అవినీతికి ప్యాంటూ షర్ట్ వేస్తే అచ్చం చంద్రబాబు అవుతారు అంటూ పవర్ ఫుల్ సెటైర్ పేల్చేశారు వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్. పాలూ పెరుగు వ్యాపారం చేసి లక్షల కోట్లు సంపాదించాను చంద్రబాబు అంటే నమ్మాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి ఇపుడు బయటపడుతోందని ఆయన అంటున్నారు.
గతంలో చేసిన పనులకు ఇపుడు కర్మ ఫలం అనుభవించడమే బాబుకు రాసిపెట్టి ఉందని ఆయన పేర్కొన్నారు. అవినీతి అంటే ఏంటో తనకు తెలియదు అని చెప్పే చంద్రబాబు తనపైన వచ్చిన ఆరోపణలకు సమాధానం ఏమిస్తారు అని గుడివాడ నిలదీశారు.
హిందూస్థాన్ టైమ్స్ పత్రిక బాబు సీఎం గా ఉన్నపుడు అవినీతికి పాల్పడ్డారు అని రాసిందని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందని దాని మీద చంద్రబాబు ఎందుకు నోరు మెదపడంలేదని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు రాష్ట్ర ఖజానాను పిండి సంపాదించారు తప్ప ఆవు పాలు గేదె పాలుతో సంపాదించింది కానే కాదని తాజాగా తేటతెల్లమైందని గుడివాడ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నపుడు రాష్ట్ర ఖజానాను నిలువునా దోచిన చంద్రబాబు తనపైన వచ్చిన ఆరోపణలకు స్పందించాల్సి ఉందని అన్నారు.
తన తల్లిని ఎవరూ ఏమీ అనకపోయినా కేసులు వేస్తున్న నారా లోకేష్ హిందూస్థాన్ టైమ్స్ పత్రిక మీద కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బాబు అవినీతిలో ఇది మచ్చుతునక అని ఇంకా రావాల్సింది కొండంత ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.