సంక్రాంతి సినిమాల పోటీ వారసుడితో మొదలవుతుంది. కల్యాణం కమనీయం సినిమాతో ముగుస్తుంది. ఇది నిన్నటి మాట. ఇప్పుడు ఆర్డర్ మారింది. ముందు వస్తాడనుకున్న వారసుడు లేటుగా వస్తున్నాడు.
తను నిర్మించిన వారసుడు సినిమా విడుదల తేదీని వాయిదా వేశాడు నిర్మాత దిల్ రాజు. ఇంతకుముందు అనుకున్నట్టు 11వ తేదీకి కాకుండా, 14వ తేదీకి సినిమాను విడుదల చేస్తున్నాడు. దీనికి ఆయన రీజన్ కూడా చెప్పాడు.
“ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి థియేటర్ల ఇష్యూ అని చెప్పి నన్ను చాలామంది టార్గెట్ చేస్తున్నారు. నేను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నాను, కానీ వివాదాలు ఆగడం లేదు. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మెయిన్ కారణం బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ లో ముందు వాళ్ల సినిమాలు పడాలి. ఎందుకంటే వాళ్లు పెద్ద స్టార్లు. వాళ్లకు ఎక్కడ కోరుకుంటే అక్కడ థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలి. అందుకే వారసుడ్ని వాయిదా వేశాను.”
బాలయ్య, చిరంజీవి సినిమాలకు వారసుడు పోటీ కాదంటున్నాడు దిల్ రాజు. వారసుడు ప్రాపర్ సంక్రాంతి సినిమా అని.. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, శతమానంభవతి సినిమాల టైపులో వారసుడు కూడా సంక్రాంతికి రావాల్సిన సినిమా అని అంటున్నాడు.
ఇక కోలీవుడ్ రిలీజ్ పై కూడా స్పందించాడు దిల్ రాజు. తమిళనాట విజయ్ సినిమా 11వ తేదీకే వస్తోంది. తెలుగు వెర్షన్ మాత్రం 14వ తేదీకి వస్తోంది. ఇలా 3 రోజులు ఆలస్యంగా రిలీజ్ అవ్వడం వల్ల తెలుగు వెర్షన్ పై తమిళ రిలీజ్ ప్రభావం పడదని, తనకు కంటెంట్ పై పూర్తి నమ్మకం ఉందని అంటున్నాడు దిల్ రాజు.