సీమ భ‌విష్య‌త్‌కు పొంచిన ముప్పు!

ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ముగింపు దశకు చేరుకుంది. 2024 మేకి 10 సంవత్సరాల కాలపరిమితి ముగియనుంది. విభజన చట్టంలో పేర్కొని, అమలుకాని అంశాలపై దృష్టి సారిస్తున్నారు. కానీ రాయలసీమ భవిష్యత్తు కు సంబంధించిన…

ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ముగింపు దశకు చేరుకుంది. 2024 మేకి 10 సంవత్సరాల కాలపరిమితి ముగియనుంది. విభజన చట్టంలో పేర్కొని, అమలుకాని అంశాలపై దృష్టి సారిస్తున్నారు. కానీ రాయలసీమ భవిష్యత్తు కు సంబంధించిన కీలక అంశం చర్చకు రావడం లేదు. అదే ఆర్టికల్ 371 డి.

ఆర్టికల్ 371 డి నేపథ్యం…

1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం -తెలంగాణ కలిపి ఆంద్రప్రదేశ్‌గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కలవడానికి తెలంగాణ నుంచి వచ్చిన ప్రధాన వ్యతిరేకత… వెనుకబడిన తాము విద్యా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందిన కోస్తాంధ్రతో కలిస్తే  శాశ్వతంగా నష్టపోతామని. వారి భయాలను దృష్టిలో పెట్టుకొని పెద్దమనుషుల ఒప్పందంలో విద్యా ఉపాధి అవకాశాలలో వెనుకబడిన తెలంగాణకు రక్షణ ఏర్పాట్లు చేయాలనే అవగాహన కుదిరింది. అటుపిమ్మట జై ఆంధ్ర, తెలంగాణ విభజన ఉద్యమాలు వచ్చిన నేపథ్యంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆంద్రప్రదేశ్ ఐక్యతను కాపాడటం, వెనుకబడిన ప్రాంత ప్రజల విద్యా ఉపాధికి రక్షణ కోసం ఆర్టికల్ 371 డిని తీసుకొచ్చి 1973 లో 32 రాజ్యాంగ సవరణతో విలీనం చేశారు.

రాష్ట్ర‌ప‌తి ఆమోదం తర్వాత గెజిట్ చేయడంతో అమల్లోకి వచ్చింది. తెలంగాణకు 46 శాతం, కోస్తాంధ్రకు 32 శాతం, రాయలసీమ కు 22 శాతం అవకాశాలు వస్తాయి. అదే సమయంలో ఉన్నత, సాంకేతిక, మెడికల్ విద్యలో ఉస్మానియా జోన్‌గా తెలంగాణ, AU జోన్ గా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు, అలాగే SVU జోన్‌లో రాయలసీమ- నెల్లూరు జిల్లాలుగా ఏర్పాటు చేసి ఆయా జోన్‌ల‌లో వారికి 85 శాతం రిజర్వేషన్ కల్పించారు.

మ‌నుగ‌డ కోల్పోనున్న‌ ఆర్టికల్ 371 డి  

ఆర్టికల్ 371డి కేవలం ఆంద్రప్రదేశ్ కోసం రూపొందించింది. ఆంద్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఆర్టికల్ 371డి కూడా మనుగడను కోల్పోతుంది. విభజన చట్టంలో ఈ చట్టం రెండు రాష్ట్రాలలో 10 సంవత్సరాలు పాటు యధాత‌థంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే 24 మేకి ముగుస్తుంది. ఆ తర్వాత వెనుకబడిన ప్రాంత ప్రజల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమల్లో ఉండదు.

రాయలసీమకు వచ్చిన ముప్పు ఏమిటి ?  

2014 విభజన తర్వాత ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. కోస్తాంధ్ర ప్రాంతం ప్రారంభంలోనే ఆంగ్లేయుల ఏలుబడి కింద‌కు రావడంతో విద్యా సంస్థలు అందుబాటులోకి వ‌చ్చాయి. అలాగే కాటన్ దొర కారణంగా గోదావరి, కృష్ణ పై బ్యారేజీలు రావడంతో విద్యా వైద్య పరంగా అభివృద్ధి చెందింది. సహజంగా ఓపెన్ పోటీలో అవకాశాలు వారికే దక్కే అవకాశం ఉంది. ఇది అపోహ కాదు పద్మావతి మెడికల్ కళాశాల అనుభవం కూడా అదే చెబుతుంది. ఆర్టికల్ 371డి అమలు కారణంగా SV, కర్నూలు మెడికల్ కళాశాలల్లో 85 శాతం సీట్లు రాయలసీమకు దక్కుతున్నాయి.

పద్మావతిలో 120 సీట్లలో 102 సీట్లు రావాల్సి వుంటుంది. అయితే అందుకు భిన్నంగా జీఓ 120 (ఓపెన్ కేటగిరీ) అమలు కారణంగా 2014 – 15 విద్యా సంవత్సరంలో  రాయలసీమకు 20 లోపు సీట్లు ద‌క్కాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి జీఓ నెంబర్ 120ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రాయలసీమ ఉద్యమ సంస్థలు చేసిన పోరాటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఆర్టికల్ 371డి రక్షణ ఉంది కాబట్టి విజయం సాధించాం. చట్ట బద్ధత లేకపోతే ? ఎందుకంటే నాటి తెలుగుదేశం ప్రభుత్వం 120 అమలు కోసం సుప్రీం వరకు వెళ్లింది. 371డి లేకుండా ఉంటే ఒక్క పద్మావతి మెడికల్ కళాశాలలోనే దాదాపు ప్రతి ఏటా 100 మెడికల్ సీట్లను రాయలసీమ- నెల్లూరు విద్యార్థులు కోల్పోయే పరిస్థితి. నేడు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మన రాయలసీమకు వచ్చినా అందులో ఉన్న వందలాది మెడికల్ సీట్లకు గ్యారెంటీ లేదు.

విభజన చట్టం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  న్యాయ నిపుణులతో చర్చించాలి. ఆర్టికల్ 371డి ని ఏపీలో కొనసాగించేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. రాయలసీమ ఆలోచనాపరులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విభజన చట్టం ముగిసే లోపు చట్టబద్ధ రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరం.