పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని కిట్టని వారు విమర్శిస్తే విమర్శించారు కానీ, తన మానాన తను సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు పవర్ స్టార్. ఎందుకు అలా అనుకోవడం అంటే ఆయన లైన్ లో పెడుతున్న సినిమాల ప్రాజెక్టులు చూస్తుంటేనే అలా అనిపిస్తోంది.
క్రిష్ డైరక్షన్ లో ఎఎమ్ రత్నం నిర్మాణంలో సినిమా ఫిక్స్. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ పూర్తి చేయగానే ఇదే సెట్ మీదకు వెళ్తుంది. ఆ తరువాత మైత్రీ మూవీస్-హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా వుండనే వుంది.
కానీ పవన్ సినిమాల జాబితా ఇక్కడతో ఆగడం లేదు. నిర్మాత రామ్ తాళ్లూరికి ఓ సినిమా అంటూ వినిపిస్తోంది. దానికి డైరక్టర్ ఫిక్స్ కావాలి. ఇది కాకుండా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లేదా స్ట్రయిట్ కథను ఒక దానిని సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు చేసే అవకాశం వుంది. ఇందుకోసం ఇద్దరు డైరక్టర్లు కథలు తయారు చేస్తున్నారని బోగట్టా.
ఈ రెండు సినిమాల సంగతి ఇలా వుంటే మరో సినిమా చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నారని తెలుస్తోంది. ఒక వేళ అది కూడా ఓకె అనుకుంటే వకీల్ సాబ్ కాకుండా అయిదు సినిమాలు అన్నమాట. ఏడాదికి రెండు సినిమాల వంతున చూసుకున్నా, 2022 చివరి వరకు పవన్ డైరీ ఫుల్ అయిపోయనట్లు అవుతుంది.
ఆ టైమ్ కు ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది కాబట్టి, అప్పుడు మాత్రం సినిమాలకు కామా పెడతారేమో? అన్నట్లు మరో సంగతి. ఇన్ని సినిమాలు చేస్తారని వినిపిస్తున్నా? ఎవరికి ముందు? ఎవరికి వెనుక అన్నది మాత్రం తెలియదు. ఆ విషయంలో ఎవరి లాబీయింగ్ వారిది? ఎవరి ప్రయత్నాలు వారివి.