రేవంత్ రెడ్డి పూర్తిగా విసిగిపోయాడా?

రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీడీపీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడో అప్పటి నుంచి ఆయనకు కష్టాలే. ప్రతి విషయంలోనూ పార్టీ సీనియర్లు ఆయన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. పార్టీలో చేరిన కొత్తల్లోనే ఆయనకు సహాయ నిరాకరణ…

రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీడీపీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడో అప్పటి నుంచి ఆయనకు కష్టాలే. ప్రతి విషయంలోనూ పార్టీ సీనియర్లు ఆయన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. పార్టీలో చేరిన కొత్తల్లోనే ఆయనకు సహాయ నిరాకరణ ఎదురు కావడంతో రేవంత్ కొన్ని రోజులు గాంధీ భవన్ కు కూడా వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరగానే రేవంత్ తన సహజమైన దూకుడును చూపించాడు. ఈ ధోరణి సీనియర్లకు నచ్చలేదు. ఆయన అధ్యక్షుడు కావడం అసలు నచ్చలేదు. పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టినా సీనియర్లు సహకరించలేదు. పార్టీలో గొడవలు, ఉప ఎన్నికల్లో ఓటమి, తన సొంత స్థానాలు కూడా కాంగ్రెస్ పోగొట్టుకుంది. కొందరు పార్టీ నుంచి వెళ్లిపోయారు. 

రేవంత్ సీనియర్ల నుంచి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎన్నో నిందలు మోశాడు. చివరకు విసిగిపోయాడు. ఆయన్ని వైరాగ్యం ఆవరించింది. విరక్తి కలిగింది. తనకు అధ్యక్ష పదవి పైన ఎటువంటి ఆశ లేదన్నారు. తాను పదవి నుంచి తప్పుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. పిసీసీ అధ్యక్ష పదవి ఎవరికి డిసైడ్ చేసినా వారిని కూర్చోపెట్టి తన భుజాల పైన పల్లకి మోయటానికి సిద్దమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పిన పని చేయటం మినహా తనకు ఎటువంటి ప్రత్యేక అజెండా లేదన్నారు. కాంగ్రెస్ నేతల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి పలువురు సీనియర్లు దూరంగా ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు.

కాంగ్రెస్‌ శిక్షణా తరగతులకు హాజరు కావాలని అసంతృప్తితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేశారు. అయితే సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసినా లైట్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పట్ల అసమ్మతి పెరిగిపోయి తాడో పేడో తేల్చుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతున్న తరుణంలోనే దిగ్విజయ్ సింగ్ రంగ ప్రవేశం చేశారు. సీనియర్లతో పలు అంశాలు చర్చించారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. పార్టీలో అందరూ సమానమేనని చెప్పారు. ఒక పక్క దిగ్విజయ్ చర్చలు జరపగా మరో పక్క అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు నేతలు సీనియర్లకు టచ్ లోకి వచ్చారు. 

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కూడా ఒక్కరిద్దరు నేతలతో ఫోన్లో మాట్లాడి పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. అయినా సీనియర్లలో మార్పు రాలేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గాడిన పెట్టాలని, ప్రజల మద్దతు కూడగట్టాలని రేవంత్‌ భావిస్తుంటే.. ఆయన కాళ్లు పట్టుకుని లాగేందుకు కాచుకూర్చున్నారు సీనియర్లు. ఇప్పటికే తామే అసలైన కాంగ్రెస్‌ వాదులం అంటూ సంక్షోభానికి తెరలేపిన అసమ్మతి వర్గం, తాము ఎదగకపోయినా పరవాలేదు రేవంత్‌రెడ్డి మాత్రం ఎదగకూడదన్న భావనలో ఉన్నారు. వీలైతే రేవంత్‌ను తొక్కేద్దాం అన్నంత కసిగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రేవంత్‌ పాదయాత్ర అనడడంతోనే సీనియర్లు కూడా అదే రాగం అందుకున్నారు. తాము కూడా తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాంటున్నారు. 

ఇన్నాళ్లూ పార్టీ బలోపేతానికి ఒక్క కార్యక్రమం కూడా చేయని నేతలు.. ఆరు పదుల వయసు దాటి రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అసలైన కాంగ్రెస్‌ వాదులకు రేవంత్‌ యాత్ర అనగానే.. వారికీ యాత్రలు గుర్తొచ్చాయి. కలసి పనిచేయాల్సిన చోట కయ్యం షురూ చేస్తూ పార్టీని సర్వ నాశనం చేయాలన్న సంకల్పమే సీనియర్లలో ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నేతల్లో ఓర్వలేనితనం ఎక్కువ.

తమకంటే వెనుక వచ్చిన నేతలకు పదవులు వచ్చినా, జనాదరణ పెరుగుతున్నా, బలమైన నేతలుగా మారుతున్నా సీనియర్లు ఓర్వలేకపోతున్నారు. ఇప్పుడు రేవంత్‌ విషయంలో అదే జరుగుతోంది. టీడీపీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్‌ అయ్యాడని, ఇటీవలి కమిటీల్లో తన వర్గంవారికే పదవులు ఇప్పించుకున్నాడని అసంతృప్తితో ఉన్న సీనియర్లు ఎలాగైనా రేవంత్‌ ఎదగకుండా చేయాలని చూస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డికి విసుగుపుట్టి తాను పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ పరిస్థితిని అధిష్టానం ఎలా టాకిల్ చేస్తుందో చూడాలి.