ల దిగుబడికి వారు అప్పటికే అలవాటు పడిపోయి ఉంటారు. చదువు మీద ఆధారపడి ఏవైనా పెద్ద ఉద్యోగాలు, తత్సంబధిత వీసాలు వస్తే సరేసరి! అవి లేకపోయినా.. ఇలాంటి చిల్లర పనులతో జీవితం వెళ్లబుచ్చేసుకుంటూ బతికిపోతాం అని అనుకుంటున్నారు.

సరిగ్గా అలాంటి వారితోనే నకిలీల వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంటుంది. అమెరికాకు మీ పిల్లల్ని పంపేయడానికి హైదరాబాదు లాంటి నగరాల్లో వందల సంఖ్యలో కన్సల్టెన్సీ కంపెనీలు ఉన్నట్టే.. అక్కడ మన యువతరాన్ని ఆదుకోడానికి, మనవారే, అంటే తెలుగువారే, నడుపుతున్న కన్సల్టెన్సీలు కూడా అంతే ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వారే కొలువులు చూపిస్తారు.. అందుకు అవసరమైన ధ్రువపత్రాలన్నిటినీ వారే నకిలీవి పుట్టిస్తారు. భారీగా కమిషన్లు తండుకుంటూ ఉంటారు.  కానీ ఆ నకిలీలతో దొరికిపోయిన నాడు అసలు సమస్య తలెత్తుతుంది. అమెరికాలో ఇలాంటి నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ.. దొరికినప్పుడు.. ఆ నకిలీలను సృష్టించి ఇచ్చిన కన్సల్టెన్సీ వాళ్లు ఆదుకోరు సరికదా.. పూర్తిగా మొహం చాటేస్తారు. లీగల్ గా వారి మీదకు ఎలాంటి నేరారోపణ రాకుండా ఉండేలా.. ముందు నుంచి జాగ్రత్తగా వ్యవహారం నడిపిస్తారు. దాంతో దొరికిపోయిన యువతరం జీవితాలు సర్వనాశనం అవుతాయి.

నేరం కేవలం యువతరానిదేనా?

డాలర్ డ్రీమ్స్ తో ఈ పరుగులాటలో.. తప్పంతా కేవలం పిల్లల మీదికే నెట్టేయడం భావ్యం కాదు. ఇవాళ్టి రోజుల్లో మధ్యతరగతి వారందరూ కూడా.. తమ పిల్లలను అమెరికా పంపి చదివించడం అనేది ఒక తప్పనిసరి పనిలాగా చేసుకుంటూ పోతున్నారు. వారికి సదరు పైచదువుల గురించిన అవగాహన ఏమీ ఉండదు. అక్కడి డాలర్ల సంపాదన వారిని ఊరించే మొదటి పాయింట్ కాగా, మా వాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్పుకోవడంలటో ఉండే స్టేటస్ ప్రదర్శన ఉబలాటం.. రెండో పాయింట్. అందుకోసం అప్పులు చేసి మరీ పిల్లలను అమెరికాకు పంపుతున్నారు. పిల్లలు అక్కడ ఇరుక్కుపోయాక వారికి సరైన పనులు కూడా దొరక్క ఇక్కడ అప్పులు తీర్చలేక నానా కష్టాలు పడుతున్నారు.

అమెరికాకు పిల్లల్ని పంపాలని అనుకునే ప్రతి తల్లిదండ్రీ ఒక పాయింట్ ఆలోచించాలి. అక్కడి చదువులకు, అక్కడ పిల్లలు నివాసం ఉండడానికి అవసరమయ్యే ఖర్చులకు పూర్తిగా తాము సొంతంగా ఉన్న డబ్బుతో భరించగలం అనుకుంటేనే పంపాలి. పిల్లలను ఎలాగోలా కష్టపడి అక్కడకు పంపేస్తే.. అక్కడ సంపాదించుకుంటూ చదువుకుంటార్లే అనుకుంటే ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. చిన్నలాజిక్ ఏమిటంటే.. ఏడాదికి కొన్ని లక్షల మంది తెలుగువాళ్లు.. పై చదువుల మిషతో అమెరికాకు వెళ్లిపోతోంటే.. వీరందరికీ చిన్నవో పెద్దవో బతుకుతెరువు ఉపాధి అవకాశాలు అక్కడ అవైలబుల్ గా ఉండాలి కద. వెళుతున్న నూటికి నూరుశాతంమందికీ యివ్వగలిగినన్ని ఉద్యోగాలు, పనులు అమెరికా మొత్తం గాలించినా దొరకవు. ఈ అంశాలను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. 

