కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. అదే ముందస్తు ఎన్నికలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జోరుగా ప్రచారం చేస్తుండగా ఏపీలో కూడా జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రచారం పెద్దగా సాగడంలేదుగాని అలాంటి అనుమానాలు ఉన్నాయి. జగన్ మంత్రి వర్గం ప్రక్షాళనపై కూడా తర్జనభర్జన పడుతుండటం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులను ఓటమి భయం వెంటాడుతోంది. అందుకే ముందస్తు ఎన్నికల ఆలోచనలు చేస్తున్నారని కొందరు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం బల్ల గుద్ది చెబుతున్నాడు. తెలంగాణలో 2023 ఆఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది ఆగస్టులోనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని రేవంత్ రెడ్డి అదే పనిగా చెబుతున్నాడు. రెండు రాష్ట్రాల్లోనూ పాలకులపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఏపీలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం ప్రదర్శించింది. కానీ వివిధ వర్గాల్లో వ్యతిరేకత చాప కింద నీరులా అంతర్గతంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయంగా బలహీనంగా ఉందనేది వైసీపీ నేతల అంచనా. దీంతో..టీడీపీ తిరిగి కోలుకోకముందే…ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశం సైతం సీఎం ఆలోచన చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2024 తొలి మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 లో జరగాల్సిన ఎన్నికలను ముందుగానేు 2018 లో వెళ్లటం ద్వారా ప్రతిపక్షాలకు కోలుకొనే అవకాశం లేకుండా చేసారు. ఏపీలోనూ ఇదే ఫార్ములా అనుసరించే అవకాశం కనిపిస్తోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరో సారి అధికారం దక్కించుకుంటే..ఇక, ఏపీలో టీడీపీ పూర్తిగా దెబ్బ తింటుందని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. అందునా..కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను సీఎం జగన్ నిశితంగా గమనిస్తున్నారు. కేంద్రంలోనూ 2024 లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ సమయంలోగానే ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసుకొని..తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత లోక్ సభ ఎన్నికల్లొ ఎంపీ సీట్ల పైన ఫోకస్ పెట్టాలనేది వైసీపీ ముఖ్య నేతల ఆలోచనగా చెబుతున్నారు.
ఎలాగైనా అధికారం తిరిగి దక్కించుకోవటం ద్వారా రాష్ట్రంలో ఇక వైసీపీ బలమైన ప్రత్యామ్నాయం లేని పార్టీగా ఎదుగుతుందనే నమ్మకం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పాలనా పరంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ.. రాజకీయంగా ప్రత్యర్ధులకు అవకాశం లేకుండా ప్రజల్లోనే ఉండటం ఈ వ్యూహంలో భాగంగా తెలుస్తోంది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నా..ఆ సమయంలో పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా..ముందస్తుగానే ప్రణాళిలతో సిద్ధం కావాలని మాత్రం జగన్ డిసైడ్ అయిపోయారు.
తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని.. ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందని కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు. అయితే కేసీఆర్ తమ నేతలకు ఈ రకమైన క్లారిటీ ఇవ్వాల్సి రావడం వెనుక అసలు కారణంగా రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న రేవంత్ రెడ్డి.. మరోసారి కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళతారని అన్నారు. ఆయన కామెంట్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టాయి.
ఏకంగా ఈ విషయాన్ని కేసీఆర్ ముందే ప్రస్తావించేలా చేశాయి. అయితే కేసీఆర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం మళ్లీ ముందస్తు గురించి మాట్లాడటం ఆపడంలేదు. వచ్చే ఆగస్టు తరువాత కేసీఆర్ కచ్చితంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని మరోసారి ఓ ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు.
దీన్ని బట్టి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉందని అంచనా వేశారు. అయితే కేసీఆర్ చెప్పినా.. రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎందుకు అదే వాదన వినిపిస్తున్నారనే అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేవంత్ ముందస్తు ఎన్నికల ప్రచారం చేయడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని కొందరు చెబుతున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే.. ఎన్నికలు మరెంతో దూరంలో లేవని చెప్పాల్సి ఉంటుంది. ఈ కారణంగా రేవంత్ రెడ్డి ఈ రకమైన వాదనను గట్టిగా వినిపిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
అయితే రేవంత్ రెడ్డి ఈ రకమైన వాదన చేయడం వెనుక మరో కారణంగా కూడా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఎన్నికలు తొందరగానే వస్తాయనే ప్రచారం జరిగితే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అలా చేయడం వల్ల పార్టీ మారే నాయకులు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్న నేతలు తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. వారిలో కొందరు మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని అనుకుంటున్నారు. అయితే ఎన్నికలకు మరికొంతకాలం సమయం ఉండటంతో.. చాలామంది నేతలు వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు. అలాంటి వాళ్లు సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకుని పార్టీలోకి రావాలంటే.. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయనే వాతావరణం కల్పించాలని రేవంత్ రెడ్డి భావించి ఉండొచ్చనే చర్చ కూడా సాగుతోంది.
అయితే కేసీఆర్ ఆలోచన విషయంలో రేవంత్ రెడ్డి ఉన్నంత ధీమాగా బీజేపీ నేతలు మాత్రం కనిపించడం లేదని వాదన కూడా ఉంది. మొత్తానికి తెలంగాణలో కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏమిటో తెలియాల్సిఉంది. గతంలోముందస్తు ఎన్నికలు పెట్టినప్పుడే కేసీఆర్ ముందుగా మోడీ దగ్గరకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. మరి మళ్ళీఈసారి కూడా ముందస్తుకు వెళతామంటే ఒప్పుకుంటారా?
అప్పట్లోనే ఎన్నికల కమిషన్ ముందస్తు ఎన్నికలకు వ్యతిరేకించింది. ఈసీ ఇచ్చిన వివరణతో తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే ప్రధానిని కలిసేందుకు ఆగమేఘాలపై ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీతో కలిసి సాంకేతిక సమస్యలను త్వరలో పరిష్కరించి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చేలా చూడాలని అభ్యర్థించారు. అంతేకాదు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మద్దతు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన లేఖను కూడా ఈసీ ప్రస్తావించింది.
జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ముందస్తు ఎన్నికలను కోరడమేంటని కూడా ఈసీ ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం ఈసీని ఒప్పించి ఎన్నికలు డిసెంబర్‌లోనే నిర్వహింపచేసుకుంది. ఘన విజయం సాధించింది. కానీ ముందస్తు ఎన్నికల వ్యూహం అన్నివేళలా విజయం తెస్తుందని చెప్పలేం. మరి ఏ రాష్ట్రం ముందస్తు ఎన్నికలకు వెళుతుందో చూడాలి.
-నాగ్ మేడేపల్లి