టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి మాటల్లో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని వారు బలంగా నమ్ముతున్నారు. అలాగే పార్టీ శ్రేణుల్లో ఆ నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని అచ్చెన్నాయుడు అనడం విశేషం. అచ్చెన్నాయుడు మాటల్ని బట్టి అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. మరి తమ పరిస్థితి ఏంటి సామి అని జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జనసేన, పొత్తుల ప్రస్తావనతో సంబంధం లేకుండా టీడీపీ ముందుకెళుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో అచ్చెన్నాయుడు 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని కామెంట్ చేయడం విశేషం.
జనసేన తన ఆశలన్నీ ఆ జిల్లాలపైనే పెట్టుకుంది. అందుకే జనసేనాని పవన్‌కల్యాణ్ వారాహి యాత్రను ఆ జిల్లాల్లోనే మొదలు పెట్టారు. పవన్ సామాజిక వర్గం అక్కడే బలంగా వుంది. తన సామాజిక వర్గం బలమే పార్టీ బలమని, మరెక్కడా తనకు అంత సీన్ లేదని పవన్ ఆలస్యంగా అయినా గుర్తించారు. కావున ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 స్థానాలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. వీటిలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవదని ఆయన పదేపదే చెప్పారు.
టీడీపీతో పొత్తులో భాగంగా వైసీపీని మట్టి కరిపించొచ్చని పవన్ ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అగ్రనేతలు మాత్రం జనసేనతో సంబంధం లేకుండా తమ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. బీజేపీకి పవన్ అంటే ఇష్టం. పవన్‌కేమో చంద్రబాబు అంటే వల్లమాలిన ప్రేమ. చంద్రబాబుకేమో అధికారం అంటే చచ్చేంత ఇష్టం.
ఇందుకోసం ఎవరినైనా ప్రేమించినట్టు నటిస్తారు. టీడీపీ చుట్టూ పవన్‌కల్యాణ్ తిరిగేలా టీడీపీ వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబును నమ్మి జనసేనను పవన్ గాలికి వదిలేశారా? అనే అనుమానం కలుగుతోంది. కానీ జనసేన శ్రేణులు మాత్రం ఏదో అద్భుతం జరగకపోతుందా? అనే భ్రమలో ఉన్నట్టు తెలుస్తోంది.