సుశాంత్ మరణంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. ఈరోజు విచారణలో కీలకమైన దశలోకి ఎంటరైంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రబొర్తిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో తొలిరోజే రియాకు చుక్కలు కనిపించినట్టు సమాచారం.
ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ముంబయిలోకి డీఆర్డీవో గెస్ట్ హౌజ్ కు చేరుకుంది రియా. అధికారులిచ్చిన సమాచారం ప్రకారం.. 11 గంటల 30 నిమిషాలకు విచారణ ప్రారంభమైంది. అప్పట్నుంచి రాత్రి 9 గంటల వరకు రియాను ప్రశ్నిస్తూనే ఉన్నారు అధికారులు. మధ్యలో 2 సార్లు విరామం ఇచ్చారు. మరో 2 సార్లు భోజన విరామం ఇచ్చారు.
కేసును రియా కోణంలో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించారు సీబీఐ అధికారులు. అందుకే సుశాంత్-రియా మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ఎక్కడ పరిచయమైందనే పాయింట్ నుంచి విచారణ ప్రారంభించారు. రియా చెప్పిన వివరాలన్నింటినీ రికార్డు చేసిన అనంతరం.. తాము సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని రియా ముందుంచారు. ఇక అక్కడ్నుంచి రియాకు చుక్కలు కనిపించినట్టు సమాచారం.
సుశాంత్-రియా మధ్య సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలు, మాదక ద్రవ్యాలు లాంటి అంశాలపై సీబీఐ సూటిగా ప్రశ్నలు సంధించింది. దీంతో పాటు సుశాంత్ మరణానికి కొన్ని రోజుల ముందు రియా ఎందుకు ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా ఎక్కువ ప్రశ్నలు పడినట్టు సమాచారం. రియా సోదరుడు షోవిక్ ను సీబీఐ అధికారులు నిన్న సుదీర్ఘంగా 14 గంటల పాటు ప్రశ్నించారు. షోవిక్ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని, ఈరోజు రియాను ప్రశ్నించారు.
సీబీఐ విచారణకు హాజరవ్వడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు ఓ జాతీయ వార్తా ఛానెల్ కు రియా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె సుశాంత్ పై పలు ఆరోపణలు చేసింది. మరీ ముఖ్యంగా సుశాంత్ మాదకద్రవ్యాలకు బానిస అయినట్టు రియా చెప్పుకొచ్చింది. అయితే సీబీఐ విచారణలో సుశాంత్ వ్యక్తిగత సహాయకుడు సబీర్ అహ్మద్ మాత్రం ఈ విషయాల్ని ఖండించాడు. సుశాంత్ తో 24 గంటల పాటు తను ఉండేవాడినని, తను పనిచేసినన్ని రోజుల్లో ఎప్పుడూ ఎంఎల్, ఎండీ లాంటి డ్రగ్స్ పేర్లు వినలేదని తెలిపాడు. తనకు తెలిసి సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు లేదని స్పష్టంచేశాడు సబీర్.
మరోవైపు సుశాంత్ ఫ్లాట్ ను ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తనకు కూడా తెలుసుకోవాలని ఉందంటూ రియా తెలిపింది. తను సుశాంత్ ను వీడి వెళ్లిన తర్వాత అతడి సోదరి మీతూ సుశాంత్ ఫ్లాట్ కు వెళ్లిందని.. ఆ తర్వాత కొన్ని రోజులకు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని రియా చెబుతోంది. అటు డ్రగ్స్ కు సంబంధించి తను, తన సోదరుడు జరిపినట్టు బయటకొచ్చిన వాట్సాప్ ఛాట్స్ ను రియా ఖండించింది. తను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదంటున్న రియా.. సుశాంత్ మాత్రం గంజాయి పీల్చేవాడంటూ చెప్పుకొచ్చింది.
అటు సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే మరోసారి ఈ కేసుపై స్పందించారు. సుశాంత్ తో తను అస్సలు టచ్ లో లేనని ఆమె మరోసారి స్పష్టంచేశారు. సుశాంత్ డబ్బుతోనే ఫ్లాట్ ను కొనుగోలు చేశాననే ప్రచారాన్ని ఖండించిన అంకిత.. ఇప్పటికీ తన ఫ్లాట్ కు ఈఎంఐలు కడుతున్నట్టు స్పష్టంచేసింది. ప్రస్తుతం రియా-అంకిత మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది.
రియాను సుదీర్ఘంగా విచారించిన తర్వాత సీబీఐ ఓ నిర్ణయానికొచ్చింది. ఈడీతో మరోసారి చర్చించి, మరిన్ని వివరాలు తీసుకోవాలనుకుంటోంది. అదే సమయంలో ఎన్సీబీని కూడా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వమని కోరే అవకాశం ఉంది.