వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పదో రత్నం లేదా పథకం ఒకటుంది. అదే సలహాదారుల పథకం. జగన్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా నవరత్నాల పథకాలు బాగా పని చేశాయి. వాటికి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ పథకాల ద్వారా ఒక్కో ఇంటికి లక్షలాది రూపాయలు లబ్ధి చేకూరుతుందనే ప్రచారాన్ని జగన్ ఉధృతంగా తీసుకెళ్లారు. అందుకు తగ్గట్టుగానే జనం నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను నవరత్న సంక్షేమ పథకాలు వైసీపీకి అందించాయంటే అతిశయోక్తి కాదు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదో రత్న సంక్షేమ పథకాన్ని వైసీపీ ముఖ్యుల కోసం అమలు చేస్తున్నారనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి. తాజాగా ఏపీ సర్కార్‌లో సలహాదారుల నియామకంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో, వారిపై చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రులు, మంత్రులకు సలహాదారులను నియమించడాన్ని అర్థం చేసుకోవచ్చని, ప్రభుత్వ శాఖలకు కూడా చేపట్టడం ఏంటని హైకోర్టు నిలదీసింది.
‘ ప్రభుత్వ శాఖకు సలహాదారులను నియమించేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటో తేలుస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. వారికి ఏ ప్రాతిపదికన జీతభత్యాలు చెల్లిస్తున్నారు? ఎంతమందినైనా నియమించుకోవచ్చా? ఇలాగైతే వారి నియామకానికి అంతు ఎక్కడ? అని హైకోర్టు ప్రశ్నించడం చర్చకు దారి తీసింది. తనకు కావాల్సిన వాళ్లకు సలహాదారుల పేరుతో ఏదో శాఖకు నియమించడం, కేబినెట్ హోదా ఇవ్వడం, లక్షలాది రూపాయలు జీతాలు, ఇతరత్రా ఖర్చులకు ప్రభుత్వ సొమ్మును అప్పనంగా తగలబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలున్నాయి.
ఆ మధ్య సలహాదారుల నియామకంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇంకా నియామకం చేపడుతూనే వుంది. ఒకవైపు కనీసం రోడ్లు వేయడానికి కూడా చిన్న మొత్తంలో నిధులు సమకూర్చలేని పరిస్థితి. ఉద్యోగులు, పెన్షన్‌దారుల జీతాల సంగతి సరేసరి. ఇలా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంటే, మరోవైపు పార్టీ నాయకులకు ఇబ్బడిముబ్బడిగా సలహాదారుల పదవులిచ్చి, లక్షలాది రూపాయలు చెల్లించడంపై సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
అమ్మఒడి పథకం కింద తల్లులకు రూ.13 వేలు ఇస్తే, పదో రత్నం లబ్ధిదారులైన సలహాదారులకు మాత్రం లక్షలాది రూపాయల జీతం, అలాగే కేబినెట్ హోదా అంటూ ప్రతిపక్షాలు వెటకరిస్తున్నాయి. పోనీ సలహాదారులేమైనా సలహాలిస్తున్నారా? సీఎం తీసుకుంటున్నారా? అంటే అదేమీ లేదు. వైసీపీ నాయకులకు సలహాదారుల పదవులు, అధికార హోదా …రాష్ట్ర ఖజానాకు చిల్లు పడడం తప్ప ఒరిగిందేమీ లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.