టీఆర్ఎస్‌కు భారత రాష్ట్ర సమితిగా జాతీయపార్టీ హోదాతో కొత్త రూపు ఇచ్చిన కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించబోతున్నారు. చాలా అట్టహాసంగా దేశవ్యాప్తంగా కీలక నాయకులకు తన బలం తెలిసేలా ఈ సభను నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఈ సభకు సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానిస్తున్నారు. అయితే సరిగ్గా ఆవిర్భావ సభ నిర్వహించేనాటికే ఆయనకు గట్టిగా ఝలక్ ఇవ్వాలని తెలంగాణలో విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి.
ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభ పెడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా కీలక నాయకుల్ని.. ఈలోగా భారాసను వీడి తమ పార్టీలో చేర్చుకుంటే అది కేసీఆర్ ఇమేజికి పెద్ద దెబ్బ అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. భారాసను వీడిపోయే ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించి వీరు ఇప్పటికే పలువిధాలుగా సంకేతాలు ఇచ్చారు.
తుమ్మల ఏ పార్టీలోకి వెళ్తారనేది స్పస్టత రాకపోయినా.. పొంగులేటి బిజెపిలో చేరడం అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే. ఈ నేపథ్యంలో ఈనెల 18 న సభ జరిగేలోపే పొంగులేటిని, ఆయన వర్గీయులతో సహా తమ పార్టీలో చేర్చేసుకుంటే బాగుంటుందని బిజెపి యోచిస్తోంది.దీనికి సంబంధించి అప్పుడే మంతనాలు ప్రారంభించారు. 18కి ముందురోజు పొంగులేటి పార్టీ మారి.. కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తే.. ఆవిర్భావ సభ జరిగేరోజున పత్రికల్లో పతాక శీర్షకలన్నీ ఆ వార్తలే ఉంటాయి. అది జాతీయ స్థాయి నాయకుల ఎదుట కేసీఆర్ కు డేమేజి అవుతుందని వారి నమ్మకం.
ఇలాంటి సమయానుకూల, టైం బౌండ్ వ్యూహాలను అమలు చేయడంలో బిజెపికి చాలా అనుభవం ఉంది. కేసీఆర్ ఇమేజిని దెబ్బకొట్టడానికి, ప్రజలతో మైండ్ గేమ్ ఆడటానికి వారి దగ్గర చాలా ట్రిక్కులు ఉంటాయి.మునుగోడు ఎన్నిక జరుగుతున్న సమయంలో గులాబీ పార్టీ నుంచి తమ పార్టీలోకి అనేకమంది చేరికల్ని ప్రోత్సహించారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా ఈ వ్యూహాల్లో భాగంగా.. కమలతీర్థం పుచ్చుకుని.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఆ మైండ్ గేమ్ బాగానే వర్కవుట్ అయింది గానీ.. మునుగోడు ఎన్నికలు మాత్రం గెలవలేకపోయారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా మైండ్ గేమ్ కు తెరలేపుతున్నారు.
తుమ్మల సంగతి ఇంకా స్పష్టత రాలేదు. ఆయన కూడా 18కంటె ముందుగానే పార్టీ మారుతారా? అసలు ఏ పార్టీలోకి వెళ్లాలనేది డిసైడ్ అయ్యారా? లేదా, ఇంకా కొన్నాళ్లు వేచిచూసే ధోరణిలో ఉంటారా? అనేది తెలియడం లేదు.