పరువు తీసుకుంటున్న అమెరికా తెలుగోళ్లు..

ఇప్పటిదాకా కుర్రకారు పెట్టుకుంటున్న అత్యాశలు, గురవుతున్న  వంచనలు గమనించాం. కానీ.. వీరిని మించి అమెరికాలో తెలుగువాళ్లు చేస్తున్న మోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. అమెరికా సమాజంలో తెలుగు కమ్యూనిటీ పేరు వింటేనే అనుమానంగా చూసే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తెలుగు యువతరం ఇరుక్కుంటున్న నకిలీ గ్రీన్ కార్డులు, నకిలీ హెచ్ 1బి  వీసాల కేసుల్లో వాటిని సృష్టిస్తున్నవి తెలుగువారు నిర్వహిస్తున్న కన్సల్టెన్సీలే. ఇలాంటి మోసాలు మాత్రమే కాదు.. రియల్ ఎస్టేట్ రూపంలో కూడా అమెరికా వాసులకు కొత్త వంచనల రుచిచూపించడానికి తెలుగువారు అనేక కొత్తమార్గాలను అన్వేషిస్తున్నారు.

అమెరికాలో ఇటీవలి కాలంలో తెలుగువారి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగింది. అక్కడి సమాజంలోని వారికి ఏ తెలుగువాడు పరిచయం అయినా.. తెలుగు కమ్యూనిటీకే చెందిన మరొక తెలుగు వ్యక్తిని పరిచయం చేస్తాడు. సదరు కొత్త వ్యక్తి.. అప్పటికే రియల్ ఎస్టేట్ లో వ్యాపారం చేస్తూ ఉంటాడు. తాను చేస్తున్న వెంచర్లు, నిర్మాణాల గురించి కొత్త ముగ్గులోకి వచ్చిన అమెరికన్ కు అరచేతిలో స్వర్గాన్ని తలపిస్తూ వివరించి చెబుతాడు. అక్కడి అమెరికన్లు మాత్రమే కాదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు తదితర వృత్తి వ్యాపారాల్లో స్థిరపడుతున్న తెలుగువారు కూడా ఈ ఆస్తులపై , వారు చెప్పే ఆఫర్లపై ఆశపడతారు. తీరా అడ్వాన్సులు తీసుకునే సమయంలో.. సదరు వ్యాపారి రకరకాల షెల్ కంపెనీలను తెరమీదికి తెచ్చి ఆయా కంపెనీల అకౌంట్లలోకి డబ్బు జమ చేయించుకుంటాడు. 

మనకు తక్కువ ధరకు లభిస్తుందనే భ్రమలో.. అడిగిన కంపెనీ పేరిట డబ్బు చెల్లించేస్తారు. తీరా కొన్నాళ్లు గడిచిన తర్వాత తెలుస్తుంది. మనవాళ్లు అదే ఆస్తిని అనేక కంపెనీల ద్వారా.. అనేక మందికి విక్రయించేసి ఉంటారని!మోసపోయం అని గుర్తిస్తారు. చెల్లించిన వారిలో బలవంతులు, గట్టివాళ్లు ఉంటే పోరాడి తమ అడ్వాన్సు వసూలు చేసుకుంటారు. కానీ.. లీగల్ పోరాటం చేయడానికి చాలా మందికి ఉత్సాహం, ఓపిక ఉండదు. లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి అమెరికాలో చాలా ఖరీదైనవి. వాటిని భరించడం కంటె అడ్వాన్సు వదులుకోవడం ఉత్తమం అని ఎక్కువ మంది భావిస్తారు. మోసాని సహిస్తారు. అప్పటినుంచి తెలుగువారిని తిట్టుకుంటూ గడిపేస్తుంటారు. ఈ తరహా మోసాలతో తెలుగు వారంటేనే  పరువు పోయే వాతావరణం అమెరికా వ్యాప్తంగా క్రియేట్ అవుతున్నదంటే అతిశయోక్తి కాదు. 

ఈ డాలర్ డ్రీమ్స్ మన తెలుగు వారిని రకరకాలుగా ఇరికిస్తున్నాయి. రకరకాలుగా పతనంచేస్తున్నాయి. అయినా సరే.. పడమటి సంధ్యల్లో వాలిపోయే వెలుగులకోసం పరుగులిడుతున్న వారే ఎక్కువ. వారందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వెలుగులు చిమ్మే సూరీడు తూర్పునే ఉదయిస్తాడు. పడమట పొద్దు పొడవడం అనేది ఉండదు గాక ఉండదు!

.. ఎల్ విజయలక్ష్మి