బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ, ఈడీ దాడుల వెనుక దురుద్దేశం ఏంటో తెలంగాణ మంత్రి కేటీఆర్ బయటపెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆ సంస్థలు ఊరికే సోనూసూద్‌పై దాడులకు పాల్పడలేదని, వాటి వెనుక బీజేపీ కుట్రలు దాగి ఉన్నట్టు ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
హెచ్‌ఐసీసీలో కొవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోసూసూద్ హాజరయ్యారు. సోనూసూద్… బాలీవుడ్ నటుడిగా మాత్రమే కరోనాకు ముందు తెలుసు.
కరోనా కష్టకాలంలో ఆయన ఉదాత్త సేవలు యావత్ ప్రపంచం దృష్టిలో ఆయన హీరో అయ్యారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన సంస్థల కార్యాలయాలతో పాటు ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులకు పాల్పడడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇదే విషయాన్ని నేడు కేటీఆర్ ప్రస్తావించారు.
సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతనిపై దుష్ప్రచారం చేశారని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. అందుకే సోనుసూద్‌పై ఐటీ, ఈడీ దాడులు చేయించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మంచి మనిషి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని విమర్శించారు.
సోనూసూద్ రియల్ హీరో అని ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదని సోనూసూద్‌కు కేటీఆర్ సూచించారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కొవిడ్ కష్టకాలంలో సోనుసూద్ సేవాభావాన్ని చాటుకున్నారన్నారు. తన పని.. సేవతో ప్రపంచం దృష్టి ఆకర్షించారన్నారు.