తహశీల్దారును చంపిన సురేష్ మృతి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దారు హత్య కేసులో కీలక నిందితుడు సురేష్ మరణించాడు. తహశీల్దారు విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సురేష్, అదే ఘటనలో తను కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు.…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దారు హత్య కేసులో కీలక నిందితుడు సురేష్ మరణించాడు. తహశీల్దారు విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సురేష్, అదే ఘటనలో తను కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. 60శాతానికి పైగా గాయాలతో బయటపడిన సురేష్ ను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అప్పట్నుంచి వెంటిలేటర్ పై ఉన్న సురేష్ ఈరోజు మరణించాడు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సురేష్ మృతి చెందినట్టు ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

భూ వివాదం కేసులో సంచలనం సృష్టించిన ఈ సజీవ దహనం కేసులో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందారు. తహశీల్దారు విజయారెడ్డితో పాటు.. ఆరోజు విజయాను కాపాడబోయిన డ్రైవర్ గురునాధం ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు కీలక నిందితుడు సురేష్ కూడా మృతిచెందాడు. సురేష్ మృతి చెందడంతో ఈ కేసు ఇప్పుడు డైలమాలో పడింది. అయితే పోలీసులు మాత్రం ఘటన జరిగిన రోజునే సురేష్ నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మిగిలిన ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షి చంద్రయ్య. ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్న చంద్రయ్యకు కూడా ఆరోజు ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

అటు విజయారెడ్డితో పాటు సురేష్ కూడా మరణించడంతో ఈ కేసు ఇక ముందుకు కదలకపోవచ్చని భావిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం దర్యాప్తును కొనసాగిస్తామని స్పష్టంచేశారు. మరీ ముఖ్యంగా విజయారెడ్డిని హత్య చేసిన తర్వాత.. బయటకొచ్చిన సురేష్ కారులో ఉన్నవారితో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అది ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.