నమ్మితేనే మోసపోతారని పెద్దలు ఊరికే చెప్పలేదు. ముంబై కంపెనీ మోసానికి మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ఆ మొత్తం ఎంతో తెలిస్తే… వామ్మో అని గుండెలు బాదుకోవాల్సిందే. ముంబై కంపెనీ చేతిలో అక్షరాలా రూ.11 కోట్లు మోసపోయారనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఒక లోన్ వ్యవహారంలో 1 శాతం బదిలీకి ముంబైకి చెందిన చాంపియన్ పిన్స్ లిమిటెడ్ కంపెనీతో సుబ్బరామిరెడ్డి సతీమణి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సుబ్బరామిరెడ్డి దంపతులకు కనీస సమాచారం లేకుండానే సదరు కంపెనీ షేర్లను అమ్మేసింది. దీంతో సుబ్బరామిరెడ్డి దంపతులు రూ.11 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.
తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన సుబ్బరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి చాంపియన్ పిన్స్ లిమిటెడ్‌కు చెందిన చేతన్ పటేల్, హర్షవర్ధన్‌లను అరెస్ట్ చేశారు. గుడ్డిగా ఎవరినీ నమ్మొద్దనే సందేశాన్ని ఈ ఘటన ఇస్తోందని పోలీసులు చెబుతున్నారు.
నిందితుల నుంచి ఆ మొత్తాన్ని రాబట్టడంలో సాధ్యాసాధ్యాల గురించి పోలీసులు ఆర్థిక నిపుణులతో చర్చిస్తున్నారు. ఇలా ఇంకెంత మంది ఆ కంపెనీ చేతిలో మోసపోయారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.