మోదీ టాప్, మోదీ గ్రేట్, మోదీ నెంబర్-1.. గత కొంతకాలంగా అంతర్జాతీయ సర్వేల సారాంశం అంతా ఇదే. ఎక్కడ ఏ సర్వే పెట్టినా మోదీ నెంబర్-1 ప్లేస్ లోనే ఉంటారు.
అమెరికా అధ్యక్షుడిని సైతం వెనక్కు నెట్టేయగల సత్తా భారత ప్రధాని మోదీ సొంతం. ఈ సర్వే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలను పక్కనపెడితే.. సర్వేల సారాంశం మోదీకి అనుకూలంగా ఉందా లేదా అనేదే భక్తులకు కావాల్సింది.
మరి దేశం సంగతేంటి..?
భారత్ లో నోట్ల రద్దుతో ప్రజలు కష్టాలు పడినా మోదీ ర్యాంక్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి ప్రజలు అల్లాడిపోయినా మోదీ ర్యాంక్ తగ్గదు.
అంతెందుకు.. ఆకలి కేకల్లో భారత్ టాప్ లో ఉండటం, సమర్థవంతమైన నాయకుడిగా భారత ప్రధాని టాప్ ప్లేస్ లో ఉండటం ఇవి రెండూ ఒకేసారి సాధ్యమేనా..? మన దేశం విషయంలోనే అంతర్జాతీయ సర్వేలు ఇలాంటి పరస్పర విరుద్ధ వివరాలు తెలియజేస్తుంటాయి.
పార్టీ పరిస్థితి ఏంటి..?
సర్వేలన్నీ మోదీ గ్రేట్ అంటున్నాయి, మరి ఎన్నికలన్నీ బీజేపీని ఎందుకు తిరస్కరిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది, బెంగాల్ లో బీజేపీని మమత మరోసారి ఫుట్ బాల్ ఆడారు.
మోదీ నెంబర్-1 నాయకుడైతే.. దేశంలో బీజేపీని ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు. అంటే మోదీ టాప్, పార్టీ వేస్ట్ అని అర్థం చేసుకోవాలా..? మోదీ మంచోడు, పార్టీ చెడ్డది అనుకోవాలా..?
ఏదో జరుగుతోంది..?
దేశీయంగా మోదీ ప్రభ మసకబారుతున్న వేళ, ఇలాంటి సర్వేలు మనకి కొత్తకాదు. కానీ ఎన్నాళ్లిలా సర్వేలతో మభ్యపెట్టి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందనేదే అసలు ప్రశ్న. వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో బీజేపీ భవితవ్యం పూర్తిగా తేలిపోతుంది.
ఇతర రాష్ట్రాల్లో పార్టీ సంగతి ఎలా ఉన్నా.. యూపీ లెక్కలే 2024 సార్వత్రిక ఎన్నికలకు కొలమానం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. విచిత్రం ఏంటంటే.. 2024లో బీజేపీ అధికారంలోకి రాకపోయినా.. మోదీ కచ్చితంగా సర్వేల్లో టాప్ ప్లేస్ లో ఉంటారు. అదే రాబోయే సర్వే సారాంశం.