జగన్ బలవంతుడు అవునా కాదా అన్నది వైసీపీ వారు చెబుతారు. మా నాయకుడు సింహం. సింగిల్ గా వస్తారు అని పదే పదే అంటారు. కానీ ప్రత్యర్ధి పార్టీలు కూడా అదే తలుస్తున్నాయి. అందుకే పొత్తుల కోసం జట్టు కట్టి మరీ వస్తున్నాయి అని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు.
సరిగ్గా అదే మాటను జనసేన అధినేత పవన్ కూడా అంటున్నారు. ఆయన పొగడడానికి అనకపోయినా బలవంతుడైన శత్రువుగా జగన్ని పోల్చారు. శ్రీకాకుళం రణస్థలంలో జరిగిన యువశక్తి సభలో పవన్ జగన్ని ఓడించడానికే పొత్తుల వైపు చూస్తున్నామని పేర్కొన్నారు.
ఎందుకు పొత్తులు అన్న దాని మీద మాట్లాడుతూ శత్రువు అవతల వైపు బలంగా ఉన్నపుడు ఆయన్ని ఢీ కొట్టేందుకు అవసరమైనపుడు ఇష్టం లేకున్నా పొత్తులతో వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుల గురించి ఇపుడు అంతా మాట్లాడుకుంటున్నారు.
దాని మీద డిబేట్లు సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ ఎందుకు మిత్రులను కలుపుకుని పోవాలన్న దాని మీద స్పష్టత ఇచ్చే ప్రయత్నంలో భాగంగా జగన్ బలవంతుడు కాబట్టే అంతా కలవాల్సి వస్తోంది అన్న మాట చెప్పారన్న మాట. దీనిని వైసీపీ నేతలు కూడా ఇది నిందాపూర్వకమైన ప్రశంసగానే చూస్తున్నారు.
జగన్ బలం ముందు ఒంటరిగా రాలేకనే అంతా గుంపుగా వస్తున్నారు అని ఇప్పటికే వారు అంటున్నారు. ఇపుడు పవన్ నోటి వెంట కూడా దాదాపుగా అలాంటి మాటలు రావడంతో జగన్ బలవంతుడే అని అంటున్నారు. పైగా ఎందరు కలసి వచ్చినా జగన్ని ఏమీ చేయలేరని కూడా అంటున్నారు. పవనే కాదు చంద్రబాబుకు కూడా జగన్ బలం తెలుసు అని ఆ నిజం వారే ఒప్పుకుంటున్నారు అని సెటైర్లు వేస్తున్నారు.