జ‌గ‌న్ చేతిలో లోకేశ్ భ‌విత‌వ్యం

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతిలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి వుంది. 2024 ఎన్నిక‌లను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా టీడీపీ తీసుకుంది. ఇదే ర‌కంగా వైసీపీ కూడా భావిస్తోంది. ఈ…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతిలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి వుంది. 2024 ఎన్నిక‌లను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా టీడీపీ తీసుకుంది. ఇదే ర‌కంగా వైసీపీ కూడా భావిస్తోంది. ఈ ఒక్క ద‌ఫా టీడీపీని మ‌ట్టి క‌రిపిస్తే మ‌రో రెండు ద‌శాబ్దాల పాటు త‌న అధికారానికి తిరుగులేద‌ని జ‌గ‌న్ ఉద్దేశం. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చుకోలేక‌పోతే ఇక పార్టీకి, వార‌సుడికి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని చంద్ర‌బాబు భ‌యం. ఈ రెండూ క‌రెక్టే.

ఈ నేప‌థ్యంలో లోకేశ్ తన‌ను తాను నాయ‌కుడిగా ఆవిష్క‌రించుకునేందుకు పెద్ద సాహ‌సానికే పూనుకున్నారు. సుదీర్ఘ పాద‌యాత్ర‌కు లోకేశ్ సిద్ధ‌మ‌య్యారు. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేశ్ అడుగులు వేయ‌నున్నారు. 400 రోజుల పాటు సుమారు 4 వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర సాగ‌నుంది. పాద‌యాత్ర‌కు స‌మ‌యం ముంచుకొస్తోంది. పాద‌యాత్ర‌కు అనుమ‌తి కోరుతూ డీజీపీకి టీడీపీ లేఖ రాసింది.

తీవ్రవాదులు, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి లోకేశ్‌కు బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయ‌ని, పాదయాత్ర పొడవునా తగినంత భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల‌ రామయ్య  లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల జీవో నంబ‌ర్‌-1 ద్వారా త‌మ‌ను ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇటీవ‌ల కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితుల గురించి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో లోకేశ్ పాద‌యాత్ర విజ‌య‌వంతం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేత‌ల్లో వుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లోకేశ్ పాద‌యాత్ర‌కు ఎలాంటి అడ్డంకులు సృష్టించ‌కుండా ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తే వివాదం వుండ‌దు. ఒక‌వేళ జీవో నంబ‌ర్‌-1ను అడ్డు పెట్టుకుని లోకేశ్ పాద‌యాత్ర‌ను అడ్డుకుంటే మాత్రం… టీడీపీ నెత్తిన పాలు పోసిన‌ట్టే. అస‌లే లోకేశ్ పాద‌యాత్ర ఏమ‌వుతుందోన‌నే బెంగ టీడీపీని వెంటాడుతోంది.

ఈ స‌మ‌యంలో లోకేశ్ పాద‌యాత్ర‌ను అడ్డుకుంటే మాత్రం జనంలో టీడీపీపై త‌ప్ప‌క సానుభూతి వ‌స్తుంది. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు టీడీపీ ప్ర‌భుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించ‌ని విష‌యం తెలిసిందే. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల పాద‌యాత్ర‌ల్ని అడ్డుకోవ‌డం ఏంట‌నే వ్య‌తిరేక‌త పౌర స‌మాజం నుంచి త‌ప్ప‌క వ‌స్తుంది. అనివార్యంగా ఇది లోకేశ్‌కు రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంది. 

ఏపీ ప్ర‌భుత్వ తీరు గ‌మ‌నిస్తే… ఏం చేయ‌డానికైనా వెనుకాడన‌ట్టే క‌నిపిస్తోంది. క‌నీసం లోకేశ్ పాద‌యాత్ర‌ను స‌వ్యంగా సాగేలా చేస్తే… ఆయ‌న స‌మ‌ర్థ‌త ఏంటో జ‌నానికి తెలుస్తుంది. ఏపీ ప్ర‌భుత్వం అత్యుత్సాహానికి పోయి లోకేశ్‌ను అడ్డుకుంటే… పాద‌యాత్ర ప్ర‌యోజ‌నాల్ని చేజేతులా వైసీపీనే స‌మ‌కూర్చిన‌ట్టు అవుతుంది.