విజ‌యం ఈట‌ల‌దా.. బీజేపీదా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెలుపు, అక్క‌డ గెలిచిన అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ దా?  లేక తెలంగాణ‌లో అధికారం రేపు త‌మ‌దే అంటున్న బీజేపీ దా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఈ ఓట‌మితో తెలంగాణ‌లో బీజేపీ…

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెలుపు, అక్క‌డ గెలిచిన అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ దా?  లేక తెలంగాణ‌లో అధికారం రేపు త‌మ‌దే అంటున్న బీజేపీ దా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఈ ఓట‌మితో తెలంగాణ‌లో బీజేపీ టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో అడుగు ముందుకు వేసిన‌ట్టేనా?  టీఆర్ఎస్ ను ఓడించి రేప‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి అధికారం అప్ప‌గించ‌డానికి ప్ర‌జ‌లు రెడీ అవుతున్న‌ట్టేనా? అనేవి ప్ర‌శ్న‌లు. ఇప్ప‌టికే తెరాస ను ఓడించి తాము అధికారం చేప‌డ‌తామ‌ని బీజేపీ తెలంగాణ నేత‌లు అనేక సార్లు ప్ర‌క‌టించుకున్నారు.  

టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ కాద‌ని, తామేన‌ని ప్ర‌క‌టించుకుంటూ ఉన్నారు కూడా. ఈ క్ర‌మంలో హుజూరాబాద్ ఫ‌లితం వారి మాట‌ల‌కు మ‌రింత ఊపును ఇస్తుంద‌న‌డంలో అయితే సందేహం లేదు. 

కానీ.. హుజూరాబాద్ ఫ‌లితంలో చాలా స‌మీక‌ర‌ణాలు ఉన్నాయ‌ని మాత్రం బీజేపీ నేత‌లు కూడా గుర్తుంచుకోవాలి. హుజూరాబాద్ లో గెలుపు బీజేపీ ది మాత్ర‌మే కాదు. ఈటల రాజేంద‌ర్ అభ్య‌ర్థిత్వ‌మే అక్క‌డ జ‌యాప‌జ‌యాల‌ను నిర్దేశించింది. ఒక‌వేళ బీజేపీ త‌ర‌ఫున కాకుండా.. ఈట‌ల రాజేంద‌ర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉన్నా, లేక కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఉన్నా.. దాదాపు ఇదే ఫ‌లితం వ‌చ్చేద‌ని స్ప‌ష్టం అవుతోంది. అక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్ ను చూసి క‌మ‌లం గుర్తుకు ఓటు ప‌డింది త‌ప్ప‌, క‌మ‌లం గుర్తును చూసి ఈట‌ల‌కు ఓటు ప‌డ‌లేద‌నేది నిష్టూర‌మైన నిజం. బీజేపీ నేత‌లు ఒప్పుకోని నిజం ఇది.

ఈట‌ల రాజేంద‌ర్ తో కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రిగా లేద‌ని నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు భావించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి రాజ‌కీయ ప‌య‌నంలో ఈట‌ల ప్ర‌స్థానం సామాన్య‌మైన‌ది కాదు. ఇప్పుడు అధికారం ఉంది క‌దా అని ఈట‌ల‌ను కేసీఆర్ ను అవ‌మానించారు, ప‌క్క‌న పెట్టారు, అవినీతి ముద్ర కూడా వేస్తున్నార‌ని స‌గ‌టు తెలంగాణ పౌరుడు భావించాడ‌ని ఈ ఉప ఎన్నిక ఫ‌లితం స్ప‌ష్టం చేస్తూ ఉంది. ఇక ఈట‌ల ప్ర‌చారం కూడా అలాగే సాగింది.  

కేసీఆర్ త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకున్నాడ‌ని, త‌ను మాత్రం నియోజ‌క‌వ‌ర్గాన్నే న‌మ్ముకుంటున్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌చారం సాగింది. చంపుకుంటారా.. సాదుకుంటారా.. అంటూ ఓట‌ర్ల‌ను ఆయ‌న అడిగారు. అంతే కానీ, రాజ‌కీయం మారుతోంద‌ని, టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీని బ‌ల‌ప‌రుచుకుందామంటూ హుజూరాబాద్ లో ప్ర‌చారం చేయ‌లేదు ఈట‌ల‌. త‌న రాజ‌కీయానికి ఒక వేదిక కావాలి. కాంగ్రెస్సా బ‌ల‌హీనంగా ఉంది, ఇండిపెండెంట్ గా నిలిస్తే.. ఎలంటి ఆటంకాలు వ‌స్తాయో అనే భ‌యం, అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబ‌ట్టి.. ఈట‌ల‌కు ఆ పార్టీ త‌ట‌స్థించి ఉండ‌వ‌చ్చు.

తెలంగాణ‌లో బీజేపీ మ‌రీ బ‌ల‌హీనంగా లేద‌నేది ఎంత నిజ‌మో, ఈట‌ల విజ‌యంతో బీజేపీ తెలంగాణ లో అధికారాన్ని సొంతం చేసుకున్న‌ట్టుగా కాద‌నేది అంతే నిజం. అలాగే టీఆర్ఎస్ ను ఓడించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ఈ బై పోల్ జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ త‌న క‌ట్టును పూర్తిగా వ‌దిలేసింది. త‌ను చ‌చ్చినా ఫ‌ర్వాలేదు టీఆర్ఎస్ ను చంపాల‌నే క‌సి కాంగ్రెస్ లో క‌నిపించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అర‌వై వేల ఓట్ల స్థాయిలో సంప్ర‌దాయ ఓటు బ్యాంకును పొందిన ఆ పార్టీ ఇప్పుడు అడ్ర‌స్ లేదంటే.. ఏం జ‌రిగిందో కూడా అర్థం చేసుకోవ‌చ్చు. 

కాంగ్రెస్ ప్ర‌స్తుత ల‌క్ష్యం టీఆర్ఎస్ ఓట‌మి మాత్ర‌మే. అది కూడా బీజేపీ మెజారిటీకి ఇక ముఖ్య కార‌ణం. అయితే ప్ర‌తిసారీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి త్యాగం చేయ‌దు. అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు బీజేపీ కి కాంగ్రెస్ కూడా ప్ర‌త్య‌ర్థే అవుతుంది.