కేసీఆర్ ప్రవచనాలు ప్రజలను మెప్పించవు!

మొత్తానికి ఏపీలో బీఆర్ఎస్ మంచి జోరుమీదున్నట్టుగా కనిపిస్తోంది. కొత్తగా పగ్గాలు చేతబట్టిన తోట చంద్రశేఖర్.. మూడుసార్లు ఎన్నికల్లో నెగ్గలేకపోయినప్పటికీ.. చాలా ఉత్సాహంగా ఏపీలో పార్టీ విస్తరణకు నడుం బిగించి ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో నెగ్గాలంటే…

మొత్తానికి ఏపీలో బీఆర్ఎస్ మంచి జోరుమీదున్నట్టుగా కనిపిస్తోంది. కొత్తగా పగ్గాలు చేతబట్టిన తోట చంద్రశేఖర్.. మూడుసార్లు ఎన్నికల్లో నెగ్గలేకపోయినప్పటికీ.. చాలా ఉత్సాహంగా ఏపీలో పార్టీ విస్తరణకు నడుం బిగించి ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో నెగ్గాలంటే ప్రజలు కూడా ఆ నాయకుడిని ఆమోదించాలి. కానీ.. ఎన్నికలకు ముందు హడావుడి చేయడానికి, సభలను భారీగా నిర్వహించడానికి, సభ్యత్వ నమోదులాంటి ప్రహసన ప్రాయమైన పనులు చేయడానికి కేవలం డబ్బుంటే చాలు. అది కొత్త సారథి తోట చంద్రశేఖర్ వద్ద పుష్కలంగా ఉంది. దానిని వెదజల్లి బీఆర్ఎస్ ఏపీ ఆవిర్భావ సభలను ఎంత అట్టహాసంగానైనా నిర్వహించగలరు. కానీ.. ఆ అట్టహాసం ప్రజాదరణకు ప్రతీక కాదని కేసీఆర్ తెలుసుకోవాలి. 

దేశాన్ని ఉద్ధరిస్తా అంటూ ఆయన చెప్పే ప్రవచనాలు ప్రజలను మెప్పించవు అని కూడా ఆయన తెలుసుకోవాలి.తోట చంద్రశేఖర్ పాపం ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ గొడుగు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్రచారానికి తాను బాకాగా మారుతూ వచ్చారు. ఆయన కీర్తికోసం తాను ఖర్చుపెడుతూ వచ్చారు. ఆశించినదెల్లా రాజకీయ అధికార పదవి. పవన్ కల్యాణ్ క్రేజ్ ఏదో ఒరగబెట్టేస్తుందని అనుకుంటే.. ఎన్నికల్లో అలాంటిదేం జరగలేదు. మరి ఏపీ ప్రజలు, రాష్ట్రశత్రువుగా భావించే కేసీఆర్ కు అక్కడ ఓట్లు వేయించగల పాటి సత్తా ఉంటుందని ఎలా అనుకున్నారో గానీ.. మొత్తానికి ఇప్పుడు కేసీఆర్ పంచన చేరారు. 

ఏపీలో ఆవిర్భావ సభ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. పార్టీ విస్తరణ, పటిష్ట నిర్మాణం ఇలాంటి వ్యవహారాలపై కేసీఆర్ తో చర్చిస్తున్నారు. సభ ఎక్కడ? ఎప్పుడు? అనేది త్వరలోర తేలుతుందిట. బహుశా కేసీఆర్ ముహూర్తం చూసుకోవాల్సి ఉంటుంది. పార్టీ ఆఫీసు ప్రారంభం వారికి చాలా చిన్న సంగతి.పార్టీకి భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేయాలని, మంచి ఆలోచనలున్న వారిని పార్టీలో చేర్చుకోవాలని, పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయాలని ఇలా కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేశారు. 

ఇదంతా ఒక ఎత్తు. కేసీఆర్ ప్రవచనాలు ఇంకో ఎత్తు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కేసీఆర్ ఈ సందర్భంగా తోటకు దిశానిర్దేశం కూడా చేశారు. ఈ ‘దేశోద్ధరణ, గుణాత్మక మార్పు’ లాంటి పడికట్టు పదాల ప్రవచనాలు ఎవరికి కావాలి? ఏపీ ప్రజల ఓట్లు కోరుకుంటే.. ఏపీకి కేసీఆర్ ఏం చేయబోతున్నాడో చెప్పాలి? కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో? రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో చెప్పాలి? ఎక్కడా అధికారంలోకి రాకపోయినా సరే.. ఏపీ ప్రజల ఏ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటారో చెప్పాలి. 

తాను హామీ ఇచ్చే ఏపీ ప్రజా ప్రయోజనాల సాధనకు ఇతరులతో కలిసి పోరాడడానికైనా సిద్ధంగా ఉంటారా? ఓట్లు రాకపోయినా సరే.. ఆ హామీల పట్ల చిత్తశుద్ధిని చూపిస్తారా అనేది కూడా చెప్పాలి. ఏపీ ప్రజల కోసం ఏం నిర్మాణాత్మక హామీలు ఇస్తారో చెప్పకుండా, దేశంలో గుణాత్మక మార్పు అనే ప్రవచనాలు చెబితే ప్రజలు ఎందుకు ఆదరించాలి!