ఈనాడు మీడియా గ్రూప్ అధినేత రామోజీరావు జర్నలిజం నైతిక విలువలకు పూర్తిగా పాతరేశారు. చంద్రబాబునాయుడి పల్లకీ మోయడమే ఏకైక ఎజెండాతో ఆయన ముందుకెళుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా చంద్రబాబునాయుడికి ఐటీశాఖ నోటీసులు ఇచ్చిన సంగతి వెలుగుతోకి వచ్చింది.
ఇన్ఫ్రాం కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ… చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ గత నెల 4న ఆదాయ పన్నుశాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ సంగతిని జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన సమాచారం “ఈనాడు” పత్రికలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇలాంటి నోటీసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేదా వైసీపీ నేతలకు జారీ చేసి వుంటే, ఈనాడులో బ్యానర్ కథనంగా రాసి వుండేవాళ్లు. కానీ తాను ఆరాధించే నాయకుడైన చంద్రబాబుకు ఐటీశాఖ నోటీసులు ఇవ్వడంతో , ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకూడదనే తాపత్రయం రామోజీరావు సారథ్యం వహిస్తున్న మీడియాలో కనిపించింది. అందుకే బాబుకు ఐటీ నోటీసులకు సంబంధించి సింగిల్ కాలమ్ వార్తను ప్రచురించడానికి కూడా రామోజీకి మనసు రాలేదు.
రామోజీ మనసెరిగి ఈనాడు జర్నలిస్టులు రాతలు రాయడం, రాయకపోవడం చేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మార్గదర్శి ఆర్థిక అక్రమాల కేసులో రామోజీరావు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. రామోజీకి మద్దతుగా చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలు, జగన్ వ్యతిరేకులు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో చంద్రబాబుకు కష్టమొస్తే తాను కూడా అంతే మద్దతుగా నిలుస్తానని నిరూపించుకునేందుకు ఐటీ నోటీసుల వార్తను ప్రచురించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే రామోజీ పత్రిక రాయకపోతేనో, ఆయన చానల్ చూపకపోతే లోకానికి నిజాలు తెలియని కాలం కాదు ఇది అని ఆయన తెలుసుకుంటే మంచిదని నెటిజన్లు హితవు చెబుతున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన వార్తనే ప్రచురించని ఈనాడు, నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ కథనాలు రాయడం వెనుక దురుద్దేశాలను పాఠకులు గమనిస్తున్నారు. మనోడైతే చాలు…ఏం చేసినా దాచి పెడ్తామని రామోజీరావు చెప్పకనే చెప్పారు.