షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా పఠాన్. ఆ క్రెడిట్ ఒక్కటి చాలు సినిమా హిట్ అయిపోతుందనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే అంతకంటే ఎక్కువగా బేషరమ్ పాట హిట్ అయింది. సినిమా పేరు గురించి తెలియకపోయినా ఆ పాట గురించి తెలియనివారు మాత్రం ఉండరు. అయిపోయిన కథంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా.. అసలీ వ్యవహారం తనకు తెలియదంటూ ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ చెప్పడం విశేషం. సోషల్ మీడియాలో మారుమోగిపోయిన బేషరమ్ పాట, దాని చుట్టూ నలుగుతున్న వివాదం గురించి అసలు తనకు తెలియదని చెప్పింది విద్యాబాలన్.
దీపికా పదుకోన్ కాషాయ బికినీ దేశవ్యాప్తంగా ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. షారుఖ్ ఖాన్ తో దీపికా చేసిన పఠాన్ సినిమాలో బేషరమ్ రంగ్ అనే పాటలో దీపికా రకరకాల రంగుల్లోని బికినీల్లో కనపడుతుంది. అయితే చివర్లో ఆమె కాషాయ బికినీ వేసుకోవడం మాత్రం కొంతమందికి అభ్యంతరకరంగా తోచింది. ఆ రంగుని అపవిత్రం చేస్తున్నారంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు, ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడేవారు మండిపడ్డారు.
ప్రతిపక్షాలు ఊరుకుంటాయా.. మేం ఏం తినాలో, ఎలాంటి రంగు బట్టలు వేసుకోవాలో.. బీజేపీ నిర్ణయిస్తుందా అని కౌంటర్ ఇచ్చాయి. సమర్థించేవారు కొందరు, వ్యతిరేకించేవారు మరికొందరు.. ఇలా ఈ పాట డిసెంబర్ 12న నెట్టింట్లోకి వచ్చి సెన్సేషన్ గా మారింది. ఇంత సెన్సేషన్ సృష్టించిన ఈ పాట గురించి విద్యాబాలన్ కి తెలియకపోవడం మరో మరో పెద్ద సెన్సేషన్.
షారుఖ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నా..
షారుఖ్ ఖాన్ కొత్త సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఆ సినిమాకి వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చిన విద్యాబాలన్, వివాదం గురించి అడిగితే మాత్రం సారీ అని చెప్పేసింది. తనకి ఎలాంటి వివాదాల గురించి తెలియదని, అసలు తాను ఓ గుహలో జీవిస్తున్నానని చెప్పి తప్పించుకుంది.
జనవరి 25న పఠాన్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ బ్రేక్ వేసింది. విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంకా క్లియరెన్స్ రాలేదు. బేషరమ్ రంగ్ పాట, అందులో హీరోయిన్ దుస్తులపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలపడంతో చిత్ర యూనిట్ రీషూట్, లేదా గ్రాఫిక్స్ తో మేనేజ్ చేయాలనుకుంటోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఓవైపు ఇంత జరుగుంటే, తనకేం తెలయదంటోంది విద్యాబాలన్. ఈ మధ్య సెలబ్రిటీలు ఏం మాట్లాడినా వివాదాస్పదమౌతోంది. అందుకే విద్యాబాలన్ ఇలా కొత్త దారి ఎంచుకుంది